- ఖరీఫ్ పంట కోతలు
- రబీకి సన్నద్ధం
- తుపానొస్తే భారీ నష్టమే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : 'మాండౌస్' తుపాను హెచ్చరికలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. తుపాను ఎపి దక్షిణకోస్తా, తమిళనాడు ఉత్తరకోస్తా మధ్య తీరం దాటుతుందన్న వార్తలతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లా రైతాంగం ఆందోళనగా ఉంది. మిగిలిన దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో సైతం వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనడంతో పంటలను కాపాడుకునేందుకు నానా యాతన పడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు కోతల సమయం. రబీ సాగుకు సన్నద్ధమవుతున్న వేళ. కీలక సమయంలో తుపాను రావడంతో రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు.
- వరి గండం
ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం చేతికొచ్చే ప్రధాన ఘట్టం. కాగా రెండు రోజుల నుంచి వాయుగుండం, తుపాను అంటుండటం, శుక్రవారం నుంచి వానలు మొదలు కావడంతో పంటలను కాపాడుకొనేందుకు యుద్ధ ప్రాతిపదికన వరి కోతలు చేపట్టారు. ఒకేసారి కోతలనడంతో యంత్రాలద్వారా కోతలు సాగించే దగ్గర రైతుల అవసరాన్ని అడ్డం పెట్టుకొని మిషన్ అద్దెలు విపరీతంగా పెంచేశారు. గంటకు ఎకరానికి రూ.వెయ్యి- రెండు వేలు ఉన్నది కాస్తా మూడు వేలు, అంతకుమించి వసూలు చేస్తున్నారు. ఒక్కో దగ్గర అంత పెట్టుకున్నా మిషన్లు అందుబాటులో లేవు. మిషన్లకూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కోతలు హడావిడిగా పూర్తి చేసినా ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఆర్‌బికెలలో ముందస్తు రిజిస్ట్రేషన్లు, కూపన్ల తతంగం ఉండనే ఉంది. అప్పటి ధాన్యం అప్పుడు అమ్మబోతే తేమ శాతం నిబంధన అడ్డంకిగా మారింది. ఆర్‌బికెలలో స్టోరేజి సదుపాయాల్లేవు. ఆర్‌బికెల వెలుపల కూడా ధాన్యాన్ని అమ్ముకోవచ్చని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులివ్వడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, మధ్యవర్తులను విధిలేని పరిస్థితుల్లో ఆశ్రయిస్తున్నారు. తుపాను నేపథ్యంలో మొత్తానికే పంటను పోగొట్టుకునేకంటే 'వచ్చిందే దక్కుళ్లు' అని మద్దతు ధరలతో నిమిత్తం లేకుండా అయినకాడికి తెగనమ్ముకొని నష్టపోతున్నారు. చేలల్లో కోసిన వరి కంకులను, ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు, ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్ల కోసం వెతుకులాడుతున్నారు. ప్రభుత్వం కనీసం రైతులకు పట్టాలిచ్చేందుకూ ముందుకురావట్లేదు.
- ఇతర పంటలకూ..
ఖరీఫ్ కందులు పూత దశ, గింజపట్టేదశలో ఉన్నాయి. పెసలు, మినుములు కోతకొచ్చాయి. రాయలసీమలో వేరుశనగ గింజ అబివృద్ధి దశలో, కోతలకు వచ్చింది. పత్తి రెండవ తీత దశలో ఉంది. చెరకు గడ వృద్ధి దశలో ఉంది. ఇంతకుముందు కురిసిన వర్షాలకు కొన్ని చోట్ల వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. కోతల సమయంలో భారీ వర్షాలు పడితే పంటలు నీటిపాలవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక రబీ సాగుకు రైతులు భూములను సిద్ధం చేస్తున్నారు. వరి నారుమళ్లు పెరుగుతున్నాయి. చాలా చోట్ల నాట్లు వేస్తున్నారు. శనగ, మినుము, పెసలు, మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. రబీలోనూ సాగు పుంజుకోలేదు. సీజన్‌లో రెండు మాసాలు పూర్తయినా 28 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. దాదాపు అన్ని పంటలూ తగ్గాయి. ఈపాటికే శనగ సాగు దాదాపు పూర్తి కావాల్సి ఉండగా ఆ పంట సైతం తగ్గింది. లిఫ్టులు, బోర్లు, కొన్ని ప్రాజెక్టుల కింద రబీలో వరి సాగు చేయొద్దని ప్రభుత్వం సూచించడంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు తుపాను అనడంతో వేసిన కొద్ది పంటలనూ నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులొస్తే ఉద్యానవన పంటలు, తోటలు, కూరగాయలకు నష్టమేనంటున్నారు.










