Jul 10,2022 11:49

హుసేన్‌ సైకిల్‌ దిగి గోడవారగా పెట్టి, తమ రిపేర్‌ షాపు కొచ్చి స్టూల్‌ మీద కూర్చున్నాడు. మనుమడు కరీమ్‌ తన స్కూల్‌ బ్యాగ్‌ను అవతల పడేసి, అక్కడ కుర్రోళ్లు చేసే పనులు చూస్తూ కూర్చున్నాడు. తనూ గాలిపంపు తీసుకుని, ఒక సైకిల్‌కి గాలి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
'కరీమ్‌ స్కూల్‌ కెళ్లు ఇక్కడేం పని నీకు?' అంటూ గట్టిగా కసిరాడు హుసేన్‌.
'యాదయ్యా! సైకిలెక్కించుకొని కరీమ్‌ను స్కూల్లో దింపిరా. వాడి మాస్టారికి చెప్పిరా, వీడు ఏడ్చినా స్కూల్‌ నుంచి బయటకు పంపొద్దని' అంటూ తానే లేచి బ్యాగ్‌ను సైకిల్‌కి తగిలించాడు.
'యాదయ్యా! కరీమ్‌ను దించి వచ్చేటప్పుుడు ఒకసారి రైల్వేస్టేషన్‌ రోడ్డుకు వెళ్లిరా. నిన్న వెళ్లిన మెయిన్‌రోడ్డు వైపుకు ఇవ్వాళ వెళ్లొద్దు.'
'అలాగేనండీ' అంటూ యాదయ్య లోపలి గదిలోకి వెళ్లి ప్లాస్టిక్‌ డబ్బాలో చేయిపెట్టి, గుప్పెడు నిండుగా తీసి జేబులో పోసుకుని బయటకు వచ్చాడు.
స్కూల్‌ దగ్గర కరీమ్‌ను దింపి బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూసుకుంటూ తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని పరిశీలించుకుంటూ జనసంచారం లేనిచోట తన జేబులోని వస్తువులను నెమ్మదిగా రోడ్డు మీద జారవిడుస్తూ గంట తర్వాత షాపుకు తిరిగొచ్చాడు.
హుసేన్‌ షాపు ముందరి భాగం చిన్నదిగా కనపడ్డా లోపల చాలా విశాలంగా, ఖాళీ చోటుతో ఉంటుంది. వెనుకవైపు నుండి దారి ఉన్నది. ఆ దారి గుండా బేరగాళ్లు వచ్చి, పాత ఇనుప సామాన్లు అమ్ముకుని పోతూ ఉంటారు. ఈ బేరమంతా నాగేశ్వర్రావు చూసుకుంటాడు. హుసేన్‌, నాగేశ్వర్రావు మధ్య వయస్సు తేడాగా వున్నా చిన్నప్పట్నించే పరిచయంగా వుండేవాళ్లు. హుసేన్‌ కొన్నాళ్లు దుబారులో పెయింటర్‌గా పనిచేసి వచ్చాడు. కుటుంబాన్ని తన ఊరిలోనే ఉంచేసి, తాను మాత్రం దుబారుకి, ఇండియాకి తిరుగుతూ ఉండేవాడు. పిల్లల పెళ్లిళ్లు చేశాడు. ఇప్పుడు మాత్రం ఇంటిపట్టునే ఉండి నాగేశ్వర్రావుతో కలిసి పాత ఇనుము కొనటం, వాహనాల టైర్లకు పంక్చర్లు వేసి, రిపేర్లు చేస్తున్నాడు. చేతికింద కుర్రాళ్లు పనిచేస్తున్నారు. వీళ్లు కొనే పాత ఇనుప సామాన్లలో ఎక్కువగా రైల్వే వారి సామాగ్రి కనపడుతూ ఉంటుంది. ఇంకా చాలా రకాల దొంగ సామాగ్రి వస్తున్నది. అలాంటి వాటిని కొనం అని వీళ్లు చెప్పరు. పైగా ఇంకా ప్రోత్సాహకరంగా ఎక్కువ డబ్బు ముట్టజెపుతూ ఉంటారు. కొన్న వాటిని ఎప్పటికప్పుుడు బయటకి పంపిస్తూ ఉంటారు.
'అయ్యో ఇదేమిటి? మన వీధి గోడకున్న ఇనుప రేకు గేటు తలుపులు ఏమయ్యాయి? రాత్రి నేనే గేటు గడియ కూడా వేశాను. తెల్లవారేటప్పటికి తలుపులు మాయమయ్యాయి' అంటూ లబలబలాడింది పార్వతి.
