Jun 14,2022 06:38

జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, ఆ రాష్ట్ర హౌదాను కూడా లాగేసి, రెండు ముక్కలు చేసి, కాశ్మీర్‌ లోయను బందిఖానాగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన మోడీ ప్రభుత్వం చివరికి సాధించిందేమిటి ? అణచివేత విధానాలతో శాంతిని నెలకొల్పాలని బిజెపి భావించడం దాని ఫాసిస్టు స్వభావానికి నిదర్వనం. ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అణచివేత విధానాలకు పాల్పడుతుంటే, దానికి ప్రతిఘటన కూడా రెట్టింపు స్థాయిలో వస్తున్నది. మోడీ ప్రభుత్వ మతిమాలిన విధానాలతో కాశ్మీర్‌ లోయ రావణ కాష్టంగా తయారైంది. అక్కడ కాల్పులు ఆగలేదు, నెత్తురు చిందుతూనే ఉన్నది. అందాల కశ్మీరం నేడు కన్నీటి కాశ్మీరంగా మారింది. ఉగ్రవాదులు ఎంపిక చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. బాధితుల్లో పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షిత దాడులో 16 మంది వరకు చనిపోయారు. ఒక్క మే నెలలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్‌లోని పాఠశాల ఉపాధ్యాయురాలు రజినీ బాలా ఉగ్రవాదుల కాల్పుల్లో ఇటీవల చనిపోయారు. ఇది మోడీ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యం. 2016లో నోట్ల రద్దు చేసినప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు ఇక డబ్బు అందదని, ఉగ్రవాదం ఇక ఉండదని ప్రధాని మోడీ చెప్పారు. 2019లో కేంద్రంలో మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే జమ్మూ కాశ్మీర్‌ కు సంబంధించిన ఆర్టికల్‌ 370, 35ఎ లను మోడీ ప్రభుత్వం ఏక పక్షంగా రద్దు చేసింది. రాష్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కుదించింది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకే ఈ చర్య అవసరమైందని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాదించింది. దీనికి కాశ్మీర్‌ ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఆ ప్రాంతానికి ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్స్‌ వ్యవస్థను స్తంభింపజేసింది. రాజకీయ నాయకులను గృహనిర్బంధంలో నెలల తరబడి ఉంచింది. కాశ్మీర్‌లోయకు ప్రధాన ఆదాయ వనురు అయిన పర్యాటకాన్ని దెబ్బ తీసింది. యాపిల్‌ ఎగుమతులు ఆగిపోవడంతో కాశ్మీర్‌ ప్రజలు బతుకు తెరువు కోల్పోయి తీవ్ర ఇబ్బందులనెదుర్కోవాల్సి వచ్చింది. గత రెండున్నరేళ్లలో ఉగ్ర మూకల చొరబాట్లు, దాడులు పెరిగాయే తప్ప తగ్గలేదని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఇది ముమ్మాటికీ మోడీ సర్కార్‌ వైఫల్యమే.
 

- ఎం. వెంకటేశ్వరరావు,
విజయవాడ