ముంబయి : వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ గవర్నరు శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 6.50 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో మరోసారి రుణ గ్రహీతలకు స్వల్ప ఉపశమనం లభించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్) రేటును 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.75 శాతం వద్దే కొనసాగించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. గత ఏప్రిల్ సమీక్షలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంతక్రితం మాత్రం 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో కీలక వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుతం వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గినట్లు గణంకాలు రావడంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపును నిలిపేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది 7.2 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.










