- తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సిఇసి
- తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలో ఒకే దశలో పోలింగ్
- చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్
- డిసెంబరు 3న ఐదు రాష్ట్రాల ఫలితాలు
- ఐదు రాష్ట్రాల్లో 20.59 లక్షల ఓట్లు తొలగింపు
- 57.89 లక్షల కొత్త ఓటర్లు
- నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- తెలంగాణలో 6,10,694 ఓట్లు తొలగింపు
- 17,01,087 కొత్త ఓటర్లు
- వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 30న జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం నాడిక్కడ ఆకాశవాణి భవన్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సిఇసి చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయని, చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో జరగనున్నాయని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. 'ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8.2 కోట్ల పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. 20,59,539 ఓట్లు తొలగించాం. 57,89,227 కొత్త ఓటర్లు జత చేశాం. 18.37 లక్షల మంది 18-19 ఏళ్ల వయసు గల ఓటర్లను జత చేశాం. మిజోరం, చత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించాం. ఐదు రాష్ట్రాల్లో తక్షణమే సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది' అని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబరు 3న విడుదల కానుంది. నామినేషన్లకు గడువు నవంబరు 10 వరకు ఉంది. నామినేషన్ల పరిశీలన నవంబరు 13న జరగనుంది. ఉపసంహరణ గడువుగా నవంబరు 15 విధించారు. నవంబరు 30న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలో 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. 1.58 కోట్ల పురుషులు, 1.58 కోట్ల మహిళలు ఉన్నారు. వికలాంగులు 5,06,493 మంది, థర్డ్ జండర్ 2,557 మంది, సీనియర్ సిటిజన్స్ 4,43,943 మంది ఉన్నారు. 3,35,043 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయసు గలవారు. 17,01,087 మంది కొత్త ఓటర్లు. 6,10,694 ఓట్లు తొలగించారు. తెలంగాణలో జెండర్ రేషియో 998 ఉంది. 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 14,464 పోలింగ్ స్టేషన్లు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 20,892 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
119 అసెంబ్లీ స్థానాల్లో 88 జనరల్ కేటగిరి కాగా, 19 ఎస్‌సి, 12 ఎస్‌టి రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. 2018 డిసెంబరు 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం 2024 జనవరి 16న ముగియనున్నది.
ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్ నవంబరు 3 (శుక్రవారం)
నామినేషన్ల దాఖలకు గడువు నవంబరు 10 (శుక్రవారం)
నామినేషన్ల పరిశీలన నవంబరు 13 (సోమవారం)
ఉపసంహరణకు గడువు నవంబరు 15 (బుధవారం)
పోలింగ్ నవంబరు 30 (గురువారం)
ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 (ఆదివారం)
- రాజస్థాన్‌లో నవంబరు 23న ఎన్నికలు
200 సీట్లున్న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబరు 23న జరగనున్నాయి. రాజస్థాన్‌లో 5,25,38,655 మంది ఓటర్లు ఉన్నారు. 2.73 కోట్ల పురుషులు, 2.52 కోట్ల మహిళలు ఉన్నారు. 4,15,418 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయసు గలవారు. 10,57,251 మంది కొత్త ఓటర్లు. 3,95,934 ఓట్లు తొలగించారు. మొత్తం 51,756 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో 10,415 పట్టణ ప్రాంతాల్లోనూ, 41,341 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
200 అసెంబ్లీ స్థానాల్లో 144 జనరల్ కేటగిరి కాగా, 25 ఎస్‌సి, 43 ఎస్‌టి రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో ముగియనుంది.
ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్ అక్టోబరు 30 (సోమవారం)
నామినేషన్ల దాఖలకు గడువు నవంబరు 6 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన నవంబరు 7 (మంగళవారం)
ఉపసంహరణకు గడువు నవంబరు 9 (గురువారం)
పోలింగ్ నవంబరు 23 (గురువారం)
ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 (ఆదివారం)
- నవంబరు 17న మధ్యప్రదేశ్ ఎన్నికలు
230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబరు 17న జరగనున్నాయి. 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు. 2.88 కోట్ల పురుషులు, 2.72 కోట్ల మహిళలు ఉన్నారు. 7,78,789 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయసు గలవారు. 19,89,508 మంది కొత్త ఓటర్లు. 7,45,211 ఓట్లు తొలగించారు. మొత్తం 64,523 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో 16,763 పట్టణ ప్రాంతాల్లోనూ, 47,760 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
230 అసెంబ్లీ స్థానాల్లో 148 జనరల్ కేటగిరి కాగా, 35 ఎస్‌సి, 47 ఎస్‌టి రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 6తో ముగియనుంది.
ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్ అక్టోబరు 21 (శనివారం)
నామినేషన్ల దాఖలుకు గడువు అక్టోబరు 30 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన అక్టోబరు 31 (మంగళవారం)
ఉపసంహరణకు గడువు నవంబరు 2 (గురువారం)
పోలింగ్ నవంబరు 17 (శుక్రవారం)
ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 (ఆదివారం)
- మిజోరంలో నవంబరు 7న ఎన్నికలు
40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబరు 7న జరగనున్నాయి. 8,51,895 మంది ఓటర్లు ఉన్నారు. 4.13 లక్షల పురుషులు, 4.39 లక్షల మహిళలు ఉన్నారు. 9,677 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయసు గలవారు. 30,682 మంది కొత్త ఓటర్లు. 16,826 ఓట్లు తొలగించారు. మొత్తం 1,276 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో 525 పట్టణ ప్రాంతాల్లోనూ, 751 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
40 అసెంబ్లీ స్థానాల్లో 1 జనరల్ కేటగిరి కాగా, 39 ఎస్‌టి రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబరు 17న ముగియనుంది.
ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్ అక్టోబరు 13 (శుక్రవారం)
నామినేషన్ల దాఖలుకు గడువు అక్టోబరు 20 (శుక్రవారం)
నామినేషన్ల పరిశీలన అక్టోబరు 21 (శనివారం)
ఉపసంహరణకు గడువు అక్టోబరు 23 (సోమవారం)
పోలింగ్ నవంబరు 7 (మంగళవారం)
ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 (ఆదివారం)
రెండు దశల్లో చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు
90 సీట్లున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబరు 7న తొలి దశ మిజోరంతోనూ, నవంబరు 17న రెండో దశ ఓటింగ్ మధ్యప్రదేశ్‌తోనూ జరగనుంది. 2,03,60,240 మంది ఓటర్లు ఉన్నారు. 1.01 కోట్ల పురుషులు, 1.02 కోట్ల మహిళలు ఉన్నారు. 2,98,073 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయసు గలవారు. 10,10,699 మంది కొత్త ఓటర్లు. 2,90,874 ఓట్లు తొలగించారు. మొత్తం 24,109 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో 4,815 పట్టణ ప్రాంతాల్లోనూ, 19,258 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో 51 జనరల్ కేటగిరి కాగా, 10 ఎస్‌సి, 29 ఎస్‌టి రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3తో ముగియనుంది.
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్ అక్టోబరు 13 (శుక్రవారం)
నామినేషన్ల దాఖలుకు గడువు అక్టోబరు 20 (శుక్రవారం)
నామినేషన్ల పరిశీలన అక్టోబరు 21 (శనివారం)
ఉపసంహరణకు గడువు అక్టోబరు 23 (సోమవారం)
పోలింగ్ నవంబరు 7 (మంగళవారం)
ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 (ఆదివారం)
రెండో దశ ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్ అక్టోబరు 21 (శనివారం)
నామినేషన్ల దాఖలకు గడువు అక్టోబరు 30 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన అక్టోబరు 31 (మంగళవారం)
ఉపసంహరణకు గడువు నవంబరు 2 (గురువారం)
పోలింగ్ నవంబరు 17 (శుక్రవారం)
ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 (ఆదివారం)










