
ఏ వ్యక్తికైనా బలం... బలగం... తన కుటుంబం. కుటుంబం అంటే పెద్ద బలగం అని, స్నేహితులు, బంధువుల సమూహం అని అర్థం. ఇటీవల వచ్చిన బలగం సినిమా... కుటుంబ ప్రాధాన్యతని, కుటుంబంలోని వ్యక్తులంతా కలిసివుంటే...అదే బలగం అని చెప్పింది. 'నా ఇంటి పేరు ప్రపంచం/ ప్రజలే నా కుటుంబం/ వెదజల్లుతా దిగ్దిగంతం/ అభ్యుదయ సుగంధం అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం' అంటారు సినారె. జననంతో మొదలయ్యే మనిషి జీవనచక్రం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసిందే. మనిషి చనిపోవడం అంటే... చెట్టు 'కూకటివేళ్లతో సహా కూలిపోవడం'గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని వుంటుందో... మనిషి ఆధారంగానూ అంతే జీవితాలు, బంధాలు పెనవేసుకుని వుంటాయి. అందుకే 'సంఘం శరణం గచ్ఛామి' అంటాడు బుద్ధుడు. మనిషి సంఘజీవి. కుటుంబం సమాజానికి ప్రాథమిక కొలబద్ద. మనిషి నలుగురితో కలిసి జీవించాలనుకుంటాడే తప్ప ఒంటరిగా బతకాలనుకోడు. 'మనిషికేం కావాలి... కాసింత దయ, కూసింత ప్రేమ' అంటాడు బుచ్చిబాబు. అవేమీ లేకుండా ఎవరికి వారు బందీలుగా బతకడం... ఎదురెదురుగా వున్నా పలకరించుకోలేనంత బిజీగా కాలం దొర్లించడం ఎడారితనం. ఈ ఎడారితనాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ మనిషి జీవితంనిండా ఒంపుతోంది.
ఉమ్మడి కుటుంబంలో ఎందరున్నా కలిసే వుండటం, ఉమ్మడి ఆస్తులు, ఆదాయాలు అన్నీ ఒక్కమాట మీద నడుస్తుండేవి. ఆ వ్యవస్థలో కుటుంబ సభ్యులందరికీ సాంఘిక, ఆర్థిక రక్షణ, విలువల పరమైన సౌకర్యాలు సమకూరేవి. ఒకరిపట్ల ఒకరికి ప్రేమాభిమానాలు సమృద్ధిగా వుండేవి. పారిశ్రామికీకరణ, శ్రమ విభజన, ఆధునిక విద్యా విధానం, వ్యక్తిగత గోప్యత, సాంకేతిక రంగంలో మార్పులు, ప్రపంచీకరణ వంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై ప్రభావం చూపింది. మనషుల మధ్య, మనసుల మధ్య ఇరుకుతనం పెంచింది. పాశ్చాత్య సంస్కృతీ, గ్లోబలైజేషన్ మన నట్టింట తిష్ట వేసింది. ఉమ్మడి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం ఆ వ్యష్టి కుటుంబాల స్థానే- నేను, నా కుటుంబం అనే ధోరణి పెరిగింది. వ్యక్తిగత స్వార్థం ప్రబలింది. 'మెదడే పెరిగి, హృదయం తరిగి/ నరుడే ఈనాడు వానరుడైనాడు' అంటాడు దాశరథి. మధురస్కృతులను పోగుచేసుకోలేని వ్యక్తి... సమాజానికి, కుటుంబానికి, చివరకు తనకు తానే భారమవుతాడు. తాను, తన కుటుంబం సంకుచిత తత్వంతో వలసపక్షిలా ఊరు దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులున్నా... లంకంత ఇంటిలో బిక్కుబిక్కుమంటూ వుండాలి. లేదా వృద్ధాశ్రమాల్లో కాలం గడపాలి. 'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే'నని కారల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. ఆ నిజాన్ని నేటి సమాజం రుజువు చేస్తోంది.
శతాబ్దాలుగా సమాజంలో ఆర్థిక సంబంధాలు, ఉత్పత్తి సంబంధాలు మారుతున్న క్రమంలోనే కుటుంబాల్లోనూ మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికే ప్రతి ఏడాది మే 15న 'అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు మంచి పొజిషన్‌లో వుండాలని, చాలా ఎత్తుకెదగాలని కోరుకుంటారు. అయితే, చిన్నప్పటి నుంచి ప్రేమా ఆప్యాయత మధ్య పెరిగిన పిల్లలే తల్లిదండ్రులను పట్టించుకోకపోతే... కంప్యూటర్లు, డాలర్ల మధ్య పెరిగే పిల్లలు వారి తల్లిదండ్రులను ఎలా చూస్తారు? మానవ సంబంధాల మధ్య వచ్చిన ఈ గ్యాప్‌ని తగ్గించుకోగలిగితే... ఈ కుటుంబ దినోత్సవానికి సార్థకత కలిగినట్లే. 'పిల్లల కోసం తల్లిదండ్రులు ఆనందంగా ఎదురు చూడాలిగానీ, బాధతో కాదు. సంక్రాంతికి వచ్చెళ్లండి... మిగతా పదకొండు నెలలు మీతో గడిపిన జ్ఞాపకాలతో సంతోషంగా ఎదురు చూస్తాం. అంతేగానీ, పిల్లలు వస్తారా... అసలు బతికుండగా వస్తారా అని.. గుమ్మంలో ఎదురుచూసే దౌర్భాగ్యం ఎందుకురా తల్లిదండ్రులకి' అని ఓ సినిమాలో చెబుతారు. నిజమే.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిన తర్వాత, పెద్దలు అనాథలు, పిల్లలు కుటుంబంలోని పెద్దల ప్రేమలు, బంధాల విలువలు తెలీకుండా బతికేస్తున్నారు. కుటుంబంలోని వ్యక్తులంతా నెలకో రెండునెల్లకో... కనీసం ఏడాదికో కలిసి... సంతోషంగా గడపగలిగితే... ఆ బంధాల విలువ, అందులోని మాధుర్యం భవిష్యత్తరాలూ చవిచూస్తాయి. కుటుంబంలోని సభ్యులంతా ఒక్కటిగా వుంటే అంతకుమించిన బలగం ఇంకేముంటుంది?