Oct 01,2023 22:27

ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌గా రెవెన్యూ శాఖ
మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :కేంద్ర ప్రభుత్వంలోని నీతిఆయోగ్‌ వారిచ్చిన మోడల్‌ ప్రకారం మనమే టైటిల్‌డీడ్‌ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రెవెన్యూ డిపార్టు మెంట్‌ పేరును ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పేరు మార్పు విషయంపై సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఎపి రెవెన్యూశాఖ 17వ రాష్ట్ర స్ధాయి కౌన్సిల్‌ సమావేశం ఎపి ఆర్‌ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సభకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ధర్మాన మాట్లాడుతూ రెవెన్యూశాఖలో అనేక సంస్కరణలు అమలు చేసేందుకు సిఎం చర్యలు తీసుకున్నారన్నారు. చుక్కల భూములు, షరతుల భూములు, నిషేధిత భూముల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మరింత శక్తివంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగులదేనన్నారు. గతంలో 30లక్షల ఎకరాల భూమిని ఫ్రభుత్వం పేదలకు పట్టాలిచ్చిందన్నారు. పేదల భూమిని రక్షణ కోసం 1977లో ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ను తీసుకువచ్చారన్నారు. నిరుపేదలకు సంపూర్ణ హక్కులు కల్పించడం ద్వారా వారి స్ధాయి సమాజంలో పెరుగుతుందన్నారు. పిఓటి యాక్ట్‌ సవరణ చేయడం ద్వారా పేదలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. భూముల విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు అప్‌డేట్‌గా ఉండాలని లేని పక్షంలో అప్రతిష్టపాలవుతామని మంత్రి తెలిపారు. స్దానికంగా నాయకులు చట్టానికి విరుద్దంగా ఏదైనా సిఫార్సు చేసే సున్నితంగా తిరస్కరించే పద్దతిని అవలంభించాలన్నారు. గతంలో తాను మంత్రిగా ఎవరైనా అర్జీ పట్టుకుని వస్తే ఏమి రాస్తాము, సింపుల్‌గా ప్లీజ్‌ ఎగ్జామిన్‌ అని తాను రాస్తే సిబిఐ తమను తప్పుపట్టిందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల స మస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందన్నారు.
సిసిఎల్‌ఎ కమిషనరు జి. సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మ్యుటేషన్లు రెవెన్యూశాఖలో ప్రధానం కాగా రాబోవు రోజుల్లో పట్టణ ఆస్తులను కూడా (ఓనర్‌షిప్‌) రిజిస్టర్‌ను తహసీల్దార్లు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామ కంఠాల్లోని ఇంటి స్థలాల నిర్వహణలో కూడా ప్రత్యేక రిజిస్టర్‌ను మెయిన్‌టెయిన్‌ చేయాలన్నారు. త్వరలో ల్యాండ్‌ టైటిల్‌ ఆఫీసరు వ్యవస్ద రాబోతుందన్నారు.
ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, జూన్‌20ని రెవెన్యూ డే గా ప్రకటించాలని, జిల్లాల్లో ప్రొటోకాల్‌ కోసం బడ్జెట్‌ను ముందుగానే కేటాయించాలనిఆఫీస్‌ సబార్డినేట్‌ ను ంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకు అందరికీ ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో 26 జిల్లాల ఉద్యోగులు హాజరయ్యారు.
క్యాపిటల్‌ సిటీ ఎపిజెఎసి అమరావతి నూతన కార్యవర్గం:
రాజధాని కేంద్రంలోని హెచ్‌ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులతో ఆదివారం నూతన కమిటీని ప్రకటించారు. సిటీ కమిటీ ఛైర్మన్‌గా ఆర్‌ దుర్గా ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా మందపాటి శంకరరావు, అసోసియేట్‌ ఛైర్మన్‌గా కోసూరి సురేంద్ర, కోశాధికారిగా బి.విజయరాఘవతో పాటు మ రో 20మందితో కమిటీని ఎన్నుకున్నారు.