- రూ.లక్ష వరకూ సమర్పించుకోవాల్సిన దుస్థితి
- బాధిత రైతు కుటుంబాల ఆవేదన
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : అన్నదాతల ఆత్మహత్యలు సమాజానికి చేటు కాగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న అరకొర పునరావాస ప్యాకేజీకి లంచాలు మేసే రాబందులుండటం వ్యవస్థకు కళంకం. సాగు గిట్టుబాటుకాక, అప్పుల బాధతో వ్యవసాయం సాగించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.ఏడు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. సవాలక్ష షరతులు దాటుకొని పరిహారానికి అర్హత సాధించాక, సదరు ఆర్థిక సహాయం ఇవ్వాలంటే బాధిత కుటుంబం విధిగా రూ.50 వేల నుంచి లక్ష వరకు లంచం ముట్టజెప్పాలి. వ్యవసాయ, రెవెన్యూ, ఇతర అధికారులు ఆ మొత్తాన్నీ వాటాలు వేసుకుంటున్నారు. లంచం అందితేనే ఎక్స్‌గ్రేషియా రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోందని ఆరోపణలస్తున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లాలో లంచాల బాగోతం ఒక 'పద్ధతి' ప్రకారం సాగుతున్నట్లు సమాచారం.
- 267 కేసులకు పరిహారం
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు గత టిడిపి ప్రభుత్వం రూ.5 లక్షల ప్యాకేజీ ఇవ్వగా, వైసిపి ప్రభుత్వం వచ్చాక రూ.7 లక్షలు చేసింది. ఎవరికి ఎక్స్‌గ్రేషియా వచ్చేదీ ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆధార్, రేషన్‌కార్డు, రైతు లేక కౌలు రైతు అన్న గుర్తింపు, బ్యాంక్ అకౌంట్, పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఐఆర్, ఇటువంటివెన్నో ఉండాలి. అధికారులతో కూడిన త్రీమెన్ కమిటీ రైతు ఆత్మహత్యగా గుర్తించాలి. చాలా చోట్ల కౌలు రైతుల, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు సాంకేతిక కారణాలతో అర్హత పొందట్లేదు. రైతు ఆత్మహత్యల ఎక్స్‌గ్రేషియా కోసం ప్రభుత్వం ఏడాదికి బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయిస్తోంది. ఆత్మహత్యల సంఖ్యతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నిధులకు తగ్గట్టు పేమెంట్స్ జరుగుతున్నాయి. 2022-23లో రాష్ట్ర వాప్తంగా 267 ఆత్మహత్యలకు రూ.18.69 కోట్లు చెల్లించారు. ఈ చెల్లింపుల్లో చాలా మట్టుకు బాధిత రైతు కుటుంబాలు లంచాలిచ్చారని విమర్శలున్నాయి.
- వ్యవస్థలు ఉన్నా సరే...
పాలనలో పారదర్శకత, ఇంటి వద్దకే పరిపాలన నినాదంతో గ్రామ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను సర్కారు తెచ్చింది. ప్రభుత్వంలో ఎక్కడా అవినీతిని సహించబోమంటూ 'ఎసిబి'కి సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్లు పెట్టింది. మరోవైపు సమస్యల పరిష్కారం కోసం వారం వారం 'స్పందన' నిర్వహిస్తోంది. ప్రజల సమస్యలు వినేందుకు తాజాగా 'జగనన్నకు చెపుదాం' అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు తమకు వచ్చే ప్యాకేజీ కోసం పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన రాయలసీమలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి తనకు రూ.30 వేలిస్తేనే... అంటున్నారని రైతు కుటుంబాలు వాపోతున్నాయి. ఒక్క అధికారికే అంత మొత్తం ఇచ్చుకుంటే, మిగతా అధికారులు, సిబ్బందికి లెక్కేస్తే రూ.లక్ష వరకు లంచాలకే పోతున్నాయని, సర్కారు ఇచ్చే రూ.7 లక్షల్లో ఆరు లక్షలే చేతికందుతున్నాయని బాధిత రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. జిల్లాలో 12 ఆత్మహత్యలు జరగ్గా పదింటికి ఈ విధంగానే ముడుపులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల రైతు ఆత్మహత్యలు కొంత మందికి పండగగా మారడం దారుణం.










