Jul 17,2023 22:32

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గత ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 121 దేశాల్లో 107 వస్థానంలో భారత్‌ నిలిచిందని ఐరాస సాక్షిగా వెల్లడించగా, నీతి ఆయోగ్‌ అందుకు పూర్తి భిన్నమైన చిత్రం ఆవిష్కరించింది. దేశంలో గత అయిదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని సోమవారం వెల్లడించింది. దేశంలో అధికారిక సర్వేలు, గణాంకాలు తప్పుల తడక అని, రాజకీయ జోక్యం పెరిగిపోతుండడం వల్ల గణాంకాలు విశ్వసనీయత కోల్పోతున్నాయని పలువురు ఆర్థిక వేత్తలు, మేధావులు విమర్శించిన నేపథ్యంలో అన్ని రకాల ఆర్థిక సర్వేలు, గణాంకాల సమీక్షకు కొత్త స్టాండింగ్‌ కమిటీ వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన మూడు రోజులకే నీతి ఆయోగ్‌ ఈ నివేదిక వెలువరించడం గమనార్హం. కార్పొరేట్ల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికా సంఘం స్థానే పుట్టుకొచ్చిన నీతి ఆయోగ్‌ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఐదేళ్లలో (2015-16, 2019-21 మధ్య) 13.5 కోట్ల (13,54,61,035) మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది. 2022 ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌) లో మన దేశం 107 వ స్థానంలో ఉంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 6 స్థానాలు దిగజారిందని వెల్లడించింది. ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్‌ (99), శ్రీలంక(64), నేపాల్‌ (81), బంగ్లాదేశ్‌ (84) మన కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. 'నేషనల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌: ఎ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ రివ్యూ 2023' నివేదికను నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బెరీ, నీతి ఆయోగ్‌ సభ్యులు వికె పాల్‌, అరవింద్‌ వీరమణి, నీతి వయోగ్‌ సిఇఒ బివిఆర్‌ సుబ్రమణ్యం సోమవారం నాడిక్కడ విడుదల చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) మధ్య పేదరికాన్ని తగ్గించడంలో దేశం పురోగతిని వివిధ రూపాల్లో పేదరిక సూచిక (ఎంపిఐ) సూచిస్తుందని నీతి ఆయోగ్‌ తెలిపింది. పేదరికాన్ని కొలిచే పద్ధతులను మార్చడం, ప్రాతిపదికల్లో కొన్నిటిని తొలగించడం ద్వారా పేదరికం తగ్గినట్టు చూపింది. పోషకాహారం, పిల్లలు, కౌమారదశ మరణాలు, తల్లి ఆరోగ్యం, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట ఇంధనం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, ఇళ్లు, ఆస్తులు బ్యాంకు ఖాతాలు వంటి మొత్తం 12 అంశాలు ప్రాతిపదికన ఈ నివేదిక ఇచ్చారు.
నివేదిక ప్రకారం.. దేశంలో వివిధ రూపాల్లో పేదల సంఖ్య 2015-16లో 24.85 శాతం నుంచి 2019-2021లో 14.96 శాతం నుంచి 9.89 శాతం (13,54,61,035 మంది) పాయింట్లకు గణనీయమైన క్షీణతను నమోదుచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి వేగంగా క్షీణించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది.
పేదల సంఖ్యలో అతిపెద్ద క్షీణత ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది. 3.43 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 707 అడ్మినిస్ట్రేటివ్‌ జిల్లాలకు పేదరికం అంచనాల్లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పేదల నిష్పత్తిలో అత్యంత వేగంగా తగ్గుదల ఉన్నట్టు నివేదిక పేర్కొంది.
ఐదేళ్లలో ఎంపిఐ విలువ 0.117 నుండి 0.066కి తగ్గింది. పేదరికం తీవ్రత 47 శాతం నుండి 44 శాతానికి తగ్గింది. పారిశుధ్యం, పోషకాహారం, వంట ఇంధనం, ఆర్థిక సమ్మేళనం, తాగునీరు, విద్యుత్‌ను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించడం ఈ రంగాల్లో పురోగతికి దారితీసిందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. ఎంపిఐ మొత్తం 12 పారామీటర్ల గుర్తించదగిన మెరుగుదలను చూపించాయని తెలిపింది. పేదరికాన్ని తగ్గించడంలో పోషకాహారంలో మెరుగుదల, పాఠశాల విద్య, పారిశుధ్యం, వంట ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది.

  • ఎపిలో 30.19 లక్షల మంది ...

ఆంధ్రప్రదేశ్‌లో (2015-16, 2019-21 మధ్య) ఐదేళ్లలో 30,19,718 మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 2015-16లో 11.77 శాతం నుంచి 2019-2021లో 6.06 శాతానికి అంటే 5.71 శాతం పేదరికం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 14.72 శాతం నుంచి 7.71 శాతానికి వేగంగా క్షీణించింది. అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది.


జిల్లా                    2015-16 (శాతాల్లో) 2019-21
అనంతపురం             12.47                6.74
చిత్తూరు                   9.64                  5.66
తూర్పు గోదావరి        8.51                   6.13
గుంటూరు                7.26                   4.36
కృష్ణా                       8.69                   4.38
కర్నూలు                  19.64               12.84
ప్రకాశం                     13.84                  6.28
నెల్లూరు                      11.27                 5.41
శ్రీకాకుళం                     14.01                 5.20
విశాఖపట్నం                  15.10                7.60
విజయనగరం                  19.00                8.66
పశ్చిమగోదావరి               9.11                    2.42
కడప                             9.14                    3.34