బ్రిజ్‌భూషణ్ ప్రకటనపై రెజ్లర్లు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తప్పకుండా నీ లెక్క తేలుస్తామని బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు రెజ్లర్లు బదులిచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బిజెపి ఎంపి, రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షులు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ మంగళవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఎవరి దగ్గర ఆధారాలు లేవని, ఆరోపణలు చేసిన ఆటగాళ్లు ఉదయం ఒకలా, సాయంత్రం మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. మహిళా రెజ్లర్లకు తగిన న్యాయం జరిగిందని పేర్కొన్న ఆయన, జంతర్ మంతర్ వద్ద వాళ్లు నిరసనలు తెలిపినప్పుడు వారికి మద్దతుగా రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్‌తోపాటు సచిన్ పైలట్, ప్రియాంక గాంధీ వచ్చారన్నారు. మహిళా రెజ్లర్లకైతే న్యాయం జరిగింది కానీ, వారికి మద్దతుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చిన రాజస్థాన్ సిఎం మాత్రం తన రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రియాంక గాంధీ మౌనం పాటించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, రాజస్థాన్‌లో మహిళలు న్యాయం కోసం అడుగడుగునా పోరాడుతున్నారని బ్రిజ్‌భూషణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఘటనలకు పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రియాంక గాంధీని అడుగుతున్నానని చెప్పారు. ఈ ఘటనలపై సోనియా గాంధీ ఎందుకు స్పందించడం లేదని, ఆమె నోటికి ఎవరు తాళం వేశారని అన్నారు. రాష్ట్రంలోని ఆడవాళ్లకు గెహ్లాట్, పైలట్ ఎప్పుడు న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు సైతం బ్రిజ్‌భూషణ్‌పై తిట్లపురాణం సంధిస్తున్నారు. ఒక రేపిస్టు.. వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తడం ఆశ్చర్యంగా ఉందని చురకలంటిస్తున్నారు. దీంతో.. బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ లెక్కలు తప్పకుండా తేలుస్తామని హెచ్చరించారు. బ్రిజ్‌భూషణ్ ట్వీట్‌ను రెజ్లర్ బజరంగ్ పునియా రీట్వీట్ చేస్తూ.. 'మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి, ఇతరులకు అద్దం చూపిస్తున్నాడు. బ్రిజ్ భూషణ్ అధికార పార్టీకి చెందిన ఎంపి కాకపోయి ఉంటే, ఆయన కథ మొత్తం బట్టబయలై ఉండేది. అధికార రక్షణలో రెజ్లింగ్‌ను కబ్జా చేసి, నువ్వు చేసిన దారుణ పనులు.. భారత క్రీడా చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించబడతాయి' అని ఆగ్రహించారు. బ్రిజ్‌భూషణ్‌పై 'నీ లెక్క తేల్చే తీరుతాం' అని వినేశ్ ఫోగట్ ధ్వజమెత్తారు.