
గువహటి : సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన బిజెపి నేత దిబన్ దేకా అసోం పోలీసుల ఎదుట లొంగిపోయారు. 24 సంవత్సరాల పాటు బిజెపి సేవకు అంకితమయ్యానని చెప్పుకుంటున్న ఆయన.. నూతనంగా ఏర్పాటు చేయబడ్డ బాలాజీ జిల్లాలోని పటాచార్కుచి పోలీస్ స్టేషన్‌లో బుధవారం అర్థరాత్రి లొంగిపోయారు. సెప్టెంబర్ 20న జరిగిన ఎస్‌ఐ పరీక్షల ప్రశ్నా పత్రాలకు దిబన్ లీక్ చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 19న గువహటిలోని ఒక లాడ్జిలో 50 మంది అభ్యర్థుల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన చేతిరాతతో కూడిన కాపీలు బయటపడ్డాయి. లాడ్జిలో సోదాలు నిర్వహించిన పోలీసులు ప్రశ్నా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ లీక్‌కు బిజెపి నేత కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత కుమార్ దత్తా పరారీలో ఉన్నారు. ఈ కుంభకోణంలో నీతిలేని పోలీసుల హస్తం కూడా ఉందంటూ బిజెపి నేత ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌పై కూడా ఆరోపణలు చేశారు. దిబన్ చేసిన ఆరోపణలను డైరెక్టర్ జనరల్ ఖండించారు.