ఇన్నాళ్ళూ మృగాలతో సావాసం చేశా !
మచ్చిక నేనెరుగు..
కాలదెన్నడు నే మరుగు
నా చుట్టూ కంచె వేసుకోలే!
నా గుడిసె తాళం పెట్టుకోలే!
నా వెనుకా ఏ పైసా వెనకేసుకోలే!
చెట్టుకు మరో చెట్టూ
చుట్టూ కంచెలా ఉండి..
పక్కపక్కనే తోడుండీ..
నా వాళ్ళు పెంచిన కాన..!!
ఇదే నా ఆన..!!
వేట నా బాట
పోడు ఎవుసం
నా బాసట..
దారి నాది..
వంక నాది..
కలుషితం లేని జలం నా మది!
వలస నాది బతుకులో భాగమైంది..
నాడు నేడు నాది పోడు ఎవుసం..
అదే రేడుకు మా చెడ్డ ఎసనం..
ఎగాదిగా దాడులా..
ఈడ్చుకెళ్ళి దోసెనే జైలుగోడలా..
బుల్ డోజర్ల మాయనో.. ఏమో..
మరునాడే అడవంతా.. మైదానం..!
అడవి నా అమ్మ.. నా భుక్తి.. శక్తి..
సరిహద్దు నాకు తెల్వదు
అడవే నాకు హద్దు
హద్దులు మీరిన రాజ్యం
చేసెనే మాపై స్వైరం..
ఏ చట్టం నా పక్షమో ఎరుగను
న్యాయం తరాజులో
రాజ్యం వైపే మొగ్గు
భూమిని దొంగిలించట్లే
కంచేసి తెగ నమ్మట్లే
కబ్జా పదమెరుగను
చాటన చారెడు గింజల కోసం
రాలే చినుకు మీద ఆధారమై
తర తరాలుగా..
పొద్దుగాలమే ఎద్దులమై
అరక దున్ని బతుకుతున్న
అల్ప జీవిని.. మరీ స్వల్ప జీవిని..!
ఆదరువు అడవేనే..
మరి నాబిడ్డలకు సోదరుడు
ఆ అడవేనే..
ఆ.. అడవినే విడిచి పొమ్మంటే..
ఆదివాసిని నేను.. మూలవాసిని
నేనెందుకు మిన్నకుండాలా!!
తల్లి కానకు రక్షణవ్వాలా!!
గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201