Oct 22,2023 13:04
  • ఆందోళనలో రైతులు

ప్రజాశక్తి-పుట్లూరు : మండల వ్యాప్తంగా గత ఒకటిన్నర నెల నుంచి వర్షాలు లేకపోవడంతో వేసిన పత్తి మొక్కజొన్న వేరుశెనగ ఆముదం కంది తదితర పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలం వ్యాప్తంగా వేరుశెనగ 45హెక్టార్ విస్తీర్ణంలో సాగు చేశారు. మండలంలోని పుట్లూరు ,వెళ్ళుట్ల గ్రామాలలో ఎక్కువగా వేరుశనగ పంటను సాగు చేశారు. ఈ గ్రామాలలోని పొలం బెట్ట నేల కావడంతో పాటు వర్షాలు లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పుట్లూరు కు చెందిన కేశవ రెడ్డి మాట్లాడుతూ నాకున్న నాలుగున్నర ఎకరంలో రెండున్నర ఎకరం వేరుశెనగ వేశానని ఎకరాకు 40,000 రూపాయలు వరకు పెట్టుబడి వచ్చిందని పైరు బాగానే ఉందని తీరా ఊడలు దిగే సమయంలో భూమిలో తేమ శాతం లేకపోవడంతో పాటు వర్షాలు కూడా లేకపోవడంతో వేరుశనగ పంట ఎండిపోతుందని రైతు వాపోయాడు. దీంతో పెట్టిన పెట్టుబడి దేవుడు ఎరుగని పశుగ్రాసం కూడా రాకుండా పోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.