
విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన జెన్‌కో సంస్థను ప్రైవేటుకు అప్పగించడానికి రాష్ట్రంలో జరుగుతున్న కసరత్తే దీనికి నిదర్శనం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంటును అదానీ పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు దాదాపుగా పూర్తి చేసింది. ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులతో పాటు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ టెండర్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం నేడు (గురువారం) ప్లాంటును అప్పగించడానికి ఆన్‌లైన్‌లో బిడ్లను ప్రభుత్వం పిలవనుంది. 21 రోజుల గడువుతో నవంబర్ చివరికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. పేరుకి ఓపెన్ బిడ్లు అయినప్పటికీ అదానీకి అప్పగించడం కోసమే ఈ తంతు నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే! కొంతకాలంగా అదానీ గ్రూపు విద్యుత్ రంగంలో పెట్టుబడులను భారీగా పెంచడం, ఆ సంస్థ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవడం కూడా ఈ దిశలో సంకేతాలే! బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ఈ కొనుగోళ్లు అధిక ధరతో చేసేవి కావడం గమనార్హం. ఇక అదానీకి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మధ్య జరిగిన భేటీల విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ఇప్పటికే అదానీ సంస్థ హస్తగతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మారుస్తున్నారన్న విమర్శలు తెలిసిందే.
జెన్‌కోను ఒక పథకం ప్రకారం అప్పుల ఊబిలోకి దించారు. రుణాలను చెల్లించలేదన్న సాకుతో కేంద్ర ప్రభుత్వం జెన్‌కోను ఎన్‌పిఎగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పరిధి లోని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ గతంలోనే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఎన్‌పిఎగా ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంటు నుండి విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు ఎక్కువవుతోందన్న ప్రచారం చేశారు. ఈ ప్లాంటుకు సమీపంలోని ప్రైవేటు ప్లాంట్లలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.2.60 ఖర్చు అవుతుండగా, జెన్‌కో ఆధ్వర్యంలో నడిచే ప్లాంటులో యూనిట్‌కు రూ.3.90 ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్లాంటుకు కావాల్సిన 30 శాతం బొగ్గును దక్షిణాఫ్రికా, ఇండోనేషియాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ప్రభుత్వ రంగ సంస్థకు ఉత్పత్తి సరిపడా బొగ్గును దేశంలోని గనుల నుండే ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? అవసరమైన బొగ్గు సరఫరా చేయకపోగా, ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న సాకుతో దాదాపు సగం ప్లాంటును మూసివేసి పెట్టుబడి ఖర్చు కూడా రావడంలేదని, అప్పులు కూడా తీర్చలేమని కొండంత రాగం తీస్తే ఎలా? నష్టాలకు కారణమైన ఈ పరిస్థితిని సరిదిద్దకుండా అదానీకో, అంబానీకో అప్పగించి చేతులు దులుపుకుంటామంటే సరిపోతుందా? పైగా దీనికి ఆపరేషన్, మెయిన్‌టెనెన్స్ మాత్రమే అప్పగిస్తున్నామని సమర్ధన! అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టుతో పాటు ప్రస్తుతమున్న సిబ్బంది అందరూ కొనసాగుతారని, వేతనాలు కూడా సమయానుకూలంగా పెరుగుతుంటాయని చెప్పడం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను తప్పుదారి పట్టించడానికే! కేవలం ఉద్యోగ భద్రత కోసమే వారు ఆందోళన చేయడం లేదు. ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టడానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో దాదాపు తొమ్మిది నెలలుగా సాగుతున్న పోరాటమది! మభ్యపరిచే ప్రకటనలతో, మాయ మాటల కుట్రతో నీరుగార్చలేమన్న విషయాన్ని పాలకులు తెలుసుకోవాలి. నయా ఉదారవాద విధానాల అమలులో విద్యుత్ సంస్కరణలదే కీలకపాత్ర! వీటిని ఎదిరించి ఏళ్ళ తరబడి కళ్లెం వేసిన చరిత్ర మన రాష్ట్రానిది. డిస్కామ్‌ల ప్రైవేటీకరణ, ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లంటూ పాలకులు కరెంటు కుట్రకు మళ్లీ తెరతీశారు. బషీర్‌బాగ్ పోరాట స్ఫూర్తితో వీటిని తిప్పికొట్టడానికి ప్రజలంతా కదలాలి.