Jun 17,2023 22:27
  • నేడు 109, రేపు 73 మండలాల్లో..

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రానును రెండురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రతతోపాటు పలు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపనునుట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి బిఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ఈ నెల 18న 109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 206 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19న 73 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 227 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని తెలిపారు. 18వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, అనకాపల్లి 6, బాపట్ల 8, తూర్పుగోదావరి 17, ఏలూరు 12, గుంటూరు 9, కాకినాడ 18, కోనసీమ 7, కృష్ణా15, మన్యం 5, పశ్చిమగోదావరిలో 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా కనిమెరకలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత, మన్యం జిల్లా పాచిపెంటలో 44.9 డిగ్రీలు, ఏలూరు జిల్లా కామవరపు కోటలో 44.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొండాపురంలో 44.5 డిగ్రీలు, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 44.3 డిగ్రీలు, కృష్ణాజిల్లా నందివాడ, ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో 44.1 డిగ్రీలు చొప్పున, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 44 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. 188 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 176 మండలాల్లో వడగాడ్పులు వీచాయని వివరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉనుందున పొలాల్లో పనిచేసే కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని అంబేద్కర్‌ పేర్కొన్నారు.