Jan 28,2021 13:06

నసుంటే మార్గం ఉంటుంది అని పెద్దలు చెబుతుంటారు. అది నిజమేనని అమెజాన్‌ ఈ-కామర్స్‌ సంస్థకు చెందిన ఒక ఏజెంట్‌ నిరూపిస్తున్నాడు. కొద్ది వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో నిర్విరామంగా కురుస్తున్న మంచు వర్షాల కారణంగా రహదారులు మంచుతో కప్పబడ్డాయి. దాంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కానీ గతవారం కాశ్మీర్‌లో భారీ హిమపాతం మధ్య గుర్రంపై స్వారీ చేస్తూ అమెజాన్‌ పార్శిళ్లను డెలివరీ చేస్తున్న షిరాజ్‌ అనే యువకుడి వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. అసలా యువకుడు గుర్రంపై ఎందుకు పార్శిళ్లను డెలివరీ చేస్తున్నాడో తెలుసుకుందాం.

శీతాకాలం కారణంగా జమ్మూకాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఇళ్లతోపాటు రోడ్లూ మంచుతో కప్పబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో వాహనాల్లో ప్రయాణించడం చాలా కష్టం. ఆ ప్రాంత ప్రజలు బయటికి వెళ్ళలేక, అవసరమైన సరుకులు తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వాహనాలు కచ్చితంగా అందుబాటులో ఉండాలి. కానీ వాహనాల రాకపోకలకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. మంచుతో కప్పబడిన రహదారులను రాష్ట్ర ప్రభుత్వం క్లియర్‌ చేస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో రహదారులు ఇప్పటికీ ప్రయాణాలకు వీలుపడని విధంగా మంచుతో నిండిపోయాయి.
మంచు వర్షం అందరినీ ఆపివేసింది కానీ అమెజాన్‌ ఏజెంట్‌ షిరాజ్‌ను ఆపలేకపోయింది. సాధారణంగా అమెజాన్‌ డెలివరీ బార్సు తమ బైక్స్‌పై ట్రావెల్‌ చేస్తూ ప్రొడక్ట్స్‌ని ఆర్డర్‌ చేసిన కస్టమర్లకు చేరవేస్తుంటారు. బైక్‌పై కుదరకపోతే వ్యాన్‌పై డెలివరీ చేస్తుంటారు. జమ్మూకాశ్మీర్‌లో బైకు, వ్యాన్‌ నడిచే పరిస్థితులు లేకపోవడంతో కస్టమర్లకు ఎలా ప్రొడక్ట్స్‌ డెలివరీ చేయాలా అని ఆలోచనలోపడ్డాడు షిరాజ్‌. చివరికి గుర్రంపై డెలివరీ ఇవ్వాలని నిశ్చయించుకుని, వస్తువులను కస్టమర్లకు చేరవేయడం ప్రారంభించాడు. తనపై మంచు వర్షం విపరీతంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వినియోగదారులకు డెలివరీ ఇవ్వడం ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచింది. 'కొంతమంది కస్టమర్లకు పార్శిళ్ల అవసరం చాలా ఉందని తెలుసుకున్న తర్వాతనే నేను నిర్ణయం తీసుకున్నా. ఆరోజు మాకు కస్టమర్ల నుంచి నిరంతరం కాల్స్‌ వస్తున్నాయి. వైద్య పరికరాలు, బేబీఫుడ్‌, స్టడీ మెటీరియల్‌కు సంబంధించిన పార్శిళ్లను డెలివరీ చేయాలి. మంచు రోడ్లపై పేరుకుని ఉండటంతో మా ద్విచక్ర వాహనాలు అక్కడకు చేరుకోవడానికి మార్గం లేదు. కాబట్టి నా గుర్రాన్ని బయటకు తీసుకెళ్లాలి అనుకున్నాను. ముందుగా సూపర్‌వైజర్‌తో మాట్లాడి, అన్ని భద్రతా చర్యలను పరిగణనలోకి తీసుకున్నాను. తర్వాత గుర్రంపై బయలుదేరా' అంటున్నాడు షిరాజ్‌.


షిరాజ్‌కు చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. బిఏ చివరి సంవత్సరం చదువుతున్న అతను ఒకవైపు కాలేజీకి వెళుతూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ జాబ్‌గా డెలివరీ బారుగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే గుర్రాన్ని కొనుగోలు చేశాడు. స్వారీ కోసం వారాంతాల్లో స్నేహితులతో కలిసి వెళ్తుంటాడు. జమ్మూకాశ్మీర్‌ ప్రస్తుత పరిస్థితుల్లోనూ గుర్రంపై వెళ్లి పార్శిల్స్‌ డెలివరీ చేసే వీడియోను ఫొటో జర్నలిస్ట్‌ ఉమర్‌ గనీ తన సామాజిక ఖాతాలో పోస్ట్‌ చేయడంతో అది నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా షిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అమెజాన్‌ హెల్ప్‌డెస్క్‌ కూడా దీనిపై వినూత్నంగా స్పందించింది. 'ప్రొడక్ట్‌ సేఫ్టీ బాగున్నది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ అందుబాటులో ఉన్నారు. అయితే బాగా మంచు కురుస్తున్నది. అయినప్పటికీ హామీ ఇచ్చిన సమయానికి పార్సిల్‌ డెలివరీ జరిగింది. ఎలా సాధ్యం?' అని ప్రశ్నిస్తూ పక్కన గుర్రం బొమ్మను ఉంచింది. అయితే 'ఇంతటి ప్రశంసలు అందుతాయని నేనెప్పుడూ అనుకోలేదని, కేవలం కస్టమర్ల కాల్స్‌కు స్పందించడం తన డ్యూటీగా భావించాను' అని చెబుతున్నాడు షిరాజ్‌.