Jun 02,2023 16:11

ప్రజాశక్తి - యానాం : కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా కచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. శుక్రవారం స్థానిక దరియాలతిప్ప గ్రామంలో కె.ఆర్ నారాయణన్ ప్రభుత్వ హైస్కూల్లో ఓఎన్జీసీ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యానాం నియోజకవర్గంలో కంటి సంబంధిత వ్యాధులకు పూర్తిస్థాయిలో ప్రజలకు ఉచితంగా చికిత్సతో పాటు క్యాటరేక్ట్ ఆపరేషన్లు చేయించాలనే ఉద్దేశంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశామన్నారు. శిబిరంలో సుమారు 200 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి 20 మందికి కంటి ఆపరేషన్ అవసరముందని వైద్యులు నిర్ధారించారు. దీంతో వారిని రాజమహేంద్రవరం పరమహంస యోగానంద నేత్రాలయంకు పంపించారు. అనంతరం 150 మందికి పైగా ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ నెల 4న కనకాల పేటలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎఓ మునిస్వామి, ప్రభుత్వ ఆసుపత్రి ఏడి పలాస్ కుమార్ సెంధ్యాల్, విద్యుత్ శాఖ ఏఈ లంక కృష్ణారావు,సిఐ షణ్ముగం, లయన్స్ క్లబ్ యానాం పిల్లారాయ అధ్యక్షుడు పులవర్తి శ్రీను,గిడ్ల వెంకన్న, కమిడి బాలయోగి, దాసరి బుజ్జి, సబ్బతి శ్రీనివాసరావు,గిడ్ల బాలయోగి, పండు సిద్ధార్థ కుమార్, కొల్లు మాధవస్వామి, నూకాంబరం, సబ్బతి లోకేశ్వరరావు, లెక్స్, కామిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.