Sep 24,2023 11:25

న్యూఢిల్లీ :   భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను వేధించేందుకు ఏ అవకాశాన్ని వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం కోర్టుకు తెలిపారు. అతనిపై అభియోగాలకు తగిన ఆధారాలు ఉన్నాయని వాదించారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌ పై ఢిల్లీలోని రోజ్‌ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది. తజకిస్తాన్‌లో జరిగిన ఓ సంఘటనను ఉటంకిస్తూ.. బ్రిజ్‌ భూషణ్‌కు ఏమి చేస్తున్నాడో అతనికి పూర్తిగా తెలుసునని వాదించారు. మహిళా రెజ్లర్‌ ఫిర్యాదును ప్రస్తావిస్తూ.. తజికిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిందితుడు ఫిర్యాదుదారు(మహిళా రెజ్లర్‌)ని గదిలోకి పిలిచి బలవంతంగా కౌగిలించుకున్నారని అన్నారు. నిరసన వ్యక్తం చేయగా.. తండ్రిలా చేశాడని చెప్పారు. దీంతో అతనికి తన చర్యలపై పూర్తి అవగాహన ఉందనడానికి ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పందించిందా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆమెకు అన్యాయం జరిగిందని అన్నారు.

ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సిఆర్‌పిసి సెక్షన్‌ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్‌ తరపు న్యాయవాది వాదనను అతుల్‌ ఖండించారు. నేరాలన్నీ దేశం బయట జరిగితే మాత్రమే సిఆర్‌పిసి సెక్షన్‌ 188 ప్రకారం అనుమతి  అవసరమని అతుల్ పేర్కొన్నారు.  అయితే బ్రిజ్‌ భూషణ్‌ విషయంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, దీంతో అనుమతి అవసరం లేదని అన్నారు. ఆయనపై అభియోగాలు మోపేందుకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్‌ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. ఈ మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో విడివిడిగా అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయయని, అయితే కోర్టు వాటన్నింటినీ ఒకే చోట విచారించిందని గుర్తుచేశారు.

మొదట్లో బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళ రెజర్లు ఆరోపించినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. సుప్రీం కోర్టు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా.. దిగి వచ్చిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం గమనార్హం.