
ఎన్నికల బాండ్ల విధానంలో తప్పొప్పులపై ఐదుగురు సుప్రీం న్యాయమూర్తుల బెంచ్ వాదనలు వింటోంది. ఐదేళ్ల క్రితం మొదలైన ఈ విధానం అనతి కాలంలోనే ఎన్నికల ఫండింగ్‌లో కీలకంగా మారింది. పార్టీలకు వచ్చే నిధుల్లో అరవై శాతం ఇదే మార్గాన వస్తుండడం విశేషం. అనుకున్నట్టుగానే వచ్చే నిధుల్లో 56 శాతం అంటే మిగతా పార్టీలకు వచ్చే నిధులకన్నా ఎక్కువ శాతం అధికార పార్టీకే దక్కుతున్నాయి. ఈ విధానంలో ఎవరైనా సంస్థలు, వ్యక్తులు తమ పేర్లు వెల్లడించకుండా స్టేట్ బ్యాంకులో డబ్బు చెల్లించి బాండ్లు కొని వాటిని తమకు నచ్చిన పార్టీకి డొనేట్ చెయ్యొచ్చు. ఆ పార్టీ వాటిని డబ్బుగా మార్చి ఎన్నికలకైనా, ఇతర సంబంధిత అవసరాలకైనా వాడుకోవచ్చు. ఇంతకు ముందు అలా డబ్బు రూపంలో అయితే డొనేట్ చెయ్యడానికి ఆ సంస్థ లాభాల్లో 7.5 శాతం మించకూడదన్న నియమం ఉండేది. ఈ విధానంలో అలాంటిదేమీ లేదు. పైగా నష్టాలొచ్చినా చెయ్యొచ్చు. విదేశీ సంస్థలైనా చెయ్యొచ్చు. ఎవరు వాటిని సమకూర్చారో బయటకు చెప్పనక్కరలేదు. కాబట్టి ఈ విధానం వల్ల ప్రజాస్వామ్య పద్ధతిలో కీలకమైన ఎన్నికలు పారదర్శకత లేకుండా తయారవుతున్నాయని ఒక వాదన. ఒక రకంగా అది నిజమే. ఒక పార్టీ ఎవరి ద్వారా నిధుల్ని పొందుతుందో తెలిస్తే ఆ పార్టీ ప్రాధాన్యతలపై ప్రజలకు అవగాహన ఉంటుంది. ఒకరికి ఒకరు సహకరించుకోవడం బహిర్గతమై కొంత అదుపు ఉంటుంది. తప్పుడు మార్గాల్లో వస్తున్న నిధులు...అంటే కుదేలైన సంస్థలు ఇచ్చే నిధులు బయటపడి అంతరార్ధాలు అర్థమవుతాయి. అభ్యర్థి నేర చరిత్ర తెలిస్తే ఎలాంటి లాభమో, పార్టీ సేకరించిన నిధుల మూలాలు తెలుసుకున్నా అలాంటి లాభమే ఉంటుంది. ఏదైనా పార్టీలు సేకరించే నిధులపై కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ఉన్నట్టుగానే సీలింగ్ ఉండాలి. లేదా వచ్చిన ఎన్నికల విరాళాల్ని గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు సమానంగా పంచే తటస్థ వ్యవస్థ ఉండాలి. లేదంటే కర్ర ఉన్నవాడిదే బర్రె తరహాలో నిధులన్నీ ఒకవైపే ప్రవహిస్తాయి. న్యాయస్థానం ఈ విషయంపై ఏం తీర్పు చెప్పనున్నదో చూడాలి.
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.