- నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 17 న ఒకే దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. 230 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, ఈ నెల 31న పరిశీలన జరుగుతుందని అధికారులు తెలిపారు. నవంబర్ 2 వరకు తమ నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో 5.60 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. మొత్తం 5,60,60,925 మంది ఓటర్లలో, 2,88,25,607 మంది పురుషులు, 2,72,33,945 మంది మహిళలు, 1,373 మంది ఇతరులు థర్డ్ జెండర్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. చేర్పులు, తొలగింపుల తర్వాత మొత్తం 16,83,790 మంది ఓటర్లు జాబితాలో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ 229 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బిజెపి 136 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 2018 ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో 230 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, బిజెపి 109 సీట్లు గెలుచుకుంది. ఎస్‌పి, బిఎస్‌పి, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను అస్థిరపరచడమే లక్ష్యంగా చేసుకున్న బిజెపి ఆపరేషన్ కమలం పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహించింది. జ్యోతిరాదిత్య సింధియా, ఆయన అనుయాయులు బిజెపిలో చేరడంతో 15 నెలల తరువాత కమల్‌నాధ్ ప్రభుత్వం కూలిపోయింది. 2020 మార్చిలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బిజెపి అధికారంలోకి వచ్చింది.