May 05,2023 09:40
  • కర్ణాటకలో 2018తో పోలిస్తే తొమ్మిది రెట్లు అధికం

బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. 2018తో పోలిస్తే ఇప్పుడు బాండ్ల రూపంలో పార్టీలకు తొమ్మిది రెట్ల సొమ్ము అధికంగా లభించింది. రాజకీయ పార్టీలకు నిధులు అందించేందుకు ఉద్దేశించిన ఈ బాండ్ల విక్రయాన్ని ఎస్‌బిఐ ఏప్రిల్‌ 3న ప్రారంభించి 12న ముగించింది. 29 శాఖల ద్వారా బాండ్లను విక్రయించింది. రాజకీయ పార్టీలకు అందించేందుకు ప్రజలు లేదా కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకుల నుంచి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2018 జనవరిలో ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టింది.
       గత నెలలో రూ.970.50 కోట్ల విలువైన 1,470 ఎన్నికల బాండ్లను బ్యాంక్‌ విక్రయించింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్యాంక్‌ ఈ వివరాలు అందించింది. 2018 ఎన్నికల సమయంలో ఏప్రిల్‌లో రూ. 114.90 కోట్ల విలువైన 256 బాండ్లు అమ్ముడుపోయాయి. ఈ సంవత్సరం అమ్మిన బాండ్లలో 58 శాతం బాండ్లను ఢిల్లీలో పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. హైదరాబాద్‌ ఎస్‌బిఐలో అత్యధికంగా రూ.335.30 కోట్ల విలువైన బాండ్లను విక్రయించారు. కొల్‌కతా, ముంబయి, చెన్నై, ఢిల్లీ బ్రాంచీలు ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి.