Jan 28,2021 13:17

బొబ్బట్లు
కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము - మూడు కప్పులు, బెల్లం పొడి - ఒకటిన్నర కప్పు, గోధుమపిండి - ముప్పావు కప్పు, యాలకుల పొడి - టీ స్పూను, నెయ్యి - తగినంత.

బొబ్బట్లు
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాన్‌లో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి గుమ్మడి తురుముని వేగించాలి. తర్వాత బెల్లం తురుము వేసి మిశ్రమాన్ని చిన్నమంటపై చిక్కబడనివ్వాలి. ఇప్పుడు యాలకుల పొడి కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకుని పక్కనుంచాలి. మరో పాత్రలో గోధుమపిండి, స్పూను నెయ్యి వేసి నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా ముద్దగా చేసుకొని, గంటపాటు పక్కనుంచాలి. తర్వాత కొంతకొంత పిండి తీసుకుని అరచేతిలో ఒత్తి గుంతలా చేసి, గుమ్మడి మిశ్రమం పెట్టి మూసి, బొబ్బట్లు ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై వేసి రెండువైపులా నెయ్యితో సన్న సెగపై దోరగా కాల్చుకోవాలి. వీటిని వేడిమీద ఉండగానే తింటే చాలా రుచిగా ఉంటాయి.

పచ్చడి
కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ - 300 గ్రాములు, పసుపు - అర టీస్పూన్‌, బెల్లం - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కొబ్బరి తురుము - అర కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం - చిన్నముక్క, కరివేపాకు - కొద్దిగా, నూనె - టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌.

పచ్చడి
తయారుచేసే విధానం: ముందుగా గుమ్మడికాయను ముక్కలుగా తరగాలి. వాటిమీద కొద్దిగా ఉప్పు చల్లి, పసుపు వేసి, కొన్ని నీళ్లుపోసి, ఒక విజిల్‌ వచ్చే వరకూ కుక్కర్‌లో ఉడికించాలి. ఆవిరిపోయిన తరువాత గుమ్మడికాయ ముక్కలు తీసి, బెల్లం, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనెవేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. ఈ పోపును గుమ్మడికాయ మిశ్రమంపై పోసి, కలియబెట్టుకొని సర్వ్‌ చేసుకోవాలి.

బరడా
కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు - పావుకేజీ, శనగపప్పు - 100 గ్రాములు, పెసరపప్పు - 25 గ్రాములు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - పావు టీస్పూన్‌, కారం - టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా,
కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

​​​​​​​బరడా
తయారుచేసే విధానం: శనగపప్పు, పెసరపప్పును బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇదే బరడా పొడి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కలపాలి. కొంచెం పెద్ద ముక్కలుగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు వేసి, పసుపు వేసి కలియబెట్టాలి. గుమ్మడికాయ ముక్కలు మగ్గిన తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు, కారం వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రుబ్బి పెట్టుకున్న బరడా పొడి వేయాలి. చివరగా కొత్తిమీర వేసి దింపాలి. వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ బరడా కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

సూప్‌
కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ - ఒకటిన్నర కిలో, ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, కొత్తిమీర - కట్ట, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - మూడు, వెజిటబుల్‌ స్టాక్‌ - లీటరు, ధనియాలు - టేబుల్‌స్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, క్యారెట్‌ - ఒకటి, ఉప్పు - తగినంత.

​​​​​​​బరడా
తయారుచేసే విధానం: ముందుగా ఓవెన్‌ను 170 డిగ్రీ సెల్సియస్‌ వరకూ వేడి చేయాలి. గుమ్మడికాయను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత ఒక బేకింగ్‌ ట్రేలోకి తీసుకొని, వాటిపైన ఆలివ్‌ ఆయిల్‌ చల్లాలి. ఎండుమిర్చి, ధనియాలను మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ పొడిని, మిరియాల పొడిని గుమ్మడికాయ ముక్కలపై చల్లాలి. తరువాత ఓవెన్‌లో పెట్టి, 45 నిమిషాల పాటు ఉడికించాలి. వెడల్పాటి పాన్‌ స్టవ్‌పై పెట్టి, కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్‌ తురుము, కొత్తిమీర వేసి, పావుగంట చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను ఓవెన్‌లోంచి బయటకు తీసి, వెజిటబుల్‌ స్టాక్‌ కలిపి మిక్సీలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెజిటబుల్స్‌ వేగుతున్న పాన్‌లో పోయాలి. మరికాసేపు ఉడికించి దింపి, వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.