Jun 29,2022 06:48

గత వారం రెండు అంతర్జాతీయ కూటముల ముఖ్యమైన సదస్సులు జరిగాయి. ఒకటి చైనా అధ్యక్షతన జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కాగా, రెండవది జర్మనీ అధ్యక్షతన ప్రధాన సామ్రాజ్యవాద దేశాలతో కూడిన జి-7 శిఖరాగ్ర సదస్సు. రెండు కూటములు రెండు విభిన్న దృక్పథాలను అనుసరించాయి. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం, ఘర్షణలు, ఆకలి, పేదరికం, వాతావరణ మార్పులు వంటి వాటి పరిష్కారంపై బిక్స్‌ దృష్టి సారించగా, తమ ఆధిపత్యానికి వ్యవస్థాగతంగా సవాల్‌ విసురుతున్న రష్యా, చైనాలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ధనిక దేశాల కూటమి కేంద్రీకరించింది. దీనికి కొనసాగింపుగా మాడ్రిడ్‌లో నాటో రెండు రోజుల శిఖరాగ్ర సదస్సును చూడాలి. యూరోపియన్‌ యూనియన్‌ కౌన్సిల్‌, జి-7, నాటో ఒక దాని తరువాత ఒకటి వరుసగా సమావేశం కావడం ప్రపంచాధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు ఎంతగా వెంపర్లాడుతున్నదీ తెలియజేస్తోంది. అంతకన్నా ముఖ్యమైన అంశం ఈ దేశాల ప్రభుత్వాలపై అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి పెంచుతున్న ఒత్తిడి.
       గత గురువారం జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం అనంతరం విడుదలజేసిన 'బీజింగ్‌ డిక్లరేషన్‌'ను, రెండు రోజుల క్రితం జి-7 విడుదలజేసిన ఉమ్మడి ప్రకటనను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య ఉత్తర, దక్షిణ ధ్రువాలకు ఉన్నంత తేడా ఉంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అభివృద్ధి, సహకారం, శాంతి, సుస్థిరతను నిలబెట్టడం కోసం పాటుపడాలన్న బ్రిక్స్‌ కూటమి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రపంచంలోని 170కి పైగా వర్థమాన దేశాలు, ప్రాంతాలు అభివృద్ధి, శాంతి, సుస్థిరతలనేే ప్రగాఢంగా కోరుకుంటున్నాయి. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది నిరాఘాటంగా సాగినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. శాంతి, సామాజిక సుస్థిరత సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా సామ్రాజ్యవాద దేశాలు రక్షణాత్మక విధానాలను ఆశ్రయిస్తున్నాయి. తన మాట వినని, తన ఆధిపత్యాన్ని సవాల్‌ చేసే దేశాలపై ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు బ్రిక్స్‌ దేశాలు తమ మధ్య వాణిజ్య లావాదేవీల్లో డాలర్‌కు బదులు జాతీయ కరెన్సీలను ప్రోత్సహించాలని నిర్ణయించడం ఒక మంచి పరిణామం.
         వ్యూహాత్మక భౌగోళిక రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తున్న చైనా, రష్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, దాని మిత్ర దేశాలు మ్యూనిచ్‌ లోని బవేరియా ఆల్ప్స్‌ను వేదికగా చేసుకున్నాయి. జి-7 సమావేశ స్థలిగా బవేరియాను ఎంచుకోవడంలోనే సామ్రాజ్యవాద దేశాల ఉద్దేశమేమిటో స్పష్టమవుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌ నాజీ సేనలు విడిది చేసిన ప్రాంతమది. సోవియట్‌ యూనియన్‌ను తన వలస రాజ్యంగా మార్చడం కోసం హిట్లర్‌ నాడు యత్నించగా, నేడు రష్యాతో తదుపరి యుద్ధ ప్రణాళికను ఖరారు చేసేందుకు పశ్చిమ దేశాలు ఇక్కడ గుమికూడాయి. ఉక్రెయిన్‌ను రష్యాకు వ్యతిరేకంగా ఎగదోసిన దేశాలే ఇప్పుడు దీనిని దీర్ఘకాలిక యుద్ధంగా మార్చాలని చూస్తున్నాయి. ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎన్ని ఆస్తులు ధ్వంసమైనా ఫికర్‌ లేదు. తమ ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్న సంపన్న దేశాల ధోరణి ప్రమాదకరమైనది. పశ్చిమ దేశాలు తమ దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చుకోడానికి ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాకు బ్రిక్స్‌ దేశాలు సహకరిస్తున్నాయంటూ మీడియా బాకాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ సంఘర్షణను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని బీజింగ్‌ డిక్లరేషన్‌ పేర్కొంటే, దీనికి భిన్నంగా ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం చాలా కాలం కొనసాగవచ్చని, అందుకు తయారుగా ఉండాలని జి-7 డిక్లరేషన్‌ చెబుతోంది. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందించడానికి బదులు ఆయుధాలు, ఉక్రెయిన్‌ సైనికులకు శిక్షణ, నాటో విస్తరణ వంటి వాటి గురించే తప్ప ఈ సంఘర్షణకు ముగింపు పలకాలన్న ధ్యాస వాటికి ఏమాత్రమూ లేదు. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్డుకు పోటీగా 60 వేల కోట్ల డాలర్లతో వచ్చే అయిదేళ్లలో వర్థమాన దేశాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ధనిక దేశాలు డాబుసరి ప్రకటనలు చేశాయి. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు అనేకం చేశాయి. అవేవీ ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు దీనికి కూడా అదే గతి పట్టదన్న గ్యారంటీ ఏమిటి? అంతే. ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన సామ్రాజ్యవాద దేశాల పన్నాగాలను తిప్పికొట్టేందుకు పేద, వర్థమాన దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరమెంతైనా ఉంది.