Oct 25,2023 09:17

సంప్రదాయ కళల్లో భాగమైన హస్తకళల్లోని ఐపాన్‌ కళలో నిపుణత సాధించి ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందారు ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌ పట్టణానికి చెందిన మీనాక్షి ఖాదీ. తన పూర్వీకుల నుంచి ఎంతో ఆదరణ కలిగిన ఈ కళ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం కనుమరుగౌతున్న విషయాన్ని ఆమె గ్రహించారు. తిరిగి పూర్వవైభవం తీసుకురావటానికి ఆమె ఆరేళ్లుగా నిర్విరామంగా తన కృషిని కొనసాగిస్తున్నారు. వేలాదిమంది మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చిన ఆమె నేడు వారు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి స్వయం సమృద్ధి సాధించేలా కృషిచేస్తున్నారు. ఐపాన్‌ గర్ల్‌గా పిలువబడుతున్నారు. మీనాక్షి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి సైతం ప్రశంసలు సైతం అందుకున్నారు.

011

ఉత్తరాఖండ్‌ రామ్‌నగర్‌ పట్టణానికి చెందిన 24 ఏళ్లున్న మీనాక్షి ఖాదీ చరిత్రలో డిగ్రీ పూర్తిచేశారు. కుమావోస్‌ ప్రాంతంలో ఆమె అమ్మమ్మ వాళ్లు ఉండేవారు. దీపావళి, ఇతర పండుగ సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులు ఐపాన్‌ డిజైన్లు (కళాకృతులు) తయారుచేసేవారు. మొదటగా ఈ వస్తువులను చూసినప్పుడు ఆమెకు కేవలం ఆరేళ్లు. తన అమ్మ ఉమ, అమ్మమ్మ కమల ఇళ్లల్లో ఆకర్షణీయమైన డిజైన్లను తయారు చేస్తుండటాన్ని ఆమె తరచూ గమనించారు. అప్పుడే ఈ కళ పట్ల ఆకర్షితులయ్యాయని మీనాక్షి చెబుతుంటారు. కుమావోన్‌ ప్రాంతంలో ఐపాన్‌ ఒక సంప్రదాయ జానపద కళ. ఈ కళాకృతులు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందనీ, చెడును నిరోధించే దైవిక శక్తిని ప్రేరేపిస్తుందని కుమావోనిలు (ఆ ప్రాంత ప్రజలు) నమ్ముతారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ కళ అంతరించిపోతోంది. తన పూర్వీకుల నుంచి ఈ కళను నేర్చుకున్న మీనాక్షి ఖాదీ దానిని ప్రపంచానికి తెలియజేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
        ఉత్తరాఖండ్‌లో దీపావళి, ఇతర పండుగల సమయంలో ఇంటి ప్రాంగణం, గదులు, గోడలు, పూజా గదిని ఐపాన్‌ కళను ఉపయోగించి తయారు చేసిన మ్యాట్లను అంటించి ప్రత్యేకంగా అలంకరించేవారు. ఈ పనిలో ఇరుగు పొరుగు వారి నుంచి కూడా సహాయం పొందేవారు. నగరాల్లో ఉండే ఈ కళాకృతులకు రానురాను గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆదరణ పెరిగింది. గతంలో పెయింటింగ్‌ కంటే స్టిక్కర్‌ అలంకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ప్రారంభించారు. పెయింటింగ్‌కు సమయం పడుతుందనీ, స్టిక్కర్లను అతికించటం ద్వారా ఇంటిని అలంకరించుకోవచ్చునని వారి భావన. ఈ క్రమంలో చాలా గ్రామాల్లో ఈ కళ దూరమవుతున్న విషయాన్ని మీనాక్షి గమనించారు. ఈ కళను పునరుద్ధరించేందుకు ఆమె చొరవ తీసుకుంది. లోతైన అధ్యయనం చేశారు.
 

                                                                   తయారీ విధానం

'బిస్వర్‌' పేస్ట్‌ను స్థానికంగా ఉండే అడవుల నుంచి సేకరిస్తారు. కుంకుమ-ఎరుపు మట్టిరంగు, 'గేరు'ను ఉపయోగించి తయారుచేసిన కళాకృతులను గోడలు, అంతస్తులపై ఆకర్షణీయమైన మూలల్లో అలంకరణ చేస్తారు. మొదటగా ఐపాన్‌ పునాదిని 'గేరు' మట్టి నుంచి తయారు చేస్తారు. ఆ తర్వాత 'బిస్వర్‌' ఉపయోగించి వివిధ డిజైన్లను తయారుచేస్తారు. ఆ తర్వాత మార్కెట్లో ఉంచి విక్రయిస్తుంటారు. తొలుత మీనాక్షి ఉత్సాహంతో ఐపాన్‌ వస్తువుల తయారీలో ఉండగా మిత్రులు ఈవిడకు ఏమి వచ్చులే అన్నట్లుగా నవ్వుకుంటూ నిట్టూర్చారు. అయినా వెరువక ఆమె పట్టుదల, తన అభిరుచి కొద్దీ తయారీని కొనసాగించారు. తొలుత గంటర్నర వ్యవధిలోనే తొలి ఐపాన్‌ డిజైన్‌ చేసినప్పుడు ఆమె అమ్మమ్మ దగ్గరకు తీసుకుని ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 'అమ్మా నీవు మరింత కష్టపడితే ఈ కళలో నిస్సందేహంగా రాణిస్తావు.. నీకు తిరుగులేదు' అంటూ ఆశీర్వదించింది అమ్మమ్మ. అప్పుడు నిరుద్యోగి ఉన్న మీనాక్షి ఈ కళపై పట్టు సాధించాల్సిందేనంటూ నడుం బిగించారు. పద్మశ్రీ గ్రహీత యశోధర మత్పాల్‌ వంటి చరిత్రకారులు, పండితులతో మాట్లాడి కొంత సమాచారం తెలుసుకున్నారు. ఈ కళ చరిత్ర, మూలాల్ని తెలుసుకోవటానికి తనకు మూడేళ్లుపట్టిందనీ, లోతుగా అధ్యయనం చేశానని ఓ యువకళాకారుడు ఆమెకు తెలిపాడు. చంద్‌ రాజవంశం (సుమారు 8వ శతాబ్ధంలో) మూలాలు ఉన్నాయని మీనాక్షి నిర్ధారించుకున్నారు. ఐపాన్‌ వంటి కళారూపాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్పనా, అర్పన్‌ అని కూడా పిలుస్తారని గ్రహించారామే.

033


                                                                కళకు ప్రాచుర్యమే లక్ష్యం

యువతకు ఈ కళలో నైపుణ్యం పెంపొందించటం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించొచ్చునని భావించారు. 2018 నుంచి నేటి తవరకూ అంటే ఐదేళ్లకాలంలో వృత్తిపరమైన ప్రయాణంలో ఆమె తన ఎన్నో మైలురాళ్లను దాటారు. రాష్ట్రంలో 3,451 మందికి ఆమె శిక్షణ ఇచ్చారు. దేశ విదేశాల్లోని మహిళా స్వయం సహాయక బృందాలతో సహా 5,241 మందికి ఐపాన్‌పై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు. ఇంకా సోషల్‌ మీడియా, పాఠశాలల్లో వర్కుషాపులు, ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా వేలాదిమందికి ఆమె శిక్షణ ఇస్తున్నారు.
 

                                                                 పారిశ్రామికవేత్తగా ...

మీనాకృతి ది ఐపాన్‌ ప్రాజెక్టును ఆమె డిసెంబర్‌ 2019లో ప్రారంభించింది. ఉత్తరాఖండ్‌లో 4 వేల మందికిపైగా మహిళలు ఈ కళాకృతులను తయారుచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. వారు తమ ఖర్చుల కోసం, కుటుంబ పోషణ కోసం ఎవరిపైనా ఆధారపడాల్సిన పని లేకుండా పోయింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రెడ్‌ కలర్‌ ఐపాన్‌ డిజైన్లు, గ్రీటింగ్‌కార్డులు, వాల్‌ డిజైన్లు, నేమ్‌ ప్లేట్లు డిజైన్లలో ఐపాన్‌ ఆర్ట్స్‌ ప్రదర్శన ఏటేటా పది రోజులపాటు నిర్వహిస్తోంది. వీటిలో కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించటం, వాటికి మార్కెట్లో గిరాకీ ఉంటుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తన వార్షిక ఆదాయం ఇప్పుడు రూ.40లక్షలు దాటిందని మీనాక్షి చెబుతున్నారు.
 

                                                                     పలు అవార్డులు

మీనాక్షి మహిళా మాతృశక్తి పురస్కారం, మా నంద శక్తి పురస్కారం, వీర్‌ బాలికా, కళ్యాణి సమ్మాన్‌, 2021లో ఉత్తమ పారిశ్రామిక వేత్త వంటి అవార్డులు సైతం అందుకున్నారు. డిసెంబర్‌ 9, 2022న డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతిముర్ముతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. కళాకృతులను చూసి ఆశ్చర్యపోయిన రాష్ట్రపతి ప్రత్యేకంగా మీనాక్షిని అభినందించారు. తాను తయారు చేసిన ఫలకాన్ని రాష్ట్రపతికి ఆమె బహూకరించారు.