Mar 01,2023 17:07

న్యూఢిల్లీ  :   వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు ఫిబ్రవరి నెలలో 12 శాతం పెరిగి, రూ.1.49లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికంగా రూ. 11,931 కోట్ల సెస్‌ వసూలైనట్లు ఆర్థికశాఖ బుధవారం ప్రకటించింది.  ఫిబ్రవరి నెలలో మొత్తం జిఎస్‌టి వసూళ్లు రూ.1,49,577 కోట్లు కాగా అందులో సిజిఎస్‌టి కింద రూ.27,662 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.34,915 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.75,069 కోట్లు సమకూరినట్లు  ఆర్థిక శాఖ తెలిపింది.   సెస్సుల రూపంలో రూ.11,931 కోట్లు (వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన సుంకాలు కలిపి) వసూలైనట్లు పేర్కొంది. అయితే ఈ వసూళ్లు జనవరిలో నమోదైన రెండవ అత్యధిక వసూళ్లు రూ.1.57 లక్షల కోట్ల కన్నా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. జిఎస్‌టి అమలు చేసిన తర్వాత అత్యధికంగా రూ. 1.68 లక్షల కోట్ల వసూళ్లతో గతేడాది ఏప్రిల్‌ నెల వసూళ్లు ఆల్‌ టైమ్‌ రికార్డుగా ఉన్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉండటంతో మునుపటి నెలకన్నా తక్కువగానే ఆదాయ వసూళ్లు ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.