Feb 13,2021 07:00

డి. వెంకటలక్ష్మి 6 రోజులు పని చేసింది. ఆరు రోజులకు రూ. 428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో 'పని చేసిన దినములు -6' అని... మరల కింద ...'పని దినములు -2' అని రాశారు. పని చేసిన దినములు అంటే ఏంటి? పని దినములు అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ''క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా... 10 రోజుల్లో తవ్వుతారా... అనేది కూలీల ఇష్టం. మీరు ఎన్ని రోజులు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాము''. ఇది అధికార్ల జవాబు. వెంకటలక్ష్మికి ఆదివారం శెలవుదినంతో కలుపుకుంటే, 7 రోజుల పనికి గాను రూ. 428 ఇచ్చారు. అంటే ఒక్క రోజు పనికి అక్షరాలా రూ. 61.14 పైసలు.
  'ఇట్టెల్లారు. అట్టా వచ్చారు. రెండొందలు తెచ్చుకున్నారు'. 'కూలీలను మేపడానికే ఉంది ఈ పథకం. కూలోడు ఒక్కడు మాట వింటున్నాడా! మన చుట్టూ కూలోడు తిరగడంలా! కూలోడు చుట్టూ మనం తిరుగుతున్నాం!' 'అసలెందుకు ఈ చట్టం? ఎత్తి పారెయ్యక'!
   పాపం! తమ కష్టాలకి, నష్టాలకి అసలు కారకులెవరో తెలుసుకోలేని రైతు సోదరులు గ్రామీణ ధనిక వర్గానికి తోడై వెళ్ళగక్కే ఆక్రోశాలు ఇవి.
''ఎక్కడ గిట్టుబాటవుతుందండీ కూలి! ఎండాకాలం టాంకర్లలో నీళ్ళు తీసుకుపోయి తడిపితేగాని గడ్డపార దిగడం లేదు. ఊరికి ఆమడ దూరంలో చెరువు లోకి నడిచిపోయేసరికి సగం ఓపిక సచ్చిపోద్ది. ఇంకోపని దొరక్క కరువు పనిలో కుదురుకున్నాం.'' ఇదీ కూలీల ఘోష. ఏది వాస్తవం! ఏది అపవాదు!
   మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు చాలా గొప్పగా ఉంది. 'కూలీలను మేపడానికే ఉంది ఈ చట్టం'' అని గ్రామీణ ధనాఢ్య వర్గం ఆక్రోశిస్తుంటే, 'ఇది పేదల ఉద్ధరణ పథకం' అని పత్రికలు చదివే మధ్యతరగతి ఆశిస్తున్నది. ఏమయితేనేం! చట్టం వచ్చింది. అనేక పోరాటాల తరువాత ఈ చట్టం వెలుగు చూసింది. 'పనైనా చూపాలి! తిండైనా పెట్టాలి!' ఈ నినాదం ఎన్ని సభలు, సమావేశాల్లో మరెన్ని ప్రదర్శనల్లో మార్మోగిందో లెక్కించలేం. ఎమర్జెన్సీ తరువాత జ్యోతిబసు సారథ్యంలో వామపక్ష ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌లో, తమకున్న పరిమిత వనరులతో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భృతి కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో పని లేని రోజుల్లో కుటుంబానికి రోజుకు కిలో బియ్యం, 1 రూపాయి డబ్బు ఉచితంగా పంచింది. వామపక్ష ప్రభుత్వానికి గ్రామాల్లో అపూర్వ ప్రజాదరణ రావడానికిగల కారణాల్లో ఇదీ ఒకటి. ఈ పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణల ఫలితమే నేటి ఉపాధి హామీ చట్టం. ఇదేదో యుపిఎ ప్రభుత్వం అప్పనంగా చేతిలో పెట్టిన పథకం అనుకుంటే పొరపాటే. అయితే గడచిన కాలంలో పథకం అమలు ఎలా ఉంది. సర్కారీ సొమ్ము తేరగా కూలీలకు దోచిపెట్టే పథకమా! లేక గ్రామీణ శ్రామికుల శ్రమ దోపిడీ పథకమా?
