
కోయకుండానే కన్నీళ్లుపెట్టిస్తున్న వైనం
వారం రోజులుగా పెరుగుతున్న ధరలు
జనం బెంబేలు
ప్రజాశకి- రాజమహేంద్రవరం ప్రతినిధి, క్రైం 'సామాన్యుల ఇంట మరోసారి ఉల్లి కల్లోలం రేపుతోంది.' ఒకపక్క కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి లేక జనం అల్లాడుతున్న సమయంలో ఉల్లి ధరలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వారం రోజులుగా రేట్లు కొండెక్కుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మన రాష్ట్రంలోని కర్నూలు, కడప జిల్లాల నుంచి దిగుమతులు తగ్గడంతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఉన్న సరుకును బ్లాక్ చేసి కృత్రిమ ధరలను సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ఉల్లి ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధిక ధరలకు కొనలేక, ఉల్లి లేని కూరలు తినలేక నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా ప్రజలు రోజుకు సుమారు 20 టన్నులకుపైగా వినియోగిస్తుంటారు. మన రాష్ట్రంలోని కర్నూలు నుంచి వస్తున్న ఉల్లి దిగుబడులు నిత్యావసరాలకు తీరకపోగా, పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర, పూణే, సోలాపూర్ నుంచి దిగుమతి అవుతోంది. వారం రోజుల క్రితం ఉల్లి రూ.18- 30 ఉండగా, క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధర కిలో హోల్‌సేల్లో రూ.85- 90కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో రూ.100కిపైగా అమ్ముతున్నారు. ఇది ఇంకా పెరగొచ్చని అంటున్నారు. కిలో రూ.100 చేరితే, బహిరంగ మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వంటింట్లో అతి ముఖ్యమైన ఉల్లిపాయల రేట్లను చూసి జనం గగ్గోలు పెడుతున్నారు.
తగ్గిన దిగుమతులు...
జిల్లాకు అత్యధికంగా ఉల్లిపాయలు మహరాష్ట్ర నుంచి దిగుమతి అవుతుంటాయి. గతేడాది భారీ వర్షాలకు అక్కడ పంట తుడిచి పెట్టుకుపోవడంతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇక్కడి వ్యాపారులు కేజీ రూ.150- 180 వరకు కూడా విక్రయించారు. ఈ ఏడాది వరుస తుపాన్లతో ఈసారి గతేడాది కన్నా ఉల్లి కొరత ఎక్కువ కావచ్చని అంచనా. రాష్ట్రంలో 30 వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి, ప్రస్తుతం 50 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. అదీ ఎకరానికి 70- 120 క్వింటాళ్లు ఉత్పత్తి కాగా, ప్రస్తుతం 40 శాతం ఉత్పత్తికి పడిపోయింది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. ఈనేపథ్యం లోనే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసిందని వ్యాb ారులు చెబుతున్నారు. గతంలో 10 టన్నుల ఉల్లి లారీలు రోజుకు 100కిపైగా దిగుమతి కాగా, ప్రస్తుతం 25 శాతం కూడా దిగుమతి కావడం లేదు. ఈనేపథ్యంలో ఉల్లి డిమాండ్ పెరిగి, దేశవ్యాప్తంగా ధరలు భగ్గుమంటున్నాయి.
భారం పెరిగింది...
కరోనాతో ఇప్పటికే చిన్నాభిన్నమైన జీవితాలకు పెరుగుతున్న ఉల్లి ధరలు తమ లాంటి సామాన్యులకు పెను భారంగా మారింది. కూరగాయల ధరలు అకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేట్టులేవు.
-బుంగా పద్మావతి, లక్ష్మివరపు పేట, రాజమహేంద్రవరం.
కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
సామాన్యుల ఇంట ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇంట్లో ఏకూర చేయాలన్నా తొలుత కావాల్సింది ఉల్లిపాయలే. బజారులో ఉల్లిపాయలు కేజీ 100కిపైగానే అమ్ముతున్నారు. ఇది వరకు వారానికి నాలుగు కిలోలు కొనేవాళ్లు ఇప్పుడు రెండు కిలోలు మాత్రమే కొంటున్నాం. ప్రభుత్వం ఉల్లిపాయల ధరలు మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
-నక్కా సలోమి, కోర్లమ్మపేట, రాజమహేంద్రవరం.
ప్రభుత్వ రాయితీతో ఉల్లి సరఫరా
కాకినాడ డివిజన్‌కు ఒక లారీ, రాజమహేంద్రవరం డివిజన్‌కు మరొక లారీ వచ్చింది. కిలో రూ.40 చొప్పున 50 శాతం ప్రభుత్వ రాయితీతో ఉల్లి సరఫరా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. రైతు బజార్లలో ఆధార్ కార్డు ఆధారంగా ఉల్లి పాయలు సరఫరా చేస్తారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరా తగ్గింది. ఈ కారణంగానే ధరలు పెరిగాయి. త్వరలోనే తగ్గే అవకాశాలున్నాయి.
- కె.కిశోర్, మార్కెటింగ్‌శాఖ ఎడి