Dec 15,2022 07:17

అవసరమైతే ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు కూడా వుండాలని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు బొత్సా సత్యనారాయణ ఈ మధ్య జరిగిన ఒక సభలో వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గత మూడున్నరేళ్ల పాలనలో అనేక మార్లు ఉద్యోగులను చిన్నబుచ్చే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు వారి ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర చోటా మోటా నాయకులు మాట్లాడటం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితి ఉద్యోగుల పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్న వైఖరి ఎలాంటిదో తెలియజేస్తున్నది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతో ఆదరంగా స్వాగతించారు. వారి తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలో ఉద్యోగుల పట్ల , వారి సమస్యల పట్లా సానుకూలత ప్రదర్శిస్తారని ఆశించారు. జగన్మోహన్‌రెడ్డి కూడా ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో ఉద్యోగులు తన పై పెంచుకున్న ఆశలను బలపరుస్తూ హామీల వర్షం కురిపించారు.
కాస్త ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని నమ్మబలికారు. సిపిఎస్‌ సమస్య నాకొక లెక్కలోదే కాదని, వారం రోజులు చాలు, దాని పీక నొక్కడానికి అంటూ మురిపించారు. కరువు భత్యం బకాయిల కోసం చంద్రబాబును దేబిరించొద్దని, కాస్త ఆగితే మన ప్రభుత్వమే వస్తుంది. కరువు భత్యం బకాయిలను తెచ్చి మీ ఒడిలో కుమ్మరించి తీరుతుందని చెప్పారు. కనీవినీ ఎరుగని మేలు రకం పిఆర్సీ ఇచ్చి ఉద్యోగుల వేతన ఇబ్బందులకు స్వస్తి పలుకుతానని బాస చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను, అర్హత గల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, వారిని దశల వారీగా పైకి లాగేస్తామని వాగ్ధానం చేశారు. చంద్రబాబు పాలనలో మాదిరి ఇక బానిస వ్యవస్థ ఉండదని, సాయంత్రం 5.30 గంటల తరువాత ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి పోయి భార్యాబిడ్డలతో కలసి సంతోషాలు పంచుకోవచ్చని ఊరించారు.
ఇలాంటి వినసొంపు మాటలు అనేకం వెల్లడించడంతో ఉద్యోగులు తమ అభిమానం చాటుకున్నారు. అధికారం వచ్చింది. కానీ ఉద్యోగులకు మాత్రం నిజంగానే కనీవినీ ఎరుగని రివర్స్‌ పిఆర్సీ ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు. ఎదురు తిరిగిన ఉద్యోగుల పైకి పోలీసుల్ని ఉసిగొల్పారు. చలో విజయవాడ పిలుపును అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. అయినా తగ్గేదేలే అన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మధ్య బ్రిటిష్‌ పాలకుల మాదిరి విభజించి పాలించే పాచికను విసిరారు. మంత్రి చెప్పిన సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి బలవంతపు పిఆర్సీని కట్టబెట్టారు.
ఇక సిపిఎస్‌ విషయానికి వస్తే ..ఎరక్కపోయి హామీ ఇచ్చి తప్పు చేశామని, సిపిఎస్‌ రద్దు చేస్తే ప్రభుత్వం కొంప కొల్లేరు అయిపోతుందని, కాబట్టి జిపిఎస్‌తో ఎలాగోలా సరిపెట్టుకోమని సర్ది చెప్పడం మొదలు పెట్టారు. ఉద్యోగులు ఒప్పుకోలేదు. చలో విజయవాడకు పిలుపిచ్చారు. ఆ పిలుపును గృహ నిర్బంధాలతో నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. పోలీసులను ప్రయోగించి భయానక వాతావరణం సృష్టించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం కూడా నేటికీ అతీ గతీ కానక నత్తనడకన సాగుతున్నది. ఇప్పుడు తాజాగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఉసురు తీసే పనిలో పడింది. ఉద్యోగుల పట్ల ఇంత బాధ్యతా రహితంగా ప్రవర్తించిన ప్రభుత్వం తిరిగి నేరం ఉద్యోగుల మీద నెట్టడానికి ప్రయత్నించడం అన్యాయం. ఉద్యోగులు కావాలనే రోడ్డు ఎక్కి ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేస్తున్నారని ఆరోపించడమే కాకుండా , కాళ్లు పట్టుకోవడం నేర్చుకోవాలని , చీటికిమాటికి ధర్నాలు, ఆందోళనలు అంటూ రోడ్డు ఎక్కకూడదని ఎగతాళి చేస్తూ మాట్లాడటం మంత్రి స్థాయికి తగని పని. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వున్న ప్రజాప్రతినిధులే నోటిని అదుపులో పెట్టుకోకుండా వ్యవహరించడం దురదృష్టకరం.