'వదినా! ఊళ్లో ఇనుప సామాన్ల దొంగలు ఎక్కువయ్యారు. చుట్టుప్కల ఊళ్లలో కూడా మోటార్లు చివరకు స్కూటర్లు కూడా పోతున్నాయంట. అన్నింటికీ చైనులు వేసి తాళాలు వేసి వుంచినా లాభం ఉండటం లేదనుకుంటున్నారు. ఎన్నని లోపల దాచుకుంటాం? పోలీసులు ఒకరిద్దరు దొంగల్ని కూడా పట్టుకున్నారంట. నాలుగు రోజులున్నాక ఎవరో విడిపించారని చెప్పుకుంటున్నారు. మా అన్నయ్య మాటిమాటికీ లేచి నీళ్ల మోటారు, పంపూ ఇలాంటి వాటికి కాపలా కాస్తున్నారు. ఏం రోజులొచ్చి పడ్డాయిరా భగవంతుడా' అన్నది సరోజిని.
సాయం కాలమైంది. కరీమ్‌ స్కూల్‌ నుండి నడిచి వస్తున్నాడు. చెరువు పక్క నుండి, నెమ్మదిగా వస్తూ పుస్తకాల సంచిని ఈ భుజం మీద నుండి ఆ భుజం మీదకు మార్చుకుంటూ ఉన్నాడు. పక్కన వాడి స్నేహితులు మూర్తి, రాము వున్నారు. కరీమ్‌ కుడికాలి చెప్పుు తెగిపోయింది. తెగిన దాన్ని సరిచేయాలని చూశాడు కానీ కుదరలేదు. ఎడంకాలి చెప్పుుతోనే నడక కుదరక ఇవసలే పాత చెప్పులు. ఇంక పనికిరావని చెప్పుల్ని చెరువులోకి గిరాటు కొట్టాడు. వట్టి కాళ్లతో నాలుగు గజాలు నడిచాడో లేదో పాదంలో గట్టిగా ఏదో దిగబడింది. దిగబడినది పాదం నుండి ఊడి వస్తుందన్న ఉద్దేశ్యంతో కాలు జాడించి, పాదాన్ని రోడ్డుకేసి కొట్టాడు. అది ఊడి రాకపోగా మెత్తటి లేత పాదంలో మరింత లోతుకు వెళ్లింది.
'సంచి కిందకు దించరా కరీమ్‌, రోడ్డు మీదే కూర్చో. కాలు చూపించు మేం చూస్తాం' అన్నారు మిత్రులు.
కరీమ్‌ అలాగే చేశాడు. కొంచెం లావుపాటిదేదో పాదంలో దిగబడింది.
'ఇది మేకులాగా ఉందిరా' అంటూ రాము తన జామెంట్రీ బాక్స్‌లోని విభాగిని తీసి, మేకును అటూ, ఇటూ కదిలించాడు. అది ఊడిరాలేదు గానీ రక్తం కారటం ఎక్కువయ్యింది. కరీమ్‌ బాధను ఓర్చుకోలేకపోతున్నాడు.
'రక్తం ఎక్కువ కారుతున్నదిరా' అంటూ మూర్తి గాబరాతో రోడ్డు మీద దుమ్ముతీసి, గాయంమీద పోశాడు. 'నువ్విక్కడే కూర్చోరా కరీమ్‌. నీకు తోడుగా రాము ఉంటాడు. నేవెళ్లి మీ షాపులో చెప్తాను. ఎవరో ఒకరు వచ్చి, నిన్ను తీసుకెళ్తారంటూ' మూర్తి వెళ్లాడు. హుసేనే వచ్చి, మనుమణ్ణి సైకిలెక్కించుకుని పి.హెచ్‌.సి.కి తీసుకెళ్లాడు. మేకు లాగేసి, గాయాన్ని శుభ్రం చేశారు. బ్యాండేజ్‌ వేసి ఇంజక్షన్‌ చేశారు. మర్నాడు కరీమ్‌కు ఒళ్లంతా సలసలా కాలిపోయే జ్వరమొచ్చింది. జ్వరం తగ్గటానికి బిళ్లలు తెచ్చి వేశారు. జ్వరం తగ్గలేదు సరికదా రెండు రోజులకు పాదమంతా వాచింది. ఒళ్లంతా బిగదీసుకు పోతున్నట్లుగా అయ్యింది. మరలా పి.హెచ్‌.సి.కి తీసుకెళ్లారు.
'చూడండి హుసేన్‌గారూ! మేం ఇప్పుడు ఇంజక్షన్స్‌ చేస్తాం. కానీ మీరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళితే మంచిది. కాలు సెప్టిక్‌ అయినట్లుగా ఉంది. అక్కడైతే కావాల్సిన వైద్యం చేస్తారు.' అన్నారు డాక్టరుగారు.
