May 28,2023 14:38
  • డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

ప్రజాశక్తి-కాకినాడ : ఉపాధ్యాయుల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్ గా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక డిఇఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో కో కన్వీనర్ పి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి నాగమణి, బి శరత్, వెంకట్ రాజు, ప్రభాకర్ వర్మ తదితరులు మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన మంత్రి  బొత్స సత్యనారాయణ సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో అన్ని రకాల ఉపాధ్యాయ పదోన్నతులను మాన్యువల్ గా జరపడానికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇచ్చిన హామీకి భిన్నంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్లో జరపడానికి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఖాళీలు ఎక్కడ ఉన్నావో చూపకుండా ప్రమోషన్లు వద్దనుకునేవారు రాతపూర్వకంగా అన్ విల్లింగ్ తెలపాలని ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ గతంలో పదోన్నతులు ఇచ్చే ప్రక్రియకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. 2022 జూలైలో ఒకసారి 2023 జనవరిలో మరోసారి ప్రమోషన్లు ఇస్తామని ఉపాధ్యాయుల నుండి విల్లింగ్ తీసుకున్నారన్నారు. ప్రమోషన్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని అది తేలిన తర్వాతే ప్రమోషన్లు ఖరారు చేస్తామని నమ్మించి రూ. 2500ల అలవెన్స్ తో నాలుగు నెలలు పాటు పనిచేయించుకోవడం జరిగిందన్నారు. కానీ మొత్తం ప్రమోషన్ కౌన్సిలింగ్ రద్దుచేసి అందరికీ నిరాశ కలిగించారన్నారు. ఇప్పుడు కూడా ఎటువంటి ఖాళీ ప్లేస్ లు చూపకుండా విల్లింగ్ ఇచ్చిన వారికే ప్రమోషన్లు కల్పిస్తామని అధికారులు చెప్పడం జరుగుతుందన్నారు. ఎంఈఓ-2 ప్రమోషన్ల షెడ్యూల్ ను కూడా ఇంతవరకు ప్రకటించలేదన్నారు. అధికారుల తీరు ద్వారా అనేకమంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏ ఒక్క ఖాళీలను కూడా బ్లాక్ చేయకుండా బదిలీల జీవోలో ఉన్న అసంబద్దాలను సవరించాలని కోరారు. అన్ని రకాల ప్రమోషన్ల షెడ్యూల్ను ప్రకటించి మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, బదిలీల జీవో లో ఉన్న అసంబద్దాలను తొలగించాలని ఏ ఖాళీలను బ్లాక్ చేయకూడదని డిమాండ్ చేశారు. అనంతరం డీఈఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కే కాశీ విశ్వనాథం, ఎం శ్రీనివాస్, సిహెచ్ రవి, కే రామచంద్రరావు, ఎన్ గోవిందరాజులు, భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.