   'కరువు పనులు' అని జనం నోళ్ళలో నానే 'ఉపాధి పనులు' మండు వేసవిలోనే జరుగుతాయి. ఉన్న మారాజులు ఎ.సి లు, కూలర్లు, అధమం ఫ్యానులు పెట్టుకొని సేద తీరే రోజుల్లో...గ్రామీణ శ్రామికులు పని కోసం వెంపర్లాడుతూ... పలుగు, పారా, తట్ట చేత పట్టుకొని, దాహార్తికి ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్ళు పట్టుకొని బయల్దేరతారు. అదే ఆడవాళ్ళయితే ఉదయాన్నే ఇంటెడు చాకిరీ చేసుకొని ఊరికి ఆమడ దూరంలో ఉన్న చెరువులు, కుంటలు, కాల్వల్లో మట్టి తవ్వి కట్టలు పోయడానికి బయల్దేరతారు. వారంతా గుంపులు గుంపులుగా చేరి పని చేస్తుండగా ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన ఫోటోలతో కూడిన కథనాలు...పత్రికలు, టీవీల్లో వార్తలుగా కనిపిస్తాయి. ఆ వార్తల చుట్టూ చర్చోపచర్చలు జరుగుతాయి.
    కార్మికుల ప్రధాన సమస్య వేతనం.2020-21 ఆర్థిక సంవత్సరానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనులకు రూ.237గా రోజు వేతనం నిర్ణయించాయి. అది కూడా 8 గంటలు పని దినం, ఎండాకాలం అత్యధిక కేలరీలు, ఒంట్లో శక్తి ఖర్చయ్యే శారీరక శ్రమకు ఇవే ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల వేతనాలు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడానికి 5 గంటలు పని దినంగాను ఇతర వ్యవసాయ పనులకు 6 గంటలు పని దినంగాను నిర్ణయించాయి. గతంలో మహిళా కార్మికులు నాట్లు, కోతల పనులకు ఉదయం 9-10 గంటల మధ్య పోయి సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చేవారు. శారీరక శ్రమతో కూడిన కరువు పనులు చేసి బతకడం తప్ప వేరే మార్గం లేని గ్రామీణ పేదల ఆరోగ్య పరిస్థితి, దేహదారుఢ్యం, ఒంట్లో సత్తువ. ఇవి ఏ కొంచెమైనా అధినేతల, అధికార్ల మెదళ్ళలో ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి పనులకు 8 గంటలు పనిదినం నిర్ణయించేశారు. నిర్ణయం చేసే ముందు ఏ ఒక్క అధికారి, అధినేత అయినా శ్రామికుడు, శ్రామికురాలితో చర్చించారా! అది జరగని పని కదా! అసలు చర్చించాలని అనుకోవడమే మన వెర్రిబాగులతనమేమో! ఓట్ల కోసం జనం దగ్గరికి పోయే నాయకులు, జనానికి సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు ఎందుకు జనం దగ్గరికి పోరో? ఇదా ప్రజాస్వామ్యం?
   రోజు వేతనం మరీ అన్యాయంగా నిర్ణయించారు. నైపుణ్యంలేని కార్మికులకు జిల్లా కలెక్టరు రోజు వేతనం నిర్ణయిస్తారు. ఆ లెక్కన విశాఖపట్నం జిల్లాలో రూ.439 నిర్ణయించారు. ప్రతి జిల్లాలో అలాగే ఉంటుంది. కాని ఉపాధి పథకం కార్మికులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.237 నిర్ణయించారు. ఇదేనా పేదలను ఉద్ధరించే తీరు.
