Oct 26,2023 07:11
  • కుల, మత విద్వేషం అనేది విచక్షణ ఎరుగని ఒక చిచ్చు. అది మానవత్వాన్ని కాల్చేస్తుంది. మానవ సంబంధాలను కూల్చేస్తోంది. భార్యాభర్తలను సైతం విడదీస్తోంది. మణిపూర్లో తెగల మధ్య చెలరేగిన కార్చిచ్చు ఎన్నో దాడులకు, దారుణాలకు దారి తీసింది. అమానవీయ సంఘటనలకు, హత్యాచారాలకు ఆజ్యం పోసింది. వేర్వేరు తెగల మధ్య ఏర్పడ్డ వివాహ బంధాలు విచ్ఛిన్నం కావటానికి కారణమైన ఉదంతాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.

మణిపూర్‌లో మే నుండి వరుసగా జరుగుతున్న అల్లర్లలో ఎన్నో జంటలు విడిపోయాయి. ప్రాణభయంతో మృత్యుకుహరంలో భార్యబిడ్డలను విడిచి పెట్టేసిన కొంతమంది భర్తలు తమ దారి తాము చూసుకుంటే.. ఉపాధి కోసం దూరప్రాంతాలకు వెళ్లిన కొంతమంది భర్తలు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. రెండు కులాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో తలో దిక్కూ పారిపోతున్న వారిలో కులాంతర వివాహాలు చేసుకున్న కుకీ-మెయితీల జంటలు ఎన్నో ఉన్నాయి. భాగస్వామిని కోల్పోయిన లేక విడిచిపెట్టడం వల్ల ఒంటరిగా మిగిలిపోయిన ఆ మహిళలు, పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అంధ:కారంలో చిక్కుకుపోయింది.
చురచుందపూర్‌లోని బెతెల్‌ గ్రామ నివాసి కుకీ తెగకు చెందిన మహిళ కిమ్‌ హాకిప్‌. ఆగస్టులో ఆమె తన ఏడేళ్ల వివాహబంధం నుండి దూరంగా నెట్టివేయబడింది. మెయితీ వర్గానికి చెందిన ఆమె భర్త దాడుల భయంతో రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా శరణార్థిగా మిజోరాం పారిపోయాడు. ఆ గ్రామం మెయితీ ఆధిపత్యం ఉన్న గ్రామం. కుకీ మహిళను పెళ్లి చేసుకున్నానని తనవారే తనకు హాని చేస్తారని భావించి నన్ను, పిల్లలను ఇక్కడే వదిలేసి అతను వెళ్లిపోయాడు. మూడు నెలలు నేను ఇంట్లోనే బందీలా ఉండిపోయాను. కొన్ని వారాల పాటు ఇక్కడ దాడులు తీవ్రంగా జరిగాయి. ఈ ద్వేషం మా జంటను విడదీస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. పరిస్థితులు ఎప్పటికి కుదుటపడతాయో.. నా భర్త మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదు. నా దగ్గరున్న డబ్బు అంతా ఖర్చయిపోయింది' అంటున్న హాకిప్‌ కుకీ తెగకు చెందిందన్న విషయం ఇరుగుపొరుగుకు అంతగా తెలియదు. ఎప్పుడైతే ఆమె భర్త విడిచిపెట్టి పోయాడో అప్పటి నుండి ఆమెను అనుమానించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో 'అప్పటికే ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం అయిపోయాయి. పిల్లలను బతికించుకోవాలంటే ముందు నేను ఇక్కడి నుండి బయటపడాలి. ఆర్మీలో పనిచేస్తున్న బంధువుల సాయంతో ఎలాగోలా సురక్షిత ప్రాంతానికైతే చేరుకున్నాను. అయితే, అక్కడ నేను వచ్చిన ప్రాంతంలో కుకీ- మెయితీ జంటలు ఎన్నో ఉన్నాయి. వారంతా ఎలా ఉన్నారో.. ఏమైందో.. తెలియదు. ప్రాణాలతో బయటపడ్డా నా జీవితమేమీ సుఖాంతం కాలేదు' అంటూ నీళ్లు నిండిన కళ్లతో చెబుతోంది.

family-collapse-in-manipur-violence-jeevana-article


ఈ ఘర్షణలు సద్దుమణిగాయి అనుకున్న వేళ సోషల్‌ మీడియాలో వెలుగు చూసిన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యతో మళ్లీ రాజుకున్నాయి. ఆ సందర్భంలో అప్పటి వరకు స్నేహితులుగా మెలిగిన కుకీ-మెయితీ విద్యార్థులు ఇంతకుముందులా లేరని అంటోంది 18 ఏళ్ల మోనికా కాయా. 'కాలేజీలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్లల్లో కుకీలు ఎవరు? మెయితీలు ఎవరు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఆ హత్యలు చూసిన తరువాత నా పక్కనున్న వాళ్లని కూడా అనుమానించాల్సి వస్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ల నుండో ఇష్టపడుతూ వివాహం ద్వారా ఒక్కటవుదామన్న ఎంతోమంది విద్యార్థులు వాళ్ల నిర్ణయాన్ని మార్చుకోవడం నాకు తెలుసు. స్నేహం
కంటే ప్రేమ బలమైనదని నమ్మే మా యువత కూడా వేరే తెగ వ్యక్తితో వివాహబంధం కొనసాగించడానికి ధైర్యం చేయడం లేద'ని మోనిక వాపోతోంది.
చురచందపూర్‌లో నివసిస్తున 48 ఏళ్ల లాల్నుమావి కిటికీ దగ్గర కూర్చొని రోడ్డువైపే చాలా విచారంగా చూస్తోంది. ఆమె భర్త బస్సు డ్రైవరు. 'పెళ్లయిన కొత్తల్లో నన్ను చూసేందుకు ఈ గ్రామం నుండి ఒక్క ట్రిప్పైనా వేసేవాడు. నేను ప్రతి రోజూ ఇక్కడే అతని కోసం ఎదురుచూసేదాన్ని. మూడేళ్లపాటు ఇలాగే సాగింది. మాకు నలుగురు పిల్లలు. అందరూ 18 నుండి 28 ఏళ్ల వయసువారు. ఇప్పుడు నా భర్త వయసు 60 ఏళ్లు. దాడుల భయంతో అతను మమ్మల్ని వదిలి వంద కిలోమీటర్ల దూరానికి పారిపోయాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. వస్తాడో రాడో కూడా తెలియదు. నా పిల్లలు అర్ధంతరంగా చదువు మానేశారు. వాళ్లను ఎలా పోషించాలో నాకు తెలియదు. నా జీవితంలో ప్రతి ఒక్కదాన్ని కోల్పోయాను' అంటూ విచార వదనంతో ఆమె చెబుతోంది.

family-collapse-in-manipur-violence-jeevana-article


రెబెకా (38) కుకీ మహిళ. మెయితీ తెగకు చెందిన భర్తతో కలిసి ఉంటున్న ఆమె ఇంటిని దాడుల గుంపు ఛిన్నాభిన్నం చేసింది. అడ్డొచ్చిన భర్తను కాల్చి చంపింది. 'నేను నా సర్వస్వం కోల్పోయాను. పుట్టిన నేలను, కుటుంబాన్ని, నా గుర్తింపును ఇలా ప్రతి ఒక్కదాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు అక్కడ నాకంటూ ఏమీ లేదు' అంటూ శరణార్ధి శిబిరంలో ఆశ్రయం పొందుతున్న రెబెకా చెబుతున్నప్పుడు ఆమె కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి.
చురచందపూర్‌ పాత బజార్‌. 31 ఏళ్ల అన్నా గోడకు ఆనుకుని కూర్చొని ఉంది. ఆమె కళ్లు తడిబారి ఉన్నాయి. అప్పుడే తన ఆరేళ్ల చిన్న కూతురు బొమ్మ ఫోను పట్టుకుని అమ్మ పక్కన కూర్చొంటూ నాన్నతో మాట్లాడుతున్నట్లు నటిస్తోంది. 'అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? మేమిద్దరం షాపుకు వెళ్లి చాక్లెట్లు కొనుక్కోవాలి' అంటూ పక్కనే ఉన్న అమ్మను కుదుపుతూ అడుగుతోంది. ఆ పిల్ల అలా అడుగుతున్నప్పుడు అప్పటికే తడి నిండిన అన్నా కళ్లనీళ్లు కట్టలు తెంచుకున్న కాలువలా చెంపలపై జారాయి. రెండు చేతులతో తన చెంపలను తుడుచుకుంటూ ఆ పిల్లను హత్తుకుంది అన్నా. ఎప్పటికీ కనపడని తండ్రి గురించి ఆ పిల్లతో ఏం చెప్పాలో తెలియక ఆ తల్లి హృదయం కన్నీటి సంద్రంలో కొట్టుకుపోతోంది.
అన్నా భర్త లుంగ్నిలాల్‌ ఇంపాల్‌లో పనిచేస్తున్నాడు. అద్దె ఇంట్లో తన కుకీ బృందంతో కలసి జీవిస్తున్నాడు. దాడులు మొదలైన రెండో రోజు లుంగ్నిలాల్‌ నుండి అన్నాకు ఫోను వచ్చింది. 'అప్పుడు అర్ధరాత్రి.. అతను ఫోన్లో ఏదో చెబుతున్నాడు. నాకు అర్థం కాలేదు. అక్కడ పరిస్థితులు బాగోలేవని, గ్రామానికి వచ్చేస్తానని చాలా చిన్న స్వరంతో మాట్లాడాడు. ఆ తెల్లవారే మెయితీ గుంపు ఆ ఇంట్లో ఉన్న కుకీలందరినీ బయటికి లాగి మరీ హతమర్చింది. 14 ఏళ్ల వయసులో నేను అతన్ని చూశాను. నాకోసమే అతని కళ్లు వెదికేవి. ఐదేళ్లపాటు మేం ప్రేమించుకున్నాం. మా వివాహమై ఇప్పటికి ముప్పరు ఏళ్లు. పిల్లలతో, భర్తతో హాయిగా ఉంటున్న నా జీవితాన్ని ఈ విధ్వంసం తలకిందులు చేసింది. నాన్న లేడన్న నిజాన్ని పిల్లలకు చెప్పే ధైర్యం నాకు లేదు. చిన్న పిల్ల ఇంకా నాన్న కోసం ఎదురు చూడని రోజు లేదు' అంటూ వెక్కిళ్లుపడుతూ అన్నా చెబుతోంది.