Oct 19,2023 08:01
  • కూరగాయల ధరలు పైపైకి
  • నాణ్యత పేరిట కిలోకి రూ.20పైనే పెంపు
  • రైతు బజార్‌లో నాణ్యత లేని కూరగాయలు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : దసరా దరువు మొదలైది. గత నెల రోజులుగా సామాన్యునికి అందుబాటులో ఉన్న కూరగాయలు మళ్లీ ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. రైతు బజారు ధరతో పోల్చితే బహిరంగ మార్కెట్లో కిలోకు సుమారు రూ. 20పైనే విక్రయాలు జరుగుతున్నారు. దీంతో ధరలను చూసిన కొనుగోలుదారులు నోరెళ్లబెడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత పేరుతో ధరల ఎక్కువకు విక్రయిస్తుంటే రైతు బజార్‌లో నాణ్యత లేనివి ఉండడంతో ధర తక్కువకు విక్రయిస్తారని చెబుతున్నారు. వినియోగదారుల రద్దీని బట్టి కూరగాయల ధరలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రానికి వేర్వేరుగా పెరుగు తున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో సుమారు 10 రోజులపాటు చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉండటం పరిపాటి. మరో పక్క భవానీ దీక్షలు ఆచరించే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో కూరగాయల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకూ కూరగాయల రేట్లు దిగొచ్చే పరిస్థితి లేనేలేదని వ్యాపారులు తెగేసి చెప్పడం విశేషం.

  • ఒక్కో చోట.. ఒక్కో ధర..

బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు ఒక్కోచోట ఒక్కోలా ఉంటున్నాయి. ప్రస్తుతం దొమ్మేరు రకం వంకాయలు కిలో రూ.60ల వరకూ విక్రయిస్తున్నారు. బీరకాయలు రూ.50, టమాటా రూ.40, బెండకాయలు రూ.40, దొండకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.60, బంగాళాదుంపలు రూ.50, క్యారట్‌ రూ.60, క్యాప్సికం రూ.120, బీట్‌రూట్‌ రూ.60, చిక్కుళ్లు రూ.120 పలుకుతున్నాయి. రైతు బజార్‌లో అయితే ధరలు సగానికి సగం ఉన్నాయి. బీరకాయలు కిలో రూ.24, బెండకాయలు రూ. 30, బంగాళాదుంపలు రూ. 29, వంకాయలు రూ. 30 టమాటా రూ. 24 చొప్పున ఉన్నాయి. ఇక చిక్కుళ్లు రూ. 100, ఆగాకర రూ. 90, బీట్‌రూట్‌ రూ. 40, క్యారట్‌ రూ. 40, అరటికాయలు 3 రూ.20, ఆకు కూరలు అయితే రెండు కట్టలు రూ.10లు ఉన్నాయి. అదే బహిరంగ మార్కెట్‌ లో అయితే ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఒక్కో రకంపై కిలో రూ.20 నుంచి రూ.30ల పైనే వేసుకుని విక్రయిస్తున్నారు. రైతు బజార్‌లో విక్రయించే కూరగాయల్లో అంతగా నాణ్యత లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కూరగాయలనే ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే కిలో రూ. 10లు మాత్రమే తేడా ఉంటుంది. ప్రస్తుతం దసరా కావడంతో ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఏదైనా కూరగాయల ధర కిలో రూ.90లు చెబితే అర కిలో రూ.50లకు, పావు కిలో రూ.30లు చొప్పున విక్రయాలు చేస్తున్నారు.

  • కొండెక్కిన కొత్తిమీర

ఇక కొత్తిమీర ధర కొరకొర మంటోంది. వ్యాపారులు కొత్తిమీరను పెద్దపెద్ద కట్టల లెక్కన కొనుగోలు చేసి వాటిని పెద్ద, చిన్న కట్టలుగా కట్టి మార్కెట్లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం 130 కట్టలు రూ.3,600 నుంచి రూ.3,800ల వరకూ ధర ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట ఈ ధర మరింత ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు కాస్త తగ్గిందని అంటున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంతో పాటు ఇతర అన్ని మార్కెట్లు, రైతుబజార్లలో బెంగుళూరు కొత్తిమీర మాత్రమే అందుబాటులో ఉంది. వాస్తవానికి జిల్లాలోని తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామ పరిసరాలు కొత్తిమీర, ఆకుకూరల సాగు అధికంగా జరుగుతోంది. అక్కడ పంట చేతికి రావాలంటే మరో నెలరోజులైనా పడుతుందని చెబుతున్నారు. చుక్కకూర, మెంతికూర పెద్దగా మార్కెట్లోకి రావడం లేదు. తోటకూర, పొన్నగంటి కూర, బచ్చలికూర, గోంగూర మాత్రమే లభిస్తున్నాయి. ఇలా ధరలు భారీగా పెరగడంతో ఏం తిని బతకాలంటూ ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.