Jul 18,2022 22:55
  • లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష ఎంపిలు
  • జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకి పార్లమెంట్‌ నివాళి
  • సభ్యుల ప్రమాణ స్వీకారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, ద్రవ్యోల్బణం, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతున్న మోడీ ప్రభుత్వ విధానాలపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా, ప్రభుత్వం ససేమిరా అనుది. దీంతో సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభల్లోను తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకి పార్లమెంట్‌ ఉభయ సభలు నివాళులర్పించాయి. ఎగువ సభ సమావేశం కాగానే సిపిఐ(ఎం) సభ్యులు లేచి ధరల పెరుగుదలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. వారికి మిగతా ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. అందుకు రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించడంతో ప్రతిపక్ష ఎంపిలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధరల పెరుగుదలపై ప్రధాని మోడీ పార్లమెంటుకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వెంటనే సభను మంగళవారానికి వాయిదావేశారు. లోక్‌సభ కూడా ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తరువాత ధరల పెరుగుదలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులు చేబూనివెల్‌లోకి దూసుకెళ్లి, నినాదాలు చేశాయి. ఈ ఆందోళన నడుమ కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఫ్యామిలీ కోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. తరువాత కొద్దిసేపటికే లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది.

  • సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలి : ప్రధాని మోడీ

పార్లమెంట్‌ సమావేశాల్లో సభ్యులంతా చర్చల్లో పాల్గనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్‌ ఆవరణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బయట వాతావరణం చల్లబడటం లేదని, సభలోపల వేడి తగ్గుతుందో లేదో చూడాలని అన్నారు. వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నానన్నారు. పార్లమెంటులో చర్చలు, విమర్శలు జరగాలని పేర్కొన్నారు.

  • నూతన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డితో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. వైసిపి ఎంపిలు విజయసాయి రెడ్డి తెలుగులో, బీద మస్తాన్‌ రావు, నామినేటెడ్‌ ఎంపి విజయేంద్ర ప్రసాద్‌ ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోబాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పి.చిదంబరం, రణదీప్‌ సుర్జేవాలా, రాజీవ్‌ శుక్లా, శివసేన నేత సంజయ్ రౌత్‌, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌, ఎన్‌సిపి నేత ప్రఫుల్‌ పటేల్‌, ఆప్‌ నేత, మాజీ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ తదితరులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉనాురు. అనంతరం చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ప్యానల్‌ డిప్యూటీ చైర్మన్లుగా విజయసాయిరెడ్డితోపాటు మరికొందరి పేర్లను ప్రకటించారు.