కరీమ్‌ స్పృహలో ఉండటంలేదు. స్పృహలోకి వచ్చినప్పుడు బాధతో మెలికలు తిరుగుతున్నాడు. వాడిని ఆ స్థితిలో చూసి, ఇంటిల్లిపాదీ గుండెలవిసిపోతూ కరీమ్‌ను ఒళ్లో పడుకోబెట్టుకుని కారులో జిల్లా ఆస్పత్రికి పరుగులు తీశారు.

'అదేంటమ్మా ఈ లెటరు రాగానే నాకు చెప్పాలిగా. మొన్ననగా వస్తే ఇవ్వాళ సాయంకాలమా నాకిచ్చేది? ఏ ఉద్యోగమూ రాక, వచ్చినవి నచ్చక నేనెంత కుమిలిపోతున్నాను? వాళ్లకాళ్లో వీళ్లకాళ్లో పట్టుకుని ఈ ఉద్యోగం నాకిప్పించమని ఎంత మందిని బతిమాలుకున్నానో నీకేం తెలుసు?' అంటూ లెటరు చించి చూసి, రేపే ఇంటర్వూ. తెల్లవారేటప్పటికి హైదరాబాద్‌లో ఉండాలి. ఈ ఉద్యోగం కూడా రాకపోతే నేను బతకటం అనవసరం అనిపిస్తుంది నాన్నా!'
'అరేరు సంపత్‌. అలా అనకురా. మీ అమ్మ మతిమరుపు నీకు తెలిసిందేగా! ముందు నువ్వు హైదరాబాద్‌ చేరుకో' అన్నాడు నాగేశ్వర్రావు.
ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాను నాన్నా? నాకేదీ కలిసిరాదు. నాతోటి వాళ్లంతా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేనే దౌర్భాగ్యుణ్ణి. ఇంకా మీ మీద ఆధారపడి బతుకుతున్నాను.'
'ఇవాళ కాకపోతే రేపొస్తుంది ఉద్యోగం. దాని గురించి ఇంతలా బాధపడటం సరికాదు. సాయంకాలం ట్రైన్‌ కూడా వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడు బస్టాండ్‌కు పోదాంపద. రోడ్డు వేస్తున్నారుగా నాన్నా. చుట్టూ తిరిగి ఏవో లారీలు మాత్రం ఊరిదాకా వస్తున్నాయి. రెండు కిలోమీటర్ల అవతలకి కొద్ది బస్సులు మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు దేన్నో ఒకదాన్ని పట్టుకుని విజయవాడ చేరుకోవాలి. అక్కడ హైదరాబాద్‌ బస్సు ఎక్కాలి.'
'మరేం ఫర్వాలేదు. ముందు నువ్వు విజయవాడ చేరుకోవటం ప్రధానం. చుట్టూ తిరిగినా స్కూటర్‌ మీద విజయవాడ చేరుకుందాం. కావాల్సినవి సర్దుకో.'
'ఏభైకి కిలోమీటర్లు వుంటుంది. మళ్లీ రాత్రికి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు చీకట్లో రావటానికి ఇబ్బందిపడతావు నాన్న.'
'మరేం ఫర్వాలేదు. నువ్వు సర్టిఫికేట్లు, ఒక జత బట్టలు సర్దుకో. నేను డబ్బులు తీస్తాను!'
తండ్రీకొడుకులు సర్దుకుని బయటకువచ్చారు.
ఎదురుగా పోలీసులు వస్తూ కనపడ్డారు.
'నాగేశ్వర్రావు నువ్వేనా? నిన్ను అరెస్టు చేయటానికి వచ్చాం. ఇదుగో వారంటు'
'ఎందుకుసార్‌? మా నాన్ననెందుకు అరెస్టు చేస్తున్నారు?' అన్నాడు భయపడుతూ సంపత్‌.
'నీకేం తెలియదా? ఎక్కడెక్కడి ఇనుప వస్తువుల్ని కొంటా, దొంగ వ్యాపారాన్ని చేస్తున్నాడు. మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి. మా స్టేషన్లో చాలా కంప్లైంట్లూ ఉన్నాయి. నడువు' అంటూ నాగేశ్వర్రావును తీసుకెళ్లిపోయారు.
సంపత్‌కి ఏం చేయాలో తోచలేదు. హుసేన్‌కు ఫోన్‌ చేశాడు. అతను ఫోను ఎత్తలేదు.
