Aug 15,2023 11:38

కాకి లెక్కలు
బ్యాంక్‌ ఖాతా ఉన్నా అంతేనట
లోపభూయిష్టంగా నీతి ఆయోగ్‌ అంచనాలు
ఐరాస నివేదికతో వాస్తవాలు బట్టబయలు
న్యూఢిల్లీ : 
 దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని నీతి ఆయోగ్‌ ఇటీవల ఓ నివేదికలో గొప్పగా ప్రకటించింది. ఆ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో దేశంలోని 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. దీనర్థం వారంతా ఇప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని. అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారని, వారిప్పుడు దారిద్య్రరేఖకు దిగువన నివసించడం లేదని.

ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం దేశంలోని 74% మంది ప్రజలకు ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడం లేదు. సరైన ఆహారమే లభించనప్పుడు పేదరికం నుంచి ఎలా బయటపడ్డట్టు? అసలు పేదరికాన్ని నిర్ణయించే పద్ధతి ఏమిటి? పేదరిక సూచికలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయా? అనే విషయాలను పరిశీలిస్తే వాస్తవాలు అవగతమవుతాయి. దేశంలో వినియోగ పేదరిక రేఖకు దిగువన ఎంత మంది ఉన్నారు? జనాభాలో వారి వాటా ఎంత? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు. ప్రపంచ దేశాలలో పేదరికాన్ని అంచనా వేయడానికి దశాబ్దాలుగా వినియోగ పేదరిక రేఖనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా మన దేశంలో కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. 2017-18లో జాతీయ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) వినియోగ వ్యయ సర్వేను నిర్వహించింది. దానిని ప్రభుత్వం ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. 2022-23, 2023-24 సంవత్సరాలలో కూడా ఇలాంటి సర్వేలే నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఓ ప్రకటించింది. గత పది సంవత్సరాలలో వినియోగ పేదరికం ఎలా ఉన్నదో ఈ సర్వేలలో తేలవచ్చు. నీతి ఆయోగ్‌ మాత్రం హడావిడిగా మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపిఐ)ని విడుదల చేసింది. దానికి కొద్ది రోజుల ముందు ప్రపంచ ఎంపిఐ అంచనాలు విడుదలయ్యాయి.

12 సూచికలతో...
ప్రపంచ ఎంపిఐ అంచనాల కోసం పది వేర్వేరు సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో విద్య, ఆరోగ్యం, విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, వంటగ్యాస్‌, ఇంటి గచ్చు, వినియోగ ఆస్తులు వంటి సూచికలు ఉన్నాయి. వేర్వేరు సూచికలను కలగలిపి, ఓ సూచికను నిర్ణయించడం లోపభూయిష్ట విధానమేనని చెప్పాలి. ఇక దేశంలో ఎంపిఐని అంచనా వేయడానికి 12 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచ ఎంపిఐ కోసం తీసుకున్న పది సూచికలతో పాటు గర్భిణుల ఆరోగ్యం, బ్యాంక్‌ ఖాతాలను కూడా చేర్చారు. అంతర్జాతీయ ఎంపిఐ నివేదిక ప్రకారం 2005-06లో మన దేశంలో పేదరికం జనాభాలో 54% ఉంటే 2015-16 నాటికి 27.9%కి తగ్గిపోయింది. అది 2019-20 నాటికి మరింత తగ్గి 16%గా నమోదైంది.

6-14 ఏళ్ల పిల్లలకు చోటు లేకుండా...
మన దేశంలో ఎంపిఐ అంచనాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో పరిశీలిద్దాం. పౌష్టికాహార సూచికలో 6-14 సంవత్సరాల మధ్య వయసున్న వారిని పరిగణనలోకి తీసుకోలేదు. దేశ జనాభాలో వీరు 18% పైగానే ఉన్నారు. ఈ వయసు వారిలో మూడింట రెండు వంతుల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనిని బట్టి చూస్తే సూచికలో అనేక మంది పేదలను లెక్కలోకే తీసుకోలేదని అర్థమవుతుంది. పైగా మన దేశంలో వయసుకు తగిన బరువు ఉండాలని అంటుంటే అనేక దేశాలలో వయసుకు తగిన ఎత్తు ఉండాలని చెబుతున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో 104.3 కోట్ల మంది (74.1%) ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పొందలేక పోతున్నారు.

వీరు పేదలు కారంటే ఎలా?
గర్భిణుల ఆరోగ్యాన్ని సూచికగా తీసుకోవడం కూడా సరి కాదు. ఉదాహరణకు వృత్తి నైపుణ్యం లేని ఆరోగ్య సిబ్బంది గర్భిణికి ప్రసవం చేసినా లేదా ప్రసవానికి ముందు ఆమెకు అవసరమైన నాలుగు ఆరోగ్య సంరక్షణ సేవలు అందకపోయినా ఆమెను పేదరాలిగా పరిగణించారు. మన దేశంలో 80%కి పైగా ప్రసవాలు ఆస్పత్రులలోనే జరుగుతున్నాయి. అంత మాత్రాన వారిని పేదవారు కారంటే ఎలా? ఈ విధంగా తప్పుడు సూచికలతో సర్వేలు నిర్వహిస్తే వాస్తవ చిత్రం ఎలా తెలుస్తుంది?. ఇంకో ఆశ్చర్యకరమైన సూచిక కూడా ఉంది. బ్యాంక్‌ లేదా పోస్టాఫీసులో ఖాతా లేని వారినే పేదవారిగా పరిగణించారు. ఓ సర్వే ప్రకారం దేశంలోని ప్రతి పది మందిలో తొమ్మిది మందికి ఆ తరహా ఖాతాలు ఉన్నాయి. బ్యాంక్‌ లేదా పోస్టాఫీసులో అకౌంట్‌ ఉన్నంత మాత్రాన వారిలో పేదలు ఉండరా?
అసలు దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో కచ్చితమైన సమాచారం లేదు. 2011లో జరిగిన జనగణనలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు జనాభాను అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి సహజంగానే 2015-16లో కంటే 2021లో జనాభా అధికంగా ఉంటుంది. మరి 2021లో ఎంతమంది పేదలు ఉన్నారో నిర్ధారించాలంటే ఆ సంవత్సరంలో దేశ జనాభా ఎంతో కచ్చితంగా తెలియాలి కదా? జనాభా సంఖ్య ఎంతో తెలియకుండా దేశంలో పేదరికం తగ్గిపోయిందని ఎలా చెబుతారు? పైగా నీతి ఆయోగ్‌ నివేదిక చూస్తుంటే 2015-16లోనూ, 2021లోనూ దేశ జనాభా ఒకేలా ఉన్నదని చెబుతోంది. దాని ఫలితంగానే 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని అంచనా వేసింది. ఒకవేళ 2021 జనాభా (అంచనా) ఆధారంగా 2019-21 కాలానికి ఎంపీఐ అంచనాలు వేశారని అనుకున్నా 41 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ సరైన పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం భారత్‌ను ఒడిఎఫ్‌ దేశంగా ప్రకటించేసింది.