- పారిశుద్ధ్యంలో లోపాలు.
ప్రజాశక్తి - తాళ్లరేవు: తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి. హెచ్.సి.)లో నాసిరకం భోజనాలు, పారిశుధ్యంలో లోపాలు ఉన్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, రోగుల బంధువులు సువారి శ్రీనివాస్, వాసంశెట్టి కుమారి, కట్టా రత్నం, రెడ్డి దుర్గాభవాని తెలిపారు. రోగులకు ప్రతిరోజు అందించే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం నాసిరకంగా ఉంటున్నాయని అన్నారు. ఉదయం ఏడు గంటలకు రోగులకు ఇవ్వాల్సిన అల్పాహారం ఉదయం 8:30, 9: 00 గంటల మధ్యలో వస్తుందని దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతిరోజు ఇడ్లీ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. మెనూ ప్రకారం ఇడ్లీతోపాటు గుడ్డు, పాలు ఇవ్వాల్సి ఉండగా గుర్తొచ్చినప్పుడే గుడ్డు వేస్తున్నారని రోగుల బంధువులు ప్రజాశక్తి కి తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో పప్పు, రసం, మజ్జిగ మాత్రమే ఇస్తున్నారని, రసం నోటికి వెళ్లడం లేదని, మజ్జిగ నీళ్లలా ఉంటుందని వారు తెలిపారు. తాళ్లరేవు సి.హెచ్.సి. ఆధునీకరణ లో భాగంగా బి.సి. హాస్టల్ ను గత 4 యేళ్లు గా ఆసుపత్రి కోసం ఉపయోగిస్తున్నారని, అయితే బీసీ హాస్టల్ లో ఏర్పాటు చేసిన డెంగ్యూ వార్డ్ వెనుక కొన్నాళ్లుగా చెత్త పేరుకుపోయి ఉందని, దానిని తొలగించే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఆ చెత్త వల్ల దోమలు అధికమయ్యాయని తెలియజేశారు. వార్డు లో బూజులు శుభ్రం చేయడం లేదన్నారు. ఈ డెంగ్యూ వార్డులో రెండు ఫ్యాన్లు పనిచేయడం లేదని, బి.సి.హాస్టల్ లో రక్త పరీక్షల కోసం వేచి ఉండే రోగులకు అవసరమైన చోట ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని రోగుల బంధువులు డిమాండ్ చేశారు. దీనిపై తాళ్లరేవు సి.హెచ్.సి. వైద్యురాలు శిరీషను వివరణ కోరగా మెనూ ప్రకారం ప్రతిరోజు ఉదయం ఒక గుడ్డు, ఇడ్లీతో పాటు ఒక గ్లాసు పాలు ఇస్తామని, మధ్యాహ్నం అన్నం, ఒక కూర, ఒక ఫ్రై, రసం, పెరుగు రోగులకు అందిస్తున్నామని తెలిపారు. అయితే వైద్యురాలు చెప్పిన మెనూ ఈ సి హెచ్ సి లో అమలు కాకపోవడం గమనార్హం.










