Nov 05,2022 07:15

షిమ్లా : బిజెపి నాయకులు ప్రచారం చేసే 'డబుల్‌ ఇంజిన్‌' ప్రభుత్వం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోరంగా విఫలమైంది. ఓ వైపు కుంభకోణాలు.. మరోవైపు అసమర్థ నిర్వాకాలతో నిరుద్యోగాన్ని భారీగా పెంచారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్‌ ఇంజన్‌ నినాదంతోనే బిజెపి కాంగ్రెస్‌పై విజయం సాధించి అధికారం దక్కించుకుంది. 2017 నుంచి పరిపాలనలో ఉన్న జై రామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కేంద్రంలోనూ బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 'విజరు సంకల్ప్‌ అభియాన్‌' పేరిట యాత్రలను నిర్వహిస్తుంది. స్టార్‌ క్యాంపెనర్లను అధిక సంఖ్యలో దించింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా అనేక మంది కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొని, 'డబుల్‌ ఇంజిన్‌' అంటూ ఊదరగొడుతున్నారు.
అవినీతి.. కుంభకోణాలు...
అసమర్థ పాలనకు తోడు జై రామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయింది. పోలీస్‌ నియామకాల కోసం జరిగిన పరీక్షను మూడు నెలల తరువాత రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరీక్ష పేపర్‌ లీకయినట్లు వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షకు హాజరైన రెండు లక్షల మంది యువత తీవ్ర నిస్పృహలో ఉన్నారు. ఈ పేపర్‌ లీక్‌లో రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని దర్యాప్తులో వెల్లడ యింది. ఈ స్కామ్‌లో సుమారు 200 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఎక్కువమంది అభ్యర్థులే. స్కామ్‌లో పాల్గొన్న అధికారుల్ని, బిజెపి నాయకుల్ని అరెస్టు చేయలేదు. హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్శిటీ, క్లస్టర్‌ యూనివర్శిటీ, మండి, ఐఐటీ మండి, హమీర్‌పూర్‌ ఐఐఐటి, మెడికల్‌ కాలేజ్‌, నెర్చోక్‌, హైడ్రో ఇంజినీరింగ్‌ కాలేజ్‌, బిలాస్‌పూర్‌, ఎయిమ్స్‌, బిలాస్‌పూర్‌ తదితర సంస్థల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ఉన్నాయి.
నిధులివ్వని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు
ఈ ఐదేళ్ల కాలంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రధానంగా విద్యారంగంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులనూ ప్రభుత్వం ఖర్చుచేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్‌ కింద ఆమోదించిన ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులను కేటాయించలేదు. ఈ పథకం కింద 2019 నుంచి 2022 వరకూ రూ.437 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. ఆమోదించిన ప్రాజెక్టులకూ నిధులను విడుదల చేయకపోతే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి అర్థం ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1,788 పోస్టులు, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 473 పోస్టులు, కాలేజీల్లో 100కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ వివరాలను ఈ ఏడాది అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్‌ ఠాకూర్‌ స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యారంగంలో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉండటం ఇదే మొదటిసారని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉన్న కారణంగానే పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. కాలేజీల్లో వందకు పైగా ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉండటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఖాళీల కారణంగా అనేక మంది సిబ్బందిని ఇతర కళాశాలల్లో డిప్యూట్‌ చేస్తున్నారు. ఇలా డిప్యూట్‌ చేసినప్పుడు సిబ్బందికి ఇచ్చే టిఎ, డిఎలను కూడా బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. వారంలో మూడు రోజులు ఒక కాలేజీకి, మరో మూడు రోజులు మరొక కాలేజీకీ పంపుతున్నారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉండికూడా ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శస్తున్నారు. విద్యారంగంలో పరిస్థితి ఇలా ఉంటే బిజెపి నాయకులు మాత్రం పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ప్రవేశపెడతాం వంటి ప్రకటనలతో ప్రజల ఐక్యతకు భంగం కలిగించేందుకు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.