  ఈ పథకం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనరులు, నీటి వనరులు పెరిగాయని అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కూడా. చెరువులు, పశువుల కుంటలు, పంట కాలువలు, చెక్‌ డ్యాంలు, పొలాల మధ్య బోదులు, మురుగు కాల్వల్లో పూడికతీత వంటి పనుల వల్ల నీటి వనరులు పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ట్రెంచీలు తవ్వి నీటి వనరుల లభ్యత పెంచుతున్నారు. సామాజిక అడవుల పెంపకం ఒక ముఖ్యమైన పని. కొన్ని ప్రాంతాల్లో రైతుల పొలాల్లో కంప చెట్లు కొట్టి మొదళ్ళతో సహా తవ్వి పారేస్తున్నారు. పడావుగా ఉన్న రైతుల భూములు సాగు లోకి వచ్చి పత్తి వంటి వ్యాపార పంటలు పండిస్తున్నారు. రైతుల భూముల విలువ పెరిగింది. ఎంత చేసినా ఉపాధి పథకానికి కేటాయించిన డబ్బు 'పేల పిండి చందమే'. ప్రజాధనం వృధా చెయ్యడమే అని గగ్గోలు ఎందుకు? కుక్కని చంపాలంటే అది పిచ్చిదని ముద్ర వెయ్యాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన వేతనం రూ. 439 కన్నా దిగ్గోసి అందులో దాదాపు సగం వేతనం రూ. 237 నిర్ణయించి, ఇక చాల్లే! నోరుమూసుకుని పని చెయ్యండి అన్న సంకేతాలిస్తున్నారు. పోనీ అదయినా అమలవుతోందా! చూద్దాం!
   డి. వెంకటలక్ష్మి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామ వాసి. ఆమె పే స్లిప్పు ప్రకారం 6 రోజులు పని చేసింది. ఆరు రోజులకు రూ. 428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో 'పని చేసిన దినములు -6' అని...మరల కింద ...'పని దినములు -2' అని రాశారు. పని చేసిన దినములు అంటే ఏంటి? పని దినములు అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ''క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా...10 రోజుల్లో తవ్వుతారా అనేది కూలీల ఇష్టం. మీరు ఎన్ని రోజులు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాము. అంటే ఒక క్యూబిక్‌ మీటరు తవ్వకానికి మూడు రోజుల శ్రమ అవసరమయితే, ఈ మూడు రోజులకు కలిపి రూ. 237 మాత్రమే ఇస్తాం''. ఇది అధికార్ల జవాబు. మరి ఆ లెక్కన రోజుకు రూ. 80 కూడా గిట్టుబాటు కాదు కదా అన్న మన ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. అది అధికార్లకు, ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారం అని మనం అనుకోవాలి. మరల వెంకటలక్ష్మి విషయానికి వద్దాం. ఆమె 'పేస్లిప్పు' ప్రకారం 6 రోజుల పనికి రూ. 428 ఇచ్చారు. ఆదివారం శెలవుదినంతో కలుపుకుంటే, 7 రోజుల పనికి గాను రూ. 428. ఒక్క రోజు పనికి అక్షరాలా రూ.61.14 పైసలు. బోధపడింది కదా! రోజుకు రూ.60, రూ.70 కూలి పడుతోందని ఉపాధి కార్మికులు మొత్తుకోడానికి గల కారణాలివి.
   ఇప్పటి ప్రభుత్వం వారి లెక్కకే వద్దాం. వెంకటలక్ష్మికి, పని చేసిన దినములు '6' అయినా క్యూబిక్‌ మీటర్ల లెక్కన పని దినములు '2' అని లెక్కగట్టి రూ. 428 చేతిలో పెట్టారు. అంటే ప్రభుత్వం వారి లెక్కన రూ. 214 రోజు వేతనం చెల్లించారు. మరి ప్రకటించిన రూ.237 కూడ ఎందుకు ఇవ్వలేదు? హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవుళ్ళంతా ఏకమయినా చెప్పగలరా జవాబు? మరో ఉదాహరణ. ప్రకాశం జిల్లాలో తోకల లక్ష్మి జాబ్‌ కార్డు ప్రకారం 45 రోజులు పని చేసిన దినాలకు మొత్తం రూ. 6,918 వేతనం ముట్టింది. 45 రోజులతో భాగిస్తే రోజు కూలి రూ. 153.73 పైసలు. తోకల భాస్కర్‌ జాబ్‌ కార్డ్‌ ప్రకారం 34 రోజుల పనికి రూ. 5,149 ముట్టింది. అంటే ఒక్క రోజు వేతనం రూ. 151.44 పైసలు. ఇక్కడ ఆదివారం వేతనంలో కూడిన సెలవు దినంగా ప్రకటించి లెక్కిస్తే వేతనం ఇంకా తగ్గిపోతుంది.
