
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర బిజెపి ప్రభుత్వం గృహావసర గ్యాస్ సిలిండర్ ధరను రూ.50, వాణిజ్య సిలిండర్ ధరను రు.350 పెంచడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, గ్యాస్ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పెంచడం దారుణమని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం వరకూ రూ.417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర నేడు రూ.1155కు పెరిగిందని వివరించారు. ప్రభుత్వం సబ్సిడీ జమ రెండేళ్ల నుంచి నిలిపివేసిందని, ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ కింద ఇచ్చే సిలిండర్ల సంఖ్య కుదించారని వివరంచారు. ఇది పూర్తిగా పేద, మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదని అన్నారు. వాణిజ్య సిలిండరు ఒక్కసారిగా రు.350 పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ఆర్థిక మాంద్యంతో చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయమని అన్నారు. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. వంట గ్యాస్‌ధరల పెంపును ఉపసంహరించి, సబ్సిడీని పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. పెంచిన ధర ఉపసంహరించే వరకు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని ప్రజలను కోరారు.
- ఐద్వా ఖండన
సామాన్యుల నడ్డివిరిచి ప్రైవేటు కంపెనీలకు లాభాలు కట్టబెట్టేందుకే ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచిందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి విమర్శించారు. ఇప్పటికే రూ.1110 చెల్లిస్తున్నారని, చాలదన్నట్లు మరో రూ.50 మోపడం ఏమిటని ప్రశ్నించారు. ఒకవైపు బియ్యం కోటా తగ్గించి, మరోవైపు గ్యాస్ ధర పెంచడమంటే పేదలు బతకలేని పరిస్థితి కల్పించడమేనని వివరించారు.