న్యూఢిల్లీ : ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో తగిన నిల్వలు ఉండేలా చూడటం, ధరలను అదుపులో ఉంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 25న విధించిన ఎగుమతి సుంకం అక్టోబర్ 16 వరకు అమలులో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎల్‌ఇఒ (లెట్ ఎక్సోర్ట్ ఆర్డర్) జారీ చేయనందున పోర్ట్‌లలో లోడ్ చేయబడిన పారాబాయిల్డ్ రైస్‌పై ఈ సుంకం వర్తించదని ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. భారత్ బాస్మతీయేతర బియ్యంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
భారత్ నుండి ఎగుమతి అవుతున్న బాస్మతీయేతర తెల్ల బియ్యం 25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ మధ్య 15.54 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యం భారత్ నుండి ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. అలాగే గతేడాది సెప్టెంబర్‌లో నూకల ఎగుమతులపై నిషేధం విధించింది. రానున్న పండుగ సీజన్‌లలో దేశీయ సరఫరా మరియు రిటైల్ ధరలను అదుపులో ఉంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.










