Oct 22,2023 10:57
  • గుండె ఒక్కసారి ఆగిపోతేనే.. అమ్మో.. అనిపిస్తుంది.. మరి ఆరుసార్లు ఆగిపోతే.. బతకడం కష్టం.. బతికితే విడ్డూరమే కదా మరి ఇది నిజంగా యువకుడి విషయంలో జరిగింది. అంతేకాదు ఆ యువకుడు తన ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. ఊపిరితిత్తుల్లో బ్లడ్‌ క్లాట్స్‌ (రక్తం గడ్డకట్టడం) కారణంగా 21 ఏళ్ల అతుల్‌ రావ్‌కు జులై 27వ తేదీన గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఒక్క రోజులోనే అతుల్‌కు గుండె ఐదుసార్లు ఆగిపోయింది. అప్పుడు వైద్యులు గడ్డకట్టిన రక్తాన్ని సాఫీగా ప్రసరించేలా చేసే ఔషధాలు (క్లాట్‌ బస్టింగ్‌ డ్రగ్స్‌) ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అమెరికా పౌరుడైన అతుల్‌, ప్రస్తుతం లండన్‌లో ప్రీ-మెడికల్‌ డిగ్రీ చేస్తున్నారు. తనకు గుండెపోటు వచ్చిన తర్వాత వైద్య రంగంలోనే తన కెరీర్‌ కొనసాగించాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. 'నాకు గుండెపోటు రాకముందు, మెడిసిన్‌ చేయాలనుకోవడం సరైనదేనా? కాదా? మరేదైనా వృత్తిని ఎంచుకుందామా? అనే సంశయం ఉండేది. కానీ, స్పృహలోకి వచ్చిన మరుక్షణమే నాకు అర్థమైంది. నాకు వరంలా వచ్చిన ఈ జీవితాన్ని, నా సమయాన్ని ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించాలని అనుకుంటున్నా' అని అతుల్‌ చెబుతున్నారు.
మొదట తన ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి సిబ్బందిని అతుల్‌, ఆయన తల్లిదండ్రులు కలిశారు. హ్యామర్‌స్మిత్‌ ఆస్పత్రి వైద్యులు అతుల్‌ని ఉంచిన బెడ్‌ను చూపించారు. తన గుండె ఆగిపోవడం గురించి, అసలు అప్పుడు ఏం జరిగిందనే విషయాల గురించి అతుల్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతుల్‌కి తొలుత ఈ ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం సెయింట్‌ థామస్‌ ఆస్పత్రికి తరలించారు. అతుల్‌ తల్లి శ్రీవిద్య సియాటిల్‌లో మ్యాథమేటిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 'అతుల్‌ కోలుకునేందుకు అందరూ సాయం చేశారు. ఎంతో శ్రద్ధతో వారి బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు నాకు దక్కేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు' అని ఆమె అన్నారు.
'దీనివల్ల జీవితంపై దృక్పథం మారింది. ఇంత చిన్న వయసులోనే అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. జీవితంపై చాలా ప్రభావం చూపించింది' అన్నారామె.
తన 21వ పుట్టినరోజు నాడు గుండెపోటు వచ్చిందని అతుల్‌ చెప్పారు. ఆ వయస్సులో యువత చాలా మంది తమ పుట్టినరోజున పార్టీ చేసుకోవాలని అనుకుంటారు. కానీ, ఆ రోజు నా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఒక్కసారి తలుచుకుంటే..! ఆ రోజు నాకోసం వచ్చిన వాళ్లందరూ నా చుట్టూ ఉండడం అదృష్టం. వాళ్లందరికీ రుణపడి ఉంటా' అన్నారు.
ఆ రోజు లండన్‌ అంబులెన్స్‌ సర్వీస్‌లో సీనియర్‌ పారామెడిక్‌ (అత్యవసర చికిత్సలో నిపుణులు) గా పనిచేస్తున్న నిక్‌ సిల్లెట్‌ తన కుమారుడి ఫోన్‌ ద్వారా విషయం చెప్పారని అతుల్‌ తండ్రి అజరు గుర్తు చేసుకున్నారు. అజరు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. సిల్లెట్‌ ఫోన్‌ చేసిన సమయంలో అజరు చేతులు వణుకుతున్నాయి.. మాట్లాడలేకపోతున్నారు. లండన్‌ బయలుదేరి వస్తున్నప్పుడు, మీ కొడుకు ప్రాణాలు కాపాడేందుకు పెద్ద నిర్ణయం తీసుకుంటున్నట్లు వైద్య సిబ్బంది చెప్పడంతో కుప్పకూలిపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు.
బతుకుతాడని అనుకోలేదు..
'ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అతుల్‌ స్పృహలో లేరు. వైద్యులు వచ్చి చూసి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు ఉదయం నేను సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు ఫోన్‌ చేశాను. వాళ్లు ఒక నిమిషం ఆగమని చెప్పారు. అప్పుడే అతుల్‌ స్పహలోకి వచ్చి 'బాబా' (నాన్నా) అని పిలిచాడు. నా జీవితంలో నేను విన్న మధురమైన పిలుపు అది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరికి వెళ్లా' అని అజరు చెప్పారు.
అతుల్‌ కుటుంబం ప్రత్యేకంగా వచ్చి తనని కలుసుకోవడంతో భావోద్వేగానికి లోనైనట్లు పారామెడిక్‌ నిక్‌ సిల్లెట్‌ చెప్పారు. 'నేను అతుల్‌ని చూసినప్పుడు బతుకుతాడని అనుకోలేదు. ఆ సంఘటన తర్వాత మళ్లీ ఆయన్ను, ఆయన తల్లిదండ్రులను కలవడం, వాళ్లతో మాట్లాడడం నా 18 ఏళ్ల ఉద్యోగ జీవితంలో మరపురాని విషయం' అని అన్నారు.
'సాధారణంగా ఈ వయసులో గుండెనొప్పి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక్కరోజులో ఆరుసార్లు గుండె ఆగిపోవడం, గుండెపోటు రావడం చాలా అరుదైన విషయం' అని ఇంపీరియల్‌ కాలేజ్‌ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ పరిధిలోని హ్యామర్‌స్మిత్‌ హాస్పిటల్‌లో క్రిటికల్‌ కేర్‌ కన్సల్టెంట్‌గా ఉన్న డాక్టర్‌ లూయిత్‌ ఠాకూరియా అన్నారు.
'అతుల్‌ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు చాలా మంది సాయం చేశారు. ఇది నిజంగా సమిష్టితత్వంతోనే సాధ్యమైంది. వారిలో నేను కూడా ఒకరిని కావడం సంతోషం' అని డాక్టర్‌ ఠాకూరియా చెప్పారు. ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి.
ప్రత్యేకంగా అతుల్‌ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని లండన్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ తెలిపింది. 'గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి సెకనూ చాలా విలువైనది. ఛాతీపై నొక్కడం, డీఫ్రిబిలేషన్‌ (గుండె తిరిగి కొట్టుకునేలా చేసేందుకు వైద్య పరికరంతో విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం) ద్వారా బతికే అవకాశాలు రెండింతలు మెరుగవుతాయి' అని పేర్కొంది. అతుల్‌కి ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజెనేషన్‌ (ఎక్మో) చికిత్స అవసరం పడలేదు. ఇలాంటి రోగుల్లో కొంతమందికి ఎక్మో చికిత్స అవసరమని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిందని లండన్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ తెలిపింది.