Nov 29,2022 07:13

         ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా సొంత ఇలాకా గుజరాత్‌. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 'సంకల్ప్‌ పత్ర్‌' పేరిట శనివారం బిజెపి ప్రకటించిన మేనిఫెస్టో ఆసాంతం మతోన్మాద ఎజెండాతో నిండిపోయింది. తిరిగి అధికారంలోకొస్తే ఉమ్మడి పౌర స్కృతి (కామన్‌ సివిల్‌ కోడ్‌- యుసిసి) అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాల అంతానికి యాంటీ ర్యాడికలైజేషన్‌ సెల్‌ను నెలకొల్పుతామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వలే ఆందోళనల నిర్వాహకుల నుంచి నష్ట పరిహారం వసూలు చేసే విధంగా రికవరీ డ్యామేజి ఆఫ్‌ పబ్లిక్‌, ప్రైవేటు ప్రాపర్టీస్‌ యాక్ట్‌ తెస్తామన్నారు. ద్వారకలో ప్రపంచంలోనే ఎత్తయిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెడతామన్నారు. ఈ హామీల వెనుక ఉన్న అసలు కథ స్పష్టం. ముస్లిం మైనార్టీలు లక్ష్యంగా హిందూ మతోన్మాదాన్ని ప్రజల మెదళ్లకు ఎక్కించి తద్వారా ఆ వర్గం ఓట్లు సమీకరించే వ్యూహం.
       1995 మొదలు ఇప్పటి వరకు మధ్యలో ఒకటి రెండేళ్లు మినహా రెండున్నర దశాబ్దాలు బిజెపినే గుజరాత్‌లో అధికారం వెలగబెడుతోంది. 13 ఏళ్లకు పైన మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. అభివృద్ధిపధంలో దూసుకెళుతున్న గుజరాత్‌ నమూనాను దేశ వ్యాప్తంగా పాదుకొల్పుతామని మోడీతో సహా బిజెపి నాయకులు ఊదరకొడుతుండగా పలు కీలక అభివృద్ధి సూచీల్లో గుజరాత్‌ బాగా వెనకబడి ఉందని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఎన్నికల వేళ ఆ వాస్తవాలు చర్చనీయాంశాలయ్యాయి. నేషనల్‌ ఫ్యామిలీ అండ్‌ హెల్త్‌ సర్వే తాజా నివేదిక ప్రకారం ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు గుజరాత్‌లో 39 శాతం. దేశ సగటు 35.5 శాతం. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు గుజరాత్‌లో 19 శాతం కాగా ఆలిండియా సగటు 25 శాతం. ఆ రాష్ట్రంలోని 6-23 నెలల లోపు చిన్నారుల్లో ఐదు శాతానికే పౌష్టికాహారం లభిస్తోంది. దేశ సగటు 11.3 శాతం. దేశ సగటులే ఆందోళనకరంగా ఉండగా గుజరాత్‌ మరీ అధ్వాన్నంగా ఉంది. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 67 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతుండగా గుజరాత్‌లో 80 శాతం. గర్భిణీలు, మహిళల్లో 65 శాతం మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. పారిశ్రామికీకరణ జరిగిన అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, దాహోడ్‌లలో సమస్య ఎక్కువగా ఉందని నీతిఆయోగ్‌ వెల్లడించింది. గుజరాత్‌ మోడల్‌ విఫలమైందని రుజువు చేసే ఎన్నో పరిణామాలు ఈ కాలంలో చోటు చేసుకున్నాయి. పంట పెట్టుబడి ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధరలు పడిపోయిన రైతుల అసంతృప్తి నుంచి పటీదార్‌ ఉద్యమం లేచింది. రైతుల ఆత్మహత్యలకు అంతే లేదు. వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు అతి తక్కువ వేతనాలు, ఉద్యోగ అభద్రతతో సతమతమవుతున్నారు. కోవిడ్‌ నియంత్రణా వైఫల్యం సరేసరి.
      బిజెపి హిందూ మతతత్వ పాలనా నమూనాను రూపొందించి నిర్మించిన ప్రయోగశాల గుజరాత్‌. 2002 మారణకాండ తర్వాత కూడా ఎన్నికలొచ్చిన ప్రతి సారీ మతోన్మాద ఎత్తుగడలు ప్రయోగిస్తోంది. నాటి బిల్కిస్‌ బానో కేసులో గ్యాంగ్‌ రేప్‌, హత్యలకు పాల్పడిన 11 మంది నేరస్తులను కేంద్రం సమ్మతితో గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది అందుకే. గుజరాత్‌ మోడల్‌ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మరోమారు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ వంటి వాటిని వండి వారుస్తోంది. మరో వైపు ప్రజల్లో, దళిత, గిరిజనుల్లో గూడుకట్టుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి మార్పు, కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన 38 మందికి టిక్కెట్లు, సిట్టింగ్‌లలో 38 మందికి టిక్కెట్ల నిరాకరణ, ప్రధాని సుడిగాలి పర్యటనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు ఏకరువు పెట్టింది. హార్ధిక్‌ పటేల్‌ వంటి వారిని ఆకర్షించడం మొదలుకొని ఇబిసిలకు రిజర్వేషన్ల వరకు సోషల్‌ ఇంజనీరింగ్‌కు పాల్పడుతోంది. గత ఎన్నికల్లో బిజెపి చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన గెలిచాననిపించుకుంది. ఈ తడవ గెలుపు గండంగానే పరిణమించింది. బిజెపి కుతంత్రాలను లోను కాకుండా ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి దేశాన్ని రక్షించే బృహత్‌ కర్తవ్యాన్ని గుజరాత్‌ ప్రజలు స్వీకరిస్తారని ఆశిద్దాం.