'మీ అమ్మ ముఖం చూసి పోలీసులతో మాట్లాడాను. కానీ ఏం లాభంలేదు. కోర్టు చుట్టూ తిరగాల్సిందే. కేసు నడుస్తాది. దొంగ ఇనుము కొనటం తప్పని తెలయదా? పరువు తక్కువ పనిచేశాడు. చుట్టుపక్కల ఏ ఇనుపముక్క పోయినా నాగేశ్వర్రావే మనుషుల్ని పెట్టి కాజేయించాడంటారు. చుట్టాలందరిలో ఎంత నగుబాటుగా ఉంటుంది? రేపెవడ్రా నీకు పిల్లనిచ్చేది? వాళ్లతో, వీళ్లతో చెప్పించి మా నాన్నకు టిఫినూ, భోజనమూ ఇంటి నుండి తీసుకెళ్లి ఇచ్చే ఏర్పాటు మాత్రం చేయగలిగాను. తీసుకెళ్లి ఇవ్వు' అంటూ మేనమామ వెళ్లిపోయాడు.

'యా అల్లా నా బేటా కరీమ్‌ను కాపాడు. కాకాని దర్గాలో సాంబ్రాణి ధూపమేయిస్తాను. మా ఊరి మసీదుకు సున్నం వేయిస్తాను. నా కడుపున పుట్టిన పెహలా బచ్చావాడు. వాడంటే నాకు చాలా ప్యార్‌' అంటూ కరీమ్‌ తల్లి కారే కన్నీళ్లతో మాటిమాటికీ నమాజు చేయసాగింది.
హుసేన్‌ భార్య కరీమ్‌ను తలుచుకుని కుమిలిపోతున్నది. 'నా మున్నా కరీమ్‌కు చాలా బీమార్‌ అయ్యింది. తకలీఫ్‌గా ఉందని చెప్పారు. వాడి ప్రాణం కాపాడు అల్లా. బదులుగా నా ఉసురు తీసుకో మేమేమైన గలత్‌ సేస్తే మాఫ్‌కరో అల్లా మాఫ్‌కరో' అని వల్లించుకుంటూ సొమ్మసిల్లింది.
యాదయ్య కూడా ఆసుపత్రి కొచ్చాడు.
'పాతిక ముఫ్పై ఊళ్లకు మన ఊరు సెంటరమ్మా.. తెల్లారిలేస్తే పనుల మీద మన ఊరికి వందల్లో జనం వాహనాలేసుకుని పనుల మీద వస్తారు. ఆ వాహనాల టైర్లకు ఎన్ని ఎక్కువ పంక్చర్ల్తెతే మనకంత బేరాలు తగులుతాయి. మన కొట్టు సెంటర్లో ఉండటం వలన ఎక్కువ మందికి తెలుసు. పాసింజర్ల వాహనాల టైర్లకు పంక్చర్లు పడాలని హుసేనుగారే నా చేత స్క్రూలు, మేకులు రోడ్ల మీద చల్లించేవాళ్లు. అలా నేను చల్లిన మేకే మన కరీమ్‌ కాలలో గుచ్చుకుని ఉంటుంది చాచీ' అంటూ.. యాదయ్య కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
మామగారి వంక హుసేన్‌ కోడలు తిరస్కారంగా చూసింది. కొడుకు మందులు కొనుక్కురావాలి అనే వంకతో అక్కడనుంచి వెళ్లాడు. హుసేన్‌ భార్య వంచిన తల ఎత్తలేదు.
'ఏం హుసేన్‌ భయ్యా! తబీయత్‌ కైసీ హై?'
'అచ్ఛా హై భయ్యా. అబ్‌ మై బహుత్‌ ఖుష్‌ హు. నా మనమడు కరీమ్‌తో సహా అందరూ బాగున్నారు. నాకిప్పుడు యాపారం, గీపారం ఏం లేదు. నా కొడుకు ఉస్మానే కూల్‌డ్రింకుల యాపారం నిజాయితీగా చేస్తున్నాడు. యాసంకాలం వచ్చిందిగా నా చేతుల్తోనే తాజా మామిడిపండ్ల రసం పిండి ఇస్తున్నాను. శాక్రిన్‌, గ్రీక్రీన్‌ కూడా ఏం కలపను. కొద్దిగా శక్కర్‌ మాత్రం ఏస్తాను' అన్నాడు హుసేన్‌ నవ్వుకుంటూ..
'ఏం నాగేశ్వర్రావ్‌? కొడుకు పెండ్లి పనులు పూర్తయినాయా? మేనమామ కూతురితో మంచి సంబంధమే కుదిరింది. నీ కొడుక్కి.' 'అవును మామా. వాడి ఉద్యోగం చూసి, వాడి ప్రవర్తన చూసి మేనమామే తన కూతురుని ఇచ్చి చేస్తున్నాడు. నేను నా ఇనప వ్యాపారం బంద్‌ చేసేశాను. పొలం కౌలుకివ్వటం మానేసి, నేనే సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. సంతోషంగా వుంటన్నది. పొలమెళ్లాలి. వస్తామామా' అంటూ నాగేశ్వర్రావు పొలంకేసి వెళ్లాడు.

- దాసరి శివకుమారి
9866067664