ఎవరి బతుకు వారిదే
ఎవరి కాలం వారిదే
ఎవరి గజిబిజీలు వారివే
ఎవరి ప్రాధాన్యాలు వారివే
స్నేహం అందరిది కదా !?
ఒకప్పుడు ఎంగిలి అనే ధ్యాసేలేని రోజులు
చేతులు చెట్టాపట్టాలేసుకుని
తిరిగిన అడుగులు
ఒకే సైకిల్ మీద
అందరం సినిమాకెళ్లిన సందర్భాలు
రూపాంతరం చెందుతున్న
స్నేహం సాక్షిగా
ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తూ
కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి
ఎదిగితే ఏడుపు
ఎగిరి కిందపడితే నవ్వు
బంధుత్వానికి రెండూ ప్రాణవాయువులు
వెన్ను తట్టడం ఒక్కటే
స్నేహమెరిగిన పాఠం
ఒకరు ఈర్ష్య పడుతున్నారంటే
కచ్చితంగా నువ్వు ఎదుగుతున్నట్టే
ఈర్ష్య పడేవాళ్ల వరసలో స్నేహం ఎదురైతే
మనిషిగా ఎంతెదుగుతున్నా
మానసికంగా బతుకుతూ చస్తున్నట్టే
బంగార్రాజు కంఠ
85003 50464