  • ఉద్యోగ సంఘాల స్వతంత్రతను కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగ విధి

ఉద్యోగులు ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో భాగం. కాబట్టి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంటుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరించే ఉద్యోగుల బాగోగులు చూడటం ప్రభుత్వ కనీస ధర్మం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తోకలుగా వ్యవహరించాలని పాలకులు కోరుకోరాదు. వాటి స్వతంత్రతను గుర్తించి కాపాడటం ప్రభుత్వ విధి. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఘాలు పెట్టుకొనే హక్కును ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించింది. వాటిని ప్రజాస్వామ్య బద్ధంగా నడవనివ్వాలి. ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నించడం నేరం కాదు. అలా ప్రశ్నించ కూడదని ప్రభుత్వం భావించడం కూడా తగదు. అది ప్రజాస్వామ్య లక్షణం కాదు. ప్రశ్నించిన వారిని శిక్షలకు గురి చేయడం, వేధించి వేపుకు తినడం, భజనపరులను మాత్రం బుజ్జగించి ప్రోత్సహించడం , నజరానాలతో సత్కరించడం సమానత్వ స్ఫూర్తికి విరుద్ధం. నాయకత్వాలను లోబర్చుకొని సంఘాలను నిర్వీర్యం చేయాలనుకోవడం రాజ్యాంగం ఔన్నత్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడవలసిన కనీస ధర్మం ప్రభుత్వానిది. దాన్ని గౌరవించి మసలు కోవడం ప్రభుత్వానికైనా ఉద్యోగులకైనా తప్పనిసరి. పారదర్శకత గురించి ప్రభుత్వ పెద్దలు పదే పదే నొక్కి వక్కాణించడం కద్దు. మరి ఉద్యోగుల విషయంలో ఆ పారదర్శకత పాటించాలని ప్రభుత్వ నేతలకు గుర్తు చేయవలసిన పరిస్థితి తెచ్చుకోవడం వాంఛనీయం కాదు.
ఉద్యోగులు ప్రజల్లో కూడా భాగంగా వుంటారని ప్రభుత్వ పెద్దలు మరువ రాదు. ఓటు వేసే హక్కు, తమ బాధలు చెప్పుకొని పరిష్కారం చూపమని అడిగే హక్కు సాధారణ ప్రజలతోపాటు ఉద్యోగులకు కూడా వుంటుందని పాలకులు గుర్తెరగాలి. ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ఉన్నంత మాత్రాన వారిని కట్టు బానిసలుగా భావించి తాము చెప్పినట్టు నడుచుకు తీరాలని, ఇచ్చింది పుచ్చుకుని మూసుకొని కూర్చోవాలని అధికార జులుం చూపించడం అప్రజాస్వామికం. అన్యాయం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విరుద్ధం. నష్టం జరిగితే నిరసన తెలపడం, అన్యాయం జరిగితే ఆదుకోమని కోరడం, హక్కులు హరిస్తే ప్రశ్నించి ప్రతిఘటించడం ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఆ హక్కులన్నీ ఆగమైపోతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితి ఉద్యోగ-ఉపాధ్యాయ- కార్మిక- పింఛనుదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ప్రశ్నించే గొంతుల్ని బెదిరించడం , నిరసన కారుల్ని నిర్భందించడం పౌర స్వేచ్ఛకు ఆంక్షలు విధించడం ఆనవాయితీగా మారిపోయింది. కక్ష సాధింపులు , వ్యక్తిగత వేధింపులు ఉద్యోగ- ఉపాధ్యాయ- కార్మిక-పింఛనుదారులను మాత్రమే కాదు, వారి సంఘాలను, సంఘ నాయకుల్ని కూడా వదలడం లేదు. స్వతంత్ర భారత దేశంలో మునుపు ఎన్నడూ ఎరుగని కొత్త అనుభవం ఇది. హక్కులు హరించుకు పోతున్నాయి. ప్రయోజనాలు అడుగంటి పోతున్నాయి. రాయితీలు రద్దైపోతున్నాయి. అయినప్పటికీ చిత్తం, భత్యం అనాలి తప్ప ఎదిరించి అడగ కూడదు. ఆత్మాభిమానం చంపుకొని కాళ్లు పట్టుకోవడం ఒక్కటే మార్గమని స్వయానా మంత్రే చెప్పడం కంచే చేను మేసిన చందంగా వుంది.

