Nov 24,2022 06:09

ఈజిప్టులో ప్రపంచ దేశాల 27వ పర్యావరణ సదస్సు ముగిసింది. కాప్‌-27గా పిలవబడే ఈ సదస్సులో పర్యావరణ దుష్ప్రభావాలకు లోనయ్యే దేశాలకు పరిహారం రూపంలో సాయం చెయ్యడానికి ఉద్దేశిస్తూ ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కేవలం ప్రకటన చేశారు తప్పించి ఆ నిధుల సమీకరణ, వినియోగం తదితర విధివిధానాలు చర్చించలేదు. ఆ విషయాలన్నీ వచ్చే ఏడాది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరగబోయే సదస్సులో చర్చించి నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి ఇలాంటి ఒక నిధి ఏర్పాటు చెయ్యాలన్న భావన రావడమే గొప్ప అన్నట్టుంది పరిస్థితి. పేద దేశాలన్నీ కలిసి ఒత్తిడి తీసుకురావడం వల్లనే ధనిక దేశాలు ఒప్పుకున్నాయి గానీ నిధి కార్యరూపంలో రావడానికి ఎంత మొరాయిస్తాయో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకూ జరుగుతున్న సదస్సుల్లో తీసుకుంటున్న నిర్ణయాలు పేపర్‌ మీదనే ఉంటున్నాయి తప్పించి అమలు కావడం లేదు. పర్యావరణంపై అమెరికా, యూరోప్‌ లాంటి దేశాల చిత్తశుద్ధి అలాంటిది మరి. ఆయా దేశాలు పర్యావరణంపై పూచీ పడడం, పడాల్సి ఉండడం పరోపకారి బుద్ధితో చెయ్యాల్సిన కార్యక్రమం కాదు. చేసిన నష్టానికి పరిహారంగా చెయ్యాల్సిన నైతిక బాధ్యత. తప్పించుకోలేని బాధ్యత. పారిశ్రామికీకరణ పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేసి ప్రపంచాన్ని ప్రమాదం లోకి నెట్టినందుకు చెల్లించాల్సిన మూల్యం. తిలాపాపం తలా పిడికెడు మాదిరిగా అన్ని దేశాలకూ ఇందులో బాధ్యత ఉన్నా, ఎక్కువ నష్టం కలగజేసినందుకు ధనిక దేశాలు ఎక్కువ పూచీ పడాలి. ప్రకృతి నుండి వారు తోడుకున్నంతా తోడుకొని ఇప్పుడు అన్ని దేశాలకూ ఉద్గారాల విషయమై ఒకే స్థాయి నియమాలు వర్తిస్తాయనడం మోసం. మిగిలిన దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనం వైపు మళ్లడానికి నిధులెక్కువ అవసరం. ఆ సాయం వారందించాలి. అలాగే పర్యావరణం దెబ్బతిన్న కారణంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతు న్నాయి. ఒక వైపు వరదలు మరో వైపు కరువులతో ప్రపంచదేశాలు నష్టపోతున్నాయి. నష్టానికి బాధ్యత వహిస్తూ వారికి అందించబోయే నిధుల్లో ధనిక దేశాలు పెద్ద పాత్ర తీసుకోవాలి. పూర్వ పారిశ్రామికీకరణ దశలో భూగోళానికి ఉన్న వేడిమికి ఒకటిన్నర సెంటిగ్రేడు కన్నా ఎక్కువ పెరగనియ్యరాదన్న గమ్యం చేరుకోవాలంటే ... పర్యావరణానికి ఎక్కువ నష్టం కలుగజేసిన, కలుగజేస్తున్న అమెరికా, యూరోప్‌ తదితర ధనిక దేశాలే అందులో ముఖ్య భూమిక పోషించాలి.
- డా. డి.వి.జి.శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.