
- గత ఏడేళ్లలో 35,117 గన్‌లైసెన్సులు
ఇంఫాల్ : బిజెపి పాలిత రాష్ట్రం మణిపూర్‌లో గన్ కల్చర్ రాజ్యమేలుతున్నది. బీరెన్‌సింగ్ సర్కారు హయాంలో ఇది తీవ్రరూపం దాల్చింది. గత ఏడేండ్ల ఎన్డీయే పాలనలో రాష్ట్రంలో 35 వేలకు పైగా యాక్టివ్ గన్ లైసెన్సులు జారీ అయ్యాయి. ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఇదే అధికం కావటం గమనార్హం. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఈ సమాచారం వెల్లడైంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా జారీ అయిన గన్ లైసెన్సులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 20 నాటికి 37.7 లక్షల యాక్టివ్ గన్ లైసెన్సులు ఉన్నాయి. 2016, డిసెంబర్ నాటికి ఉన్న లైసెన్సుల సంఖ్య కంటే ఇది 4 లక్షల కంటే అధికం కావటం గమనార్హం. ప్రస్తుత సమాచారం ప్రకారం మణిపూర్‌లో 35,117 యాక్టివ్ గన్ లైసెన్సులు ఉన్నాయి. 2016, డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 26,836గా ఉన్నది. కాగా, మణిపూర్‌లో 2017, మార్చిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్. బీరెన్‌సింగ్ సర్కారు కొలువుదీరింది. దీంతో దాదాపు అప్పటి నుంచి రాష్ట్రంలో సుమారు 8 వేలకు పైగా గన్ లైసెన్సులు పెరిగిపోవటం గమనార్హం. మణిపూర్‌లో ఈ గన్ లైసెన్సుల సంఖ్య ఈశాన్య భారత్‌లోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ కావటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక ఈ విషయంలో నాగాలాండ్ మణిపూర్‌తో పోటీలో ఉన్నది. ఈశాన్యంలో మణిపూర్ తర్వాత నాగాలాండ్ అధిక సంఖ్యలో యాక్టివ్ గన్ లైసెన్సులను కలిగి ఉన్నది.
మణిపూర్‌లో గన్ లైసెన్సుల సంఖ్య పెరిగిపోవటంపై మణిపూర్ మాజీ పోలీసు కమిషనరల్ రాజ్ కుమార్ నీమరు ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఆయన తప్పుబట్టారు. గన్‌ల సంఖ్య పెరిగిపోవటంపై అసోం మాజీ డీజీపీ జి.ఎం. శ్రీవాస్తవ సైతం స్పందించారు. పొరుగు దేశాల నుంచి లైసెన్స్ లేని గన్‌లు సరఫరా అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.