  • హక్కులు ఊరికే రాలేదు, పోరాడి సాధించుకుంటేనే సమకూరాయి

75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులది ప్రత్యేక పోరాట చరిత్ర. ఉద్యోగుల సొంతమైన హక్కులు, అవకాశాలు, రాయితీలు, సౌకర్యాలు...ఇవేవీ ప్రభుత్వాలు దయతో ఇచ్చినవి కావు. ఉద్యోగులు సమరశీల పోరాటాలు సాగించి సాధించుకున్నవి. మంత్రి చెప్పినట్టు పాలకుల కాళ్లు చేతులు పట్టుకుంటేనో, లేక వాళ్ల అడుగులకు మడుగులొత్తితేనో వచ్చినవి కాదు. అపార త్యాగాల సొత్తుగా సంపాదించుకున్నవి. ఇప్పటి వరకు అమలైన ఏ పిఆర్సీ కూడా అయాచితంగా రాలేదు. తీవ్ర పెనుగులాట సాగిన తరువాతే అమల్లోకి వచ్చాయి. ఆ నాటి ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల పట్ల ఉక్కు పాదం మోపిన అనుభవాలు కోకొల్లలు. సస్పెన్షన్సు, డిస్మిస్‌లు , అరెస్టులు , కాల్పులు వంటి అనేక క్రూర చర్యలు దాటుకుంటూ వస్తే తప్ప ప్రయోజనాలు, హక్కులు అంది రాలేదు.
ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎగవేస్తున్న కరువు భత్యం ఒక హక్కుగా పొందడం కోసం సాగిన వీరోచిత పోరాటంలో ఆనాటి ఎన్జీవో సంఘ నాయకులు బదరీనాథ్‌, కుటుంబరావులను అప్పటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పాశవికంగా పొట్టన పెట్టుకుంది. అయినప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. పోరాటం సాగించి కరువు భత్యాన్ని హక్కుగా సాధించుకున్నారు. అలాంటి త్యాగాల వారసత్వ సంపదగా ఉద్యోగులు సాధించుకున్న కరువు భత్యాన్ని నేడు ఉనికిలో లేకుండా చేయడానికి పాలకులు శత విధాల ప్రయత్నిస్తు న్నారు. కాబట్టి మానాభిమానాలను పక్కకు నెట్టి అధికారం లోని అధినేతల దయాదాక్షణ్యాల కోసం వెంపర్లాడటం ఉద్యోగుల సంస్కృతి కానే కాదని మంత్రి తెలుసుకోవడం మంచిది. అయితే, ఉద్యోగుల్లో ఆ నాటి పోరాట స్ఫూర్తి ఈ నాడు కనిపించకపోవడం కూడా ఒక వాస్తవం. ఈ పరిస్థితికి పాలకులు తలకెత్తుకున్న సరళీకణ , ప్రైవేటీకరణ , ప్రపంచీకరణ విధానాలు ముఖ్య కారణం. ప్రయివేటు పెత్తనం పెరిగిన తరువాత ప్రభుత్వ యంత్రాంగం లోకి కాంట్రాక్టు , ఔట్‌ సోర్సింగ్‌ , డైలీ వేజ్‌ లాంటి తాత్కాలిక నియామక విధానాలు మొదలయ్యాయి. రెగ్యులర్‌ ఉద్యోగ వ్యవస్థ బలహీన పడింది. పోరాడే శక్తులకు ఐక్యత అతి ముఖ్యమైన ఆయుధం. ఆ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వాలు ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే అనేక కుయుక్తులు పన్నుతున్నాయి.
ప్రయివేటు పెత్తనం పెరిగిన తరువాత ప్రలోభాలు కూడా పెరిగాయి. వ్యక్తిగత అవకాశవాదం హెచ్చింది. ఇటువంటి భౌతిక వాతావరణంలో ..ఉమ్మడి ప్రయోజనాల కోసం నిలకడగా నిలబడటం కష్టమవుతుంది. ఇదే ఈ నాటి పాలకుల పాలిట వరమైంది కూడా. కాబట్టే ఈ రోజు ఒక్క ఉద్యోగులే కాదు, బాధిత ప్రజలు ఎవరైనా... వారు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగానే కాకుండా వాటి మనుగడకు కారణమైన ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడవలసి వుంది.
నేడు ఉద్యోగులతో సహా సకల బాధిత ప్రజల బాధలకు ప్రయివేటీకరణ విధానాలే కారణం. అవి ధనిక వర్గాన్ని బలపరిచేందుకు మాత్రమే అమలు చేయబడుతున్నాయి. కాబట్టే వాటికి అంతరాయం కలిగించే ఏ చర్యలనైనా పాలకులు సహించలేక పోతున్నారు. అందులో భాగంగానే మంత్రి అసహనపు మాటల్ని కూడా ఉద్యోగులు అంచనా వేసుకోగలగాలి. కాబట్టి నేటి తరం ఉద్యోగులు జరుగుతున్న నష్టాన్ని, కోల్పోతున్న హక్కుల్ని, హరించుకు పోతున్న ప్రయోజనాలను గొంతెత్తి నిలదీయగలగాలి. లేకపోతే మిగిలేది బానిసత్వం తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని గుర్తెరగాలి. బాధిత ప్రజలు ఎవరైనా వారి బాధల నివారణకు పోరాటాలకు సిద్దపడటం ఒక్కటే మార్గం. ఇంతకు మించిన దగ్గర దారి మరొకటి లేదని గ్రహించడం మీదే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చరిత్ర తెలియక అవాకులు, చవాకులు మాట్లాడే వారి నోళ్లు మూత పడేటట్టు చేయగల శక్తి కేవలం సమైక్య పోరాటాలకు మాత్రమే ఉందని ఉద్యోగులు, వారి సంఘాలు గ్రహించడం ముఖ్యం.

 p-rajagopal

 

 

 

- వి.రాజగోపాల్‌, పూర్వ అధ్యక్షులు ఎపిఎన్జీఓ అసోసియేషన్‌, విజయనగరం జిల్లా