Sep 20,2023 13:15

జెనీవా : అధిక రక్తపోటుతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే భారతదేశంలో 46 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని తాజా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నివేదిక వెల్లడించింది. మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 78వ సెషన్‌లో 'గ్లోబల్‌ రిపోర్ట్‌ ఆన్‌ హైపర్‌ టెన్షన్‌ : ది రేస్‌ ఎగెనెస్ట్‌ ఎ సైలెంట్‌ కిల్లర్‌' అనే పేరుతో డబ్ల్యుహెచ్‌ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశంపై డబ్ల్యుహెచ్‌ఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు ఉన్న ఐదుగురిలో దాదాపు నలుగురికి తగిన చికిత్స లేదు అని ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశాలు అధిక రక్తపోటు సమస్యపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. 2050 నాటికి సుమారు 76 లక్షల మరణాలను నివారించవచ్చని ఈ నివేదిక పేర్కొంది. ఇక భారత్‌లో 30-79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో రక్తపోటును నియంత్రించగలిగితే 2040 నాటికి కనీసం 40 లక్షల మంది మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే వయసులో ఉన్నవారు 188.3 మిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. భారతీయుల్లో కేవలం 37 శాతం మంది మాత్రమే అధిక రక్తపోటు సూచనలను సకాలంలో గుర్తించారని, వారిలో 30 శాతం మంది చికిత్స పొందుతున్నారని ఈ నివేదిక తెలిపింది.
కాగా, 50 శాతం నియంత్రణా రేటును సాధించాలంటే.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న 67 లక్షల మందికి సమర్థవంతంగా చికిత్స చేయవలసి ఉంటుంది అని డుబ్య్లహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. 140/90 మి.మీ హిమోగ్లోబిన్‌ డేటా ఆధారంగా డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక తయారుచేసింది. అధిక రక్తపోటు ఉంటే.. గుండె నొప్పితోపాటు గుండె, కిడ్నీ వంటి అవయవాలు డ్యామేజ్‌ అవతాయి. అలాగే అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.