
సామాజిక, ఆర్థిక సంక్షోభాలు లేని వ్యవస్థ, యుద్దాలు, రోగాలు లేని సమాజం సాధ్యమేనని 20వ శతాబ్దపు రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. కార్ల్ మార్క్స్-ఫెడరిక్, ఎంజెల్స్‌ల సోషలిజం తాత్వికత పేరుతో రూపొందిన సోవియట్-సోషలిస్ట్ రిపబ్లిక్ రష్యా మొదలుపెట్టిన ప్రయాణం ఎందరినో ప్రేరేపించింది. మానవ హక్కులు, ముఖ్యంగా స్త్రీ, పురుషుల సమానత్వం సాధ్యమని రష్యా 20వ శతాబ్ది మొదటి భాగంలో ప్రపంచానికి చూపెట్టింది. చైనా వంటి అనేక దేశాల్ని ప్రభావితం చేసింది. యూరప్, అమెరికా దేశాల పెట్టుబడిదారీ వ్యవస్థల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. ఫలితంగా రూపొందిందే ''అందరికే ఆహారాన్ని'' అందించగల వ్యవసాయం. 19వ శతాబ్దపు పారిశ్రామిక విప్లవాల నేపథ్యంతో మల్చబడ్డ ఈ వ్యవసాయాన్ని ''హరిత విప్లవంగా'' పిలిచారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా దాన్ని ప్రపంచ వ్యాపితం చేశారు.. ఆ క్రమంలో వలస దేశాల క్కూడా దాన్నీ విస్తరింపజేయడం, ఆహార కొరతను తీర్చగల సత్తా పెట్టుబడీదారీ దేశాల పారిశ్రామిక విప్లవాల వెలుగులోనే జరుగుతుందని భ్రమింపజేశారు. భారతదేశం, అలాగే అనేక ఆఫ్రికా దేశాల స్వావలంబనకు బాటలు వేసినట్లు చెప్పుకొన్నారు. వ్యవసాయ (ఆహార రంగాలకు కీలక మైన పరిశోధన, విస్తరణ కేంద్రాన్ని తమ అదుపులో నడిచేట్లుగా కొన్ని చేశాయి.. వివిధ దేశాల వ్యవసాయం హరితవిప్లవ సాంకేతికాల నేపథ్యంలోకి మారేట్లుగా అమెరికా, ఐరోపా దేశాల తమ మార్కెట్ వ్యవస్ధలను మల్చుకున్నాయి. దాదాపు ఐదారు దశాబ్దాల పాటు ఈ వరవడి కొనసాగింది. అయితే 1980-85 నుండి రూపొందిన రాజకీయార్థిక మార్పులు, ముఖ్యంగా'' సోవియట్ యూనియన్'' విచ్చిన్నం చైనా ఆర్థిక తాత్వికతల మార్పు, పర్యావరణరీత్యా ముందుకొచ్చిన సంక్షోభాలు. ప్రపంచాన్ని మలుపుతిప్పాయి. హరిత విప్లవం తెచ్చిన ఉత్పత్తి పెరుగుదల ఆహారాన్ని అందరికీ అందుబాటులోకి తేలేకపోయింది. అనేక ఆసియా, ఆఫ్రికాదేశాల ప్రజలు ఆహార అవసరాన్ని అందుకోలేక పోయింది. దానికి నిదర్శనమే 'సహసాబ్ధ్రి లక్ష్యాలు రూపొందటం. వివిధ దేశాలకు ఐక్యరాజ్యసమితి కాలపరిమితి విధించి తమ దేశ ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి తేవాలని చెప్పటం, 2015 నాటికి అది సాధ్యపరచాలని హెచ్చరించింది. అయినా చాలాదేశాలు ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. హరిత విప్లవాన్ని సాధిచి తమ ఆహార ఉత్పత్తుల్ని ఐదారు రేట్లు పెంచుకోగలిగిన భారతదేశం ఇదెందుకు సాధించలేకపోయింది. పైగా హరిత విప్లవాన్ని ఆబగా అందుకొన్న అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి కీలకమైన రైతులు ఆత్మహత్యలు, వలసలతో ''వ్యవసాయ సంక్షోభాన్ని'' బయటపెట్టారు. భారతదేశ హరిత విప్లవానికి వైతాళికులుగా పేర్కొనబడ్డ అనేకమంది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, సామాజిక ఉద్యమకారులు ఈ అంశాన్ని గత 3-4 దశాబ్దాలుగా చర్చిస్తున్నారు. అనేకమంది నిపుణులతో కమీషన్లు నడిచాయి. ఆ నేపధ్యంలో రూపొందిందే ''జాతీయ రైతు కమిషన్'' . దానికి నేతృత్వం వహించి ప్రొ. ఎం.ఎస్. స్వామినాధన్ దశాబ్దం క్రితమే '' ఆదాయ భద్రత '' కేంద్రంగా నడిచే కుటుంబ వ్వవసాయమే దానికి పరిష్కారమని సూచించారు. అయినా ప్రభుత్వాల వరవడి మారలేదు. పైగా పెట్టుబడిదారీ దేశాల నమూనాను అనుసరింపజేసే ఆర్ధిక సంస్కరణల్ని ప్రవేశ పెడుతూనే ఉన్నాయి. కుంటుతూ నడిచే కుటుంబ వ్యవసాయాన్ని కూల్చితే తప్ప ఈ సంక్షోభం తీరదని చెప్పకుండా చెప్తున్నారు. వ్యవసాయం వ్యాపారంగా మారాలని వృత్తిగా నిలబడే దశపోయిందనీ , అదే అమెరికా, ఐరోపాలు నిరూపించాయని నమ్మ బలుకుతున్నారు. ఇదెంత వరకు సమంజసం? హేతు బద్ధమైన అవగాహనా ?