 

                                                   ఇప్పుడాలోచించి చెప్పండి ?

    ఇట్టెల్లి, అట్టొచ్చి రూ.200 తెచ్చుకునేది నిజమా? గ్రామీణ పేదల పట్ల ఎందుకీ అపవాదు. ఎందుకీ కక్ష. సోషల్‌ ఆడిట్టు మరో 'సిత్రం'. చెరువులు, కుంటలు వగైరా మట్టి పని చేసిన సంవత్సరానికి గాని సోషల్‌ ఆడిట్‌ బృందం పరిశీలించదు. ఫలితంగా రెండు నష్టాలు ఉన్నాయి.
వేసవిలో తవ్వకం పని పూర్తయితే జూలై నుండి పడే వర్షాల వల్ల వర్షపు నీళ్ళకు కొట్టుకు వచ్చిన మట్టి చేరుతుంది కదా! మరి చేసిన పనుల అంచనా ఎలా కడతారు? కాబట్టి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము ఎక్కడ సోషల్‌ ఆడిట్‌ అధికార్ల ఆగ్రహాలకు గురువుతామోనని భావించి ఉపాధి కార్మికులతో అదనంగా పని చేయిస్తారు. కార్మికుల శ్రమకు విలువలేదు కదా! తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే. రెండవ నష్టం పని దినాలు. సోషల్‌ ఆడిట్‌ బృందం ఫీల్డు తనిఖీ చేసే వరకు మరలా ఆ పని చేపట్టడానికి లేదు. ప్రకాశం జిల్లా సింగమనేని పల్లె మంచినీటి చెరువు తవ్వకం గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం ఎందుకు తవ్వకం పని జరగ లేదన్న ప్రశ్నకు సోషల్‌ ఆడిట్‌ బృందం తనిఖీ చేయకుండా మరల పని చేపట్టరని చెప్తున్నారు. గ్రామంలో సరాసరి 45 రోజుల కన్న ఎక్కువ పని కల్పించలేదు. మిగిలిన 155 రోజులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు.
   ఇప్పుడు ప్రభుత్వం వారి వెబ్‌సైట్‌ చుద్దాం. ఎ.పి లో 94 లక్షల జాబ్‌ కార్డులున్నాయి. 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలు కేవలం 4 లక్షల 11 వేలు అనగా 4.36 శాతం కుటుంబాలే. తెలంగాణ లోనూ అదే పరిస్థితి. చట్ట ప్రకారం వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కానీ దాని ఊసే లేదు.
   మొత్తం కార్మికులలో సామాజిక పొందిక చూస్తే...దళితులు, గిరిజనలు 40 శాతం, మహిళలు 59 శాతం వున్నారు. అనగా జనాభాలో దళితులు, గిరిజనులు, మహిళల శాతం కన్నా ఉపాధి కార్మికుల్లో వారి సంఖ్య ఎక్కువ ఉంది. సమాజంలో వెనక్కి నెట్టివేయబడ్డ వర్గాలే ఉపాధి కార్మికుల్లో అత్యధికులుండగా వారి ఉద్ధరణ పేరుతో అటు ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది. ఇటు సమాజం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కుతోంది. 'సామాజిక న్యాయం కోసం మునిగి తేలుతున్నాం' అనే ప్రభుత్వాధినేతలకు ఈ సమస్య పట్టలేదు సరే. మరి ప్రజాసంఘాల మాటటేమిటి ?
   గ్రామీణ శ్రామికులను సంఘటితం చేసే సంఘాలకు కొదవ లేదు. అయినా ఉపాధి హామీ కార్మికుల గతి ఇలా ఉంది. కారణం వారు అట్టడుగు భాగంలో ఉండి గొంతులు మూగబోయిన గ్రామీణ పేదలు కావడమే. ''ఎవరుకన్న బిడ్డరా! ఎక్కిఎక్కి ఏడ్చింది.'' అన్నట్లయింది వారి పరిస్థితి.
 

( వ్యాసకర్త 'ఐద్వా' జాతీయ కోశాధికారి )

ఎస్‌. పుణ్యవతి

s.punyavati