Nov 09,2023 15:26

జైపూర్‌ :   రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలెట్‌ పేర్కొన్నారు.   రాజస్తాన్‌ ముఖ్యమంత్రి  అభ్యర్థి రేసులో సచిన్‌ పైలెట్‌ ఉన్నారన్నవార్తలపై  ఆయన పై విధంగా స్పందించారు.  రాజస్తాన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సచిన్‌ పైలెట్‌ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగానే ఉందని,  వర్గాలు, ఉద్రిక్తతలు, విభేదాలు ఉన్నది బిజెపిలోనేనని అన్నారు. తప్పుడు విధానంలో టిక్కెట్లు పంపిణీ చేశారని, ప్రపంచంలోనే ఈ విధానం ఉందని అన్నారు. అయితే కాంగ్రెస్‌లో తాము శాంతియుతంగా చర్చలు జరుపుతామని అన్నారు. విద్యుత్‌, నీరు, విద్య వంటి ప్రజా సంక్షేమ అంశాలకు బదులు బిజెపి మతం, దేవాలయాలు గురించి మాట్లాడుతుందని అన్నారు.

  రాజస్తాన్ ముఖ్యమంత్రి  అశోక్ గెహ్లాట్ పై  2020లో   సచిన్ పైలెట్  తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అనంతరం అధిష్టానం చర్చలతో సచిన్ పైలెట్ వెనక్కు తగ్గారు.    తిరుగుబాటు ప్రకటించడంపై స్పందిస్తూ.. ’' క్షమించు, మర్చిపో, ముందుకు వెళ్లు '' ఇవే కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీనేత రాహుల్‌ గాంధీలు తనకు చెప్పారని అన్నారు. తాను భవిష్యత్తు గురించి, రాజస్తాన్‌ ఐదేళ్ల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నానని అన్నారు. తామంతా కలిసి కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కృషి చేస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, నాయకత్వం ఏం చేయాలి, ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని నిర్ణయిస్తుందని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజస్తాన్‌లోని టోంక్‌లో ఏ ఎమ్మెల్యే కూడా 50,000 ఓట్ల మార్జిన్‌తో గెలవలేదు. రికార్డులు బద్దలవుతాయని అన్నారు. అయితే తాను అంకెల గురించి మాట్లాడనని, ప్రజలు తనని విశ్వసించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్‌ అభివృద్ధికి కృషి చేశామని, కరోనా సమయంలోనూ ప్రజలకు సాయం అందించామని అన్నారు. అందుకే ఈ సారి టోంక్‌ నియోజకవర్గంలో అధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  రాజస్తాన్‌లో ఈనెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.