సమాజాన్ని మార్చగల వ్యవసాయాభివృద్ధి
ఆ మధ్య ప్రపంచ బ్యాంక్ నిపుణుల సంఘం అప్రయత్నంగా ఒక వాస్తవాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. దాని ప్రకారం ప్రసుత్త ప్రపంచ సంక్షోభ దశలో ఆకలిని, పౌష్టికాహార లోపాన్ని, దారిద్రాన్ని సహజ వనరుల పతనాన్ని, పర్యావరణ విచ్చేదనాన్ని, ఉగ్రవాద వరవడిని ఆపగలిగేది ఒక్క వ్యవసాయ అభివృద్ధి మాత్రమే. కారణం ప్రపంచంలో అధిక జనాభా దేశాలు ఇప్పటికీ వ్యవసాయాభివృద్ధి కేంద్రంగా నడుస్తున్నాయి. అందులో ఎక్కువ దేశాలు కుటుంబ వ్యవసాయ వృత్తి (వ్యాపారం) మీద ఆధారపడుతున్నాయి. అయితే వ్యవసాయ (ఆహార ఉత్పత్తి) అభివృద్ధి రైతు (అసలైన సాగుదారు) అభివృద్ధితో ముడిపడి ఉంది. కార్పొరేట్ సంస్థల కొమ్ముకాసే ప్రభుత్వాలు ప్రపంచ మార్కెట్ వ్యవస్థలు ఈ విషయాన్ని గుర్తించ నిరాకరిస్తున్నాయి. పైగా ప్రజలను మభ్యపెట్టే 'సుస్థిర వ్యవసాయం', 'నిరంతర హరిత విప్లవం', 'ప్రకృతి వ్యవసాయం', 'సేంద్రీయ వ్యవసాయం', 'మిద్దెతోట వ్యవసాయం', 'మరో హరిత విప్లవం' వంటి నినాదాలతో తరచూ పొద్దు పుచ్చుతున్నాయి, మభ్య పెడుతున్నాయి. ' 'దాతృత్వ పెట్టుబడిదారుల ఉచ్చులో పడ్డాయి.
వ్యవసాయ పరిజ్ఞానం, అభివృద్ధి అధ్యయన సంస్థ అంతర్జాతీయ స్థాయిలో (ఐఎఎఎస్‌డి) ఈ శతాబ్ధి ప్రారంభంలో తమ అధ్యయనాన్ని వెలువరించింది. దాని ప్రకారం వనరుల రక్షణ, సుస్థిరత మనుగడ, చిన్న, సన్నకారు రైతుల 'కుటుంబ వ్యవసాయం' ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆధునిక యంత్రాలు, రసాయనాల మీద నడిచే పెద్ద కమతాల సేద్యం, సుస్థిరత, వనరుల రక్షణను కాపాడలేదు. పైగా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల పెద్ద భూ కమతాల సేద్యంలో ఒక కిలో కాలరీస్ ఆహార ఉత్పత్తి 10-20 కిలో కాలరీస్ శక్తిని (ఇంధనాన్ని కొత్త రసాయనాన్ని, విత్తనాల్ని) వాడటం జరుగుతున్నది. అదే కుటుంబ వ్యవసాయ కమతాల ద్వారా ఒక కిలో కాలరీస్ శక్తి ద్వారా 4-10 కిలో కాలరీస్ ఆహార ఉత్పత్తి జరుగుతున్నది. పైగా పెద్ద భూకమతాల కంపెనీలు ప్రభుత్వ రాయితీల సహాయాన్ని అతిగా పొందుతున్నారని తేలింది. (ప్రొ. రాజేశ్వరి ఎస్. రైనా, 2009 క్రోడీకరణ).
ఈ నేపధ్యంలో రూపొందిన ప్రపంచ ఆహార వ్యవసాయ నివేదికలు, క్యూబా వంటి చిన్న దేశం కుటుంబ వ్యవసాయ నిర్వహణ ద్వారా వనరుల రక్షణ కేంద్రంగా ఏ విధంగా ముందుకు పోతుందో తెలియ జేస్తున్నాయి. జాతీయ రైతు కమిషన్ ముఖ్య సిపార్సులు కుటుంబ వ్యవసాయానికి ఆదాయ - భద్రత ఎంత ముఖ్యమో వివరించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆహార ఉత్పత్తి అనే అవగాహన నష్టకరమని అనేక దేశాల్లో తేలింది. ముఖ్యంగా వనరులకు పరిమితులున్న దేశంలో 'ఉత్పత్తిదారులు' ప్రతికూలతలోకి నెట్టబడతారని పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి భారతదేశ రాష్ట్రాల్లో వేగంగా బయటకొచ్చింది. ప్రారంభదశలో లభించిన ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ మౌళిక సూత్రాలన్నీ తిలోదకానికి దారితీయటం పర్యావరణ పరంగానూ, ఆర్థికంగానూ నష్టకరమని హరిత విప్లవం నిరూపించింది. ''కుటుంబ వ్యవసాయం'' బదులుగా కంపెనీ వ్యవసాయం మంచిదనే భ్రమలోకి సమాజాన్ని నెట్టింది. వ్యవసాయేతర వృత్తి ముఖ్యంగా ప్రభుత్వ లేక కంపెనీల ద్వారా, నిర్దేశించబడే వ్యాపకం (ఉద్యోగం) ఆదాయ భద్రతనిస్తుందనే ధోరణి ప్రబలింది. వనరుల వాడకంలో పున్ణనిర్మాణంలో పూర్తి విచక్షణా రహితమైన ధోరణి ప్రబలింది. దాని ఫలితమే చిరుధాన్య పైర్లకు బదులుగా వరి, గోధుమ వంటి అధిక వనరుల వినియోగంతో ముడిపడిన వాటి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఒరవడి మార్చకుండా కేవలం ''ప్రకృతి వ్యవసాయం'' పేరుతో నడిచే సంస్కరణలతో వనరులు రక్షించబడవు. అలాగే సమాజపరమైన సమతుల్యత నిలబడదు. స్వామినాధన్ తన జాతీయ రైతు కమిషన్ నివేదిక ద్వారా, ప్రొ. రతన్‌లాల్ వంటి వ్యవసాయ నిపుణుడు తమ భూరక్షణ ఉద్యమాల ద్వారా తేల్చిందిదే. అందుకే ఆహార భద్రత నిలబడాలంటే ఉత్పత్తిదారుడి ఆదాయ భద్రత, వ్యవసాయ వృత్తి (వ్యాపార) పరమైన గౌరవం పునరుద్ధరించబడాలి. పదెకరాల గోధుమ, వరి వంటి పంటల సాగుదారుడి కంటే ఒక చిన్న ప్రభుత్వోద్యోగి జీవన భద్రత కలిగి ఉండడం ఈ దేశ వ్యవసాయ దుస్థితికి నిదర్శనం. ఈ వరవడిని మార్చలేని ప్రభుత్వాలు దేశ స్వావలంబనను నిలబెట్టలేవు. పర్యావరణ పతనాన్ని ఆపలేవు. జన్యుమార్పిడి ప్రక్రియల రూపంలో, రసాయన సాంకేతికాల పరంగా అనేక నూతన ఆవిష్కరణలు సామాజికంగానూ, ఆర్థికంగానూ, పర్యావరణ పరంగానూ నష్టకరమని బయటకొస్తూనే ఉంది. అయినా వ్యక్తిగత సంపద పెంచగలిగే వృత్తే సర్వస్వమనుకొనే కార్పొరేట్ వర్గం కుటుంబ వ్యవసాయానికి, ఉత్పత్తిదారుడి రక్షణకు అడ్డంకిగా మారుతుంది.
వ్యవసాయేతర వ్యాపకం లేక వృత్తి లేక వ్యాపారం లేక ఉద్యోగాలు విస్తరింపజేసినప్పుడే ఈ కుటుంబ వ్యవసాయం నిలబడుతుంది. ''గొడ్డు చాకిరి'' కేంద్రంగా ఆహార ఉత్పత్తి నడిచిన దేశాల్లో వ్యవసాయం విలువలేని వృత్తిగా మారుతుంది. చైనా, వియత్నాం, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ వంటి పెట్టుబడిదారీదేశాలు దీన్ని నిరూపించాయి. వనరులను పతనం చేసే, కార్పొరేట్ పార్మింగ్ పద్ధతులు నడిచే అమెరికా, ఆస్ట్రేలియా దేశాల అనుభవాలు ప్రపంచానికి నేర్పుతున్న సత్యమిదే!
ప్రొ. ఎన్. వేణుగోపాలరావు 94900 98905