'చందమామ రావె జాబిల్లి రావే/ కొండెక్కి రావే కోటి పూలు తేవే'అంటూ...పసిబిడ్డకు గోరుముద్దలు పెడుతూ పాట పాడుతుంది అమ్మ. చందమామను, పండువెన్నెలను చిన్ననాడే పరిచయం చేస్తుంది. చిన్ననాటి నుండి వెన్నెల వెలుగులను, జాబిలి అందాలను ఆస్వాదించడం...మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. 'కార్తీకమాసపు రాత్రివేళ/ కావాలనే మేలుకున్నాను/ చల్లని తెల్లని వెన్నెల/ అంతటా పడుతోంది/ మెత్తని పుత్తడి వెన్నెల/ భూమి ఒంటిని హత్తుకుంది' అంటాడు తిలక్. మెత్తని పుత్తడి వెన్నెల అందాలకు ప్రతీక శరత్కాలం. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణానికి తార్కాణం శరత్కాలం. వానాకాలంలో నీటి మబ్బులు నల్లని రంగులో మెరిస్తే...శరదతువులో నీరు లేని మబ్బులు తెల్లని తెలుపులో వెండిమబ్బుల్లా వెలిగిపోతుంటాయి. 'శరత్కాలపు రాత్రులు మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలతో కూడి వున్నవి. వికసించిన తెల్ల కలువల వలె దట్టమైన సుగంధముతో కూడిన గొప్ప పరిమళాన్ని వహించినాయి, అంతటా వెదజల్లబడిన కర్పూరపు పొడివలే ఆకాశాన్ని ఆవరించిన చంద్రుని వెన్నెల వెల్లువలు కలిగి ఆకాశం మిక్కిలి సొగసుగా వున్నాయి' అంటాడు నన్నయ్య. శరత్కాల వెన్నెల ఎంత తెల్లగా వుందో చెప్పడానికి చిక్కటి తెల్ల పెరుగుతో పోల్చడం మరో విశేషం. కాళిదాసు 'శరశ్చంద్ర చంద్రికా ధవళం మహీషం దధీ' అన్నాడట కాళిదాసు. అంటే... శరశత్కాలం వెన్నెల తెల్లనైన చిక్కటి పెరుగు వలే వున్నదని దీని అర్థం. శరత్కాల గగనంలో చందమామను చూస్తూ... 'శరచ్చంద్రిక' అంటూ ఓ దీర్ఘ కవితనే రాసేశాడు మహాకవి శ్రీశ్రీ. 'ఇదిగో జాబిల్లీ../ సముద్రం మీద నువ్వు సంతకం చేసేటప్పుడు/ గాలి దాన్ని చెరిపేయకుండా/ కాలమే కాపలా కాస్తుందిలే' అంటాడు. శరత్కాలంలో సముద్రంపై పరచుకున్న పూర్ణ చంద్రుడి తెల్లని వెన్నెల... ఆ సముద్రపు అలలపై తేలియాడుతుటే, సముద్రం తెల్లగా మెరిసిపోతుంది. దీన్నే జాబిల్లి సముద్రం మీద సంతకం చేయడం అంటూ శ్రీశ్రీ చమత్కరించాడు తన కవితలో.
ఈ శరత్కాలం రుతువులన్నిటిలోనూ ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ కాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దీనివల్ల వెన్నెలను పరిపూర్ణంగా ఆస్వాదించటానికి వీలుపడుతుందని చెబుతుంటారు. 'కార్తీకంలో వెన్నెల బావుంటుందని చెబుతూ, వెన్నెల మానవ సంబంధాలను మెరుగుపరుస్తుందని... 'వన భోజనాలూ-మానవ సంబంధాలూ' అనే వ్యాసంలో ప్రముఖ రచయిత శ్రీరమణ అంటారు. కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు. కార్తీకం రాగానే వన భోజనాలు చేయాలని అందరూ సరదా పడతారు. కుటుంబాలతో వెళ్లడం, చెట్ల కింద రకరకాల వంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజనాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. అందుకే కార్తీకం... వినోదం, ఆరోగ్యం, సామాజికం. ఈసారి వనభోజనాలపై కరోనా మహమ్మారి పడగ నీడ పరుచుకుంది. దీంతో వనభోజనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వాలు రైతుల వెన్నువిరిచే చర్యలకు తెరతీశాయి. వ్యవసాయ వ్యతిరేక బిల్లులను, విద్యుత్ మీటర్లను బలవంతంగా రైతులపై రుద్దుతున్నారు. ఆహ్లాదకరమైన శరత్కాల వెన్నెలలో దేశ రాజధాని వీధుల్లో రైతులు తమ హక్కుల కోసం రోడ్లపై తవ్విన గుంతలను సైతం దాటుకొని వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు వెండిమబ్బుల పండువెన్నెలలు కురిపించాల్సిన ఆకాశం ఢిల్లీ వీధుల్లో వాయుకాలుష్యాన్ని వర్షిస్తోంది.
ఈ శరదృతువు భుజాలపై ఒకవైపు కరోనా మహమ్మారిని, మరోవైపు ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను మోసుకొని వచ్చింది. శ్రమజీవన సౌందర్య స్వభావులైన రైతన్నలు, కార్మికులు, వ్యవసాయ శ్రామికులతో పాటు దాదాపు ప్రజలందరూ దీని పీడితులే. 'పొలాల నన్నీ హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పండగ/ జగత్తుకంతా సౌఖ్యం నిండగ' అన్నట్లుగా... వచ్చే శరత్కాలానికైనా ఈ జగత్తు సౌఖ్యంగా వుండాలి. అమ్మ పాడే జాబిలి పాట, ప్రాకృతిక స్వచ్ఛత, ప్రాకృతిక సమతుల్యత నవీన జగానికి 'మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు' మాదిరిగా యుద్ధాశ్వాలై కదం తొక్కాలి. మళ్లీ ప్రకృతి శోభ వెల్లివిరియాలి.










