
రాము ఆరవ తరగతి చదువుతున్నాడు. పాటలు చాలా బాగా పాడతాడు. కానీ మొహమాటం ఎక్కువ. రాము పాడుతాడన్న సంగతి క్లాసులో ఎవరికీ తెలియదు. ఒకసారి రాఘవయ్య మాస్టారు రాము ఇంటివైపు ఏదో పనిమీద వెళ్లారు. అప్పుడు రాము వాళ్ల ఇంటి నుంచి ఒక పాట వినిపించింది. ఆయన అక్కడే ఆగి, ఆ శ్రావ్యమైన గొంతుకు ముగ్ధుడైపోయారు. రాము పాడుతున్నాడని అతని తండ్రి ద్వారా తెలుసుకొన్నారు. అయితే 'నేను విన్న సంగతి మీ అబ్బాయికి చెప్పకండి' అని చెప్పి మాస్టారు వెళ్లిపోయారు.
మరుసటి రోజు రాఘవయ్య మాస్టారు పిల్లలతో 'పిల్లలూ! ఈరోజు మీరందరూ పాటలు పాడాలి' అని అన్నారు. కొందరు పిల్లలు ఉత్సాహంగా వచ్చి పాటలు పాడారు. తరగతిలోని పిల్లలందరూ చప్పట్లతో వారిని అభినందించారు. కానీ రాము మాత్రం పాడటానికి ముందుకు రాలేదు. అప్పుడు మాస్టారు 'ఏం రామూ! నీకు పాటలు పాడటం రాదా!' అని అడిగారు. రాముకు మనసులో పాడాలని ఉంది. కానీ మొహమాటంతో 'రావు సార్' అని అబద్ధం చెప్పాడు. అప్పుడు మాస్టారు 'చూడు రామూ! చాలామంది పిల్లలు పాడారు. నీకు వచ్చింది పాడు. ఇక్కడ నిన్ను హేళన చేసేవారు ఎవరూ లేరు' అన్నారు. మాస్టారు ఇచ్చిన ధైర్యంతో రాము పాట పాడాడు. రాము పాట విని మాస్టారుతో పాటు పిల్లలంతా గట్టిగా చప్పట్లు కొట్టారు.
'రామూ! నీకు వచ్చిన కళను దాచవద్దు. నువ్వు ఎంతో అద్భుతంగా పాడావు. నీ పాట విని నీ మిత్రులు చూడు నిన్ను ఎంతో మెచ్చుకున్నారు. బిడియం వీడి, సాధన చెయ్యి. భవిష్యత్తులో గొప్ప గాయకుడవు అవుతావు' అని మాస్టారు అన్నారు.
'మాస్టారూ! మీరు నాలో ఉన్న భయం పోగొట్టారు. ఇకనుండి నేను మొహమాట పడను. ఎప్పుడు పాడమన్నా పాడతాను. మీరన్నట్లు గొప్ప గాయకుడిని అవుతాను' అని రాము అన్నాడు. రాములో వచ్చిన మార్పుకు మాస్టారు ఎంతో సంతోషించారు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
ధర్మపురి, 99085 54535