Nov 05,2023 10:46

నియామక ప్రక్రియ ఆలస్యం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాజస్థాన్‌ సర్కారు విఫలం
నిరుద్యోగుల ఆగ్రహం
జైపూర్‌ : 
 రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగా ఉండటం అక్కడి నిరుద్యోగులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నా నియామక ప్రక్రియ సరిగ్గా జరగటం లేదని అక్కడి నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు ఆరోపిస్తున్నారు. పేపర్‌ లీకులు, నియామక ప్రక్రియలో ఆలస్యం వంటివి అక్కడి నిరుద్యోగులకు శాపంగా మారాయని అంటున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూశారు. యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటూ సర్కారు కొలువు కోసం తీవ్రంగా శ్రమించారు. నోటిఫికేషన్లు వచ్చినా.. పేపర్‌ లీకులు కావటం, పరీక్షలు సక్రమంగా జరిగినా.. నియామక ప్రక్రియలో జాప్యం చోటుచేసుకో వటం వంటివి రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఇది అక్కడి నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. టీచర్లు, పట్వారీ వంటి పోస్టుల భర్తీ విషయంలో పేపర్‌ లీకులు గత ఐదేళ్లలో అనేకం చోటు చేసుకు న్నాయని వారు తెలిపారు.

పూర్తి కానీ రీట్‌ ప్రక్రియ
2021 సెప్టెంబర్‌ లో 48 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలకు గానూ రాజస్థాన్‌ ఎలిజిబులిటీ ఎగ్జామ్‌ ఫర్‌ టీచర్స్‌ (రీట్‌) నిర్వహించారు. ఆ పరీక్ష తర్వాత రద్దయింది. దీంతో లక్షలాది మంది ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2023 ఫిబ్రవరిలో మళ్లీ పరీక్ష నిర్వహించినా.. అది అంత సజావుగా సాగలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాగో జాయినింగ్‌ ప్రక్రియ వరకు వచ్చినా.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావటంతో అది కూడా నిలిచిపోయింది.

ఫారెస్ట్‌ గార్డ్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌
2022 అక్టోబర్‌లో ఫారెస్ట్‌ గార్డ్‌ పరీక్షను నిర్వహించారు. అందులో పేపర్‌ లీక్‌ ఘటన చోటు చేసుకున్నది. దీంతో ప్రభుత్వ కొలువుకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
పట్వారీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల భర్తీ విషయంలోనూ ఇలాంటి లీకు ఘటనలే చోటు చేసుకున్నాయని నిరుద్యోగులు గుర్తు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌ సర్కారుపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.