Feb 03,2021 19:00

లక్నో  : రైతు ఉద్యమంలో పాల్గనకుండా అడ్డుకునేందుకు పెద్ద మొత్తంలో వ్యక్తిగత బాండ్లను కోరకుండా చూడాలని అలహాబాద్‌ హైకోర్టు యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. యుపి ప్రభుత్వ చర్యలు ఏకపక్షంగా, న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్‌ రమేష్‌ సిన్హా, జస్టిస్‌ రాజీవ్‌ సింగ్‌లతో కూడిన లక్నో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం తరపున హాజరైన అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వి.కె సాహికి ధర్మాసనం సూచించింది. శాంతి భద్రతలను కాపాడేందుకే.. అధిక మొత్తంలో వ్యక్తిగత బాండ్లను, అదే మొత్తంలో జ్యూరీలను డిమాండ్‌ చేస్తున్నామంటూ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 50వేలు, రూ.పది లక్షల మొత్తాన్ని పూచీకత్తు కింద సమర్పించాలని జిల్లా మెజిస్ట్రేట్స్‌, ఎస్‌డిఎంలు మహిళలతో సహా ట్రాక్టర్‌ యజమానులను వేధిస్తున్నారని సీతాపూర్‌కు చెందిన అరుంధతి ధురు పిటిషన్‌ దాఖలు చేశారు. తనతో పాటు మరో ఇద్దరు రైతుల నుండి రూ. 50 వేలు, రూ.పది లక్షల వ్యక్తిగత బాండ్లను డిమాండ్‌ చేసినట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. రైతు ఉద్యమంలో రైతులు పాల్గొనకుండా అడ్డుకునేందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లు అరుంధతి ఆగ్రహం వ్యక్తం చేశారు.