May 04,2023 16:16

ప్రజాశక్తి - తాళ్లరేవు : ఒకప్పుడు ఆ నీటి గుండం రైతుల పెన్నిధి. నేడు అదే  నీటి గుండం  రైతాంగానికి గండంగా మారింది. పి.మల్లవరం పంచాయతీ పరిధిలో సుమారు 23 ఎకరాల్లో ఉన్న పెద్దగుండం నేడు గుర్రపు డెక్కతో మూసుకుపోవడం వల్ల, అకాల వర్షాల సమయంలో వర్షపు నీరు కిందకు వెళ్ళక, పండిన పంట కుళ్ళిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి గొంది నుంచి ఎంఎస్ఎన్ చారిటీస్ కాలనీ కింద ఉన్న మందార కాలువకు చెందిన ఊటకాలుకు అనుసంధానం చేస్తూ ఉన్న గుండంలో మట్టి పేరుకుపోయి గుర్రపుడెక్కతో మూసుకుపోయిందని రైతులు మట్టపర్తి సుబ్బారావు, చిట్టూరి శ్రీనివాస్, కాలా లోవ కుమార్, రాయుడు గోవిందు తదితరులు గురువారం “ ప్రజాశక్తి ”తో వారి ఆవేదన పంచుకున్నారు.  ఈ గుండంలో గుర్రపు డెక్క తొలగించి సుమారు నాలుగేళ్లయిందని, అప్పటినుంచి ఎటువంటి పనులు చేపట్టలేదని తెలిపారు. ఏ గుండం పంచాయతీకి ఆదాయంగా మారింది తప్ప రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. భారీ వర్షాలు పడినప్పుడు గుండంలో నీరు కిందకు వెంటనే పోయే విధంగా ఏర్పాట్లు లేకపోవడం వల్ల గుండం శివారు ఊట కాలువకు కల్వర్టు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు తెలిపారు. అంతేకాకుండా ఆటు - పోట్ల ద్వారా పోటు సమయంలో ఉప్పునీరు గుండంలోకి ప్రవేశించడంతో  గుండం ఎగదన్ని  ఉప్పునీరు పంట పొలాలకు వచ్చి చేరుతుందని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గుండంలో గుర్రపుడెక్కును తొలగించాలని, గుండం శివారు కల్వర్టు నిర్మించి